గులాబి గూటి నుంచి కాంగ్రెస్ లోకి వలసలు! ఖమ్మం టీఆర్ఎస్ లో కుదుపు!

తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. సాధారణంగా విపక్ష పార్టీల నుంచి అధికార పార్టీలోకి వలసలు ఉంటాయి.  అయితే తెలంగాణలో మాత్రం అందుకు భిన్నంగా ప్రస్తుతం అధికార పార్టీ నుంచే వలసలు పెరుగుతున్నాయి. నిన్న గాక మొన్న  జీహెచ్ఎంసీ కార్పొరేటర్ విజయారెడ్డి గులాబీ పార్టీని వీడి హస్తం నీడకు చేరారు. విజయారెడ్డి మాజీ ఎమ్మెల్యే పీజేఆర్ తనయ అన్న సంగతి విదితమే. ఆమె గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతూ ప్రజలను నిజమైన న్యాయం కాంగ్రెస్ పార్టీ వల్లే జరుగుతుందని ప్రకటించారు.

అయితే గులాబీ పార్టీ నుంచి బయటకు వెళుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విజయారెడ్డి బాటలోనే మరో ఇద్దరు నేతలు టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడానికి రెడీ అయ్యారు. వీరిరువురూ కూడా కాంగ్రెస్ గూటికే చేరనున్నారు. వారిలో ఒకరు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కాగా, మరొకరు కరకగూడెం జెడ్పీటీసీ. ముందుగా తాటి వెంకటేశ్వర్లు విషయానికి వస్తే ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ తాను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వెల్లడించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పెద్ద సంఖ్యలో అనుచరులతో తాను కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ లో పని చేసే నేతలకు గుర్తింపు లేదని ఆయన ఆరోపించారు. ప్రజాసమస్యలు పట్టని నేతలకే టీఆర్ఎస్ పెద్ద పీట వేస్తోందని విమర్శించారు. గుర్తింపు లేని పార్టీలో కొనసాగడం వ్యర్థమని భావించే కాంగ్రెస్ గూటికి చేరుతున్నట్లు చెప్పారు. తాటి వెంకటేశ్వర్లు 1999లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బూర్గంపహాడ్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం తరఫున పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తరువాత 2014లో వైసీపీ నుంచి అశ్వరావు పేట నియోజకవర్గం నుంచి రెండో సారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

అనంతరం టీఆర్ఎస్ లో చేరిన తాటి వెంకటేశ్వర్లు 2018 ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అనంతర పరిణామాలలో మెచ్చా నాగేశ్వరరావు టీఆర్ఎస్ గూటికి చేరారు. అక్కడ నుంచీ తెరాసలో తాటి వెంకటేశ్వర్లుకు ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది.

ఇక ములుగు ఎమ్మెల్యే సీతక్క సహకారంలో కరకగూడెం జెడ్పీటీసీ కూడా కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దాదాపు వంద మంది కార్యకర్తలతో కరకగూడెం జెడ్పీటీసీ కొమరం కాంతారావు రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. ఇప్పటికే ఆయన తన జెడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. ఖమ్మం జిల్లాలో మరింత మంది గులాబీ నేతలకు కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని పరిశీలకలు అంటున్నారు.