దుబ్బాకలో కారుకు టెన్షన్.. ట్రబుల్ షూటర్ పైనే భారం! 

సిద్ధిపేట జిల్లా దుబ్బాకకు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఉప ఎన్నిక అధికార టీఆర్ఎస్ పార్టీకి సవాల్ గా మారింది. గతంలో జరిగిన ఉపఎన్నికల్లో కారు పార్టీకి మంచి ఫలితాలే వచ్చాయి. ఉద్యమ సమయంలో పలు సార్లు టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తిరిగి ఎన్నికలు ఎదుర్కొన్నారు. అయితే ఎక్కువ సార్లు వారు మంచి మెజార్టీతోనే గెలిచారు. అధికారంలోకి వచ్చాక గత ఆరేండ్లలో జరిగిన ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీనే గెలిచింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేల అకాల మరణాలతో జరిగిన నారాయణ్ ఖేడ్, పాలేరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ సెంటిమెంట్ ను అధిగమించి మరీ టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. అయితే దుబ్బాక ఎన్నిక మాత్రం గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్టున్నట్లు కనిపిస్తోంది. అధికార పార్టీగా ఉన్నా, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ఉన్నా.. ఏదో కొంత టెన్షన్ ఉందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. 

 

దుబ్బాక ఎన్నికల ప్రచారంలో బీజేపీకి మంచి స్పందన వస్తుందని తెలుస్తోంది. ముఖ్యంగా యువత ఆ పార్టీ వైపు ఆసక్తి చూపుతున్నట్లు కనిపిస్తోంది. పార్టీ అభ్యర్థిగా ప్రచారం చేసుకుంటున్న సీనియర్ నేత  రఘునందన్ రావుపై వరుసగా ఓడిపోయారన్న సానుభూతి కూడా ప్రజల్లో వస్తోంది. తెలంగాణ ఉద్యమంలో యాక్టివ్ గా ఉన్న రఘునందన్ రావును ఓసారి అసెంబ్లీకి పంపించాలనే అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. అటు ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లను పూర్తిగా తమవైపు మలుచుకునేందుకు కమలనాథులు ప్రయత్నిస్తున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కుటుంబంపై జనాల్లో వ్యతిరేకత ఉన్నట్లు చెబుతున్న బీజేపీ నేతలు.. అది కూడా తమకు కలిసి వస్తుందని ఆశిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డి కార్యాచరణ ఎలా ఉండబోతుందో కూడా ఉప ఎన్నికలో కీలకం కానుంది. శ్రీనివాస్ రెడ్డి వర్గం మద్దతు కోసం బీజేపీ లోపాయకారిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

దుబ్బాకలో పరిస్థితిని గమనించే సీఎం కేసీఆర్.. గెలుపు బాధ్యతను మంత్రి హరీష్ రావుకు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. గతంలో కేసీఆర్ ఏ ఎన్నికను అప్పగించినా విజయంతో తిరిగొచ్చారు హరీష్ రావు. ఇప్పుడు దుబ్బాకలో కూడా గెలుస్తామని హరీష్ అనుచరులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో కారు పార్టీకి పరిస్థితులు అంతా అనుకూలంగా లేవని తెలుస్తోంది. అందుకే హరీష్ రావు దుబ్బాకలోనే మకాం వేసినట్లు చెబుతున్నారు. చిన్నచిన్న గ్రామాలకు కూడా వెళుతూ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నారు మంత్రి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నారు హరీష్ రావు. టీఆర్ఎస్ లోని అన్నివర్గాలు కలిసి పనిచేసేలా చూస్తున్నారు. దీంతో హరీష్ కు దుబ్బాక సవాల్ గా మారిందనే చర్చ టీఆర్ఎస్ లో జరుగుతోంది. బైపోల్ లో టీఆర్ఎస్ విజయం హరీష్ రావు పైనే ఆధారపడి ఉందని ఓపెన్ గానే చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు.

 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా దుబ్బాకపై స్పెషల్ ఫోకస్ చేసింది. బలమైన అభ్యర్థి కోసం గాలిస్తోంది. మాజీ ఎంపీ విజయశాంతిని బరిలోకి దింపాలని చూసినా.. రాములమ్మ నో చెప్పడంతో మరో అభ్యర్థి కోసం గాలిస్తోంది. దుబ్బాకలో గట్టి పోటీ ఇవ్వాలని, గెలవకపోయినా రెండో స్థానంలో ఉండాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీజేపీకి తమ కంటే ఎక్కువ ఓట్లు వస్తే.. రాష్ట్రంలో పార్టీకి నష్టమంటున్నారు కాంగ్రెస్ నేతలు. టీఆర్ఎస్ ప్రత్యామ్నాయం తామేనని, బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకూడదని నిర్ణయించారు. అందుకే బలమైన వ్యక్తిని పోటీ పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. దీంతో గెలవకపోయినా కనీసం సెకండ్ ప్లేస్ అయినా వస్తుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.