ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ ఎదుటకు సాక్షిగా టీపీసీసీ చీఫ్

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో  కీలక ముందడుగు పడింది. ఈ కేసులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు.దర్యాప్తు అధికారులు కోరడంతో మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వెళ్లి ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా అధికారులకు వాంగ్మూలం ఇస్తారు.  

2023 నవంబర్ లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల సమయంలో మహేశ్ కుమార్ గౌడ్ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ప్రచారం ఉధృతంగా సాగుతున్న తరుణంలో.. ఆయన ఫోన్‌ను అప్పటి ప్రభుత్వం ట్యాప్ చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తులో ముఖేష్ కుమార్ గౌడ్ వాంగ్మూలం అత్యంత కీలకంగా మారనుందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.  మహేష్ కుమార్ గౌడ్ ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉణ్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయన ఇచ్చే వివరాలు కేసు దర్యాప్తునకు కీలకంగా మారతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అనుమానితులను, ఇతర బాధితులను పోలీసులు విచారించి, వారి నుంచి కూడా వివరాలు సేకరించిన విషయం విదితమే.

అది పక్కన పెడితే...పోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మంగళవారం (జూన్ 17) కీలకంగా మారనుంది.  విచారణలో భాగంగా ఎస్ఐబీ మాజీ  చీఫ్ ప్రభాకర్ రావు  తో కలిపి కేసులో కీలక నిందితులైన ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, భుజంగ రావులను ప్రశ్నించనున్నారు. అలాగే ఫోరెన్సిక్ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా ప్రశ్నించనున్నారు. కొన్ని దశాబ్దాలుగా హార్డ్ డిస్క్‌లలో సేకరించిన జాతీయ భద్రతకు సంబంధించిన డేటా మిస్ అవ్వడంపై కూడా సిట్ విచారిస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో   400 మంది నుంచి వాంగ్మూలాలు నమోదు చేశారు.