పెద్దిరెడ్డికి బిగుస్తున్న భూముల ఉచ్చు!

ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా గడిచిన ఐదేళ్ల కాలంలో తన హవా చాటిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి,  సోదరుడు తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉండగా.. మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే, ఎంపీలను శాసించేవారు. ఆయనకు కావాల్సిన వారికి పదవులు.. కన్నెర్ర చేసిన వారికి కష్టాలు తప్పదని సొంత కొటరీ నాయకులు చెబుతుంటారు. ఇలా సాగిన ఐదేళ్ల వైసీపీ పాలనలో పెద్దిరెడ్డి, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పేర్ల పై భూములు కనిపిస్తే కబ్జా చేస్తూ పోయారు. ప్రభుత్వం మారిన వెంటనే దీనిపై సామగ్ర విచారణలో లోతైన విషయాలు బయటపడ్డాయి. పుంగనూరు నియోజకవర్గంలోని పుంగనూరు సమీపంలోని అటవీ భూముల పై విచారణ ఇప్పటికే జరు గుతోంది.. మరో వైపు తిరుపతిలోని బుగ్గమఠం భూములను స్వాధీనం చేసుకుని కంచెను వేసుకుని ఆనుభువిస్తున్న దానిపై ఇటీవల దేవాదాయశాఖ, మఠం అధికారులు నోటీసులు పంపి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పెద్దిరెడ్డి అటవీ భూములు ఆనుకుని ఉన్న భూమికి మరింత స్వాధీనం చేసుకుని కూలీల కోసం విలాసవంతమైన భవనం చిత్తూరు పుంగనూరు నియోజకవర్గం పులిచర్ల మండలం మంగంపేట లో నిర్మించారు. వీటితోపాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి పై ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తున్నది. మంగళంపేటలోని 27.98 ఎకరాల అటవీశాఖ భూమిని ఆక్రమించడంతో పాటు జీవవైవిధ్యంకు నష్టం కలిగించారని ప్రాథమిక నివేదికలో     అధికారులు పేర్కొన్నారు. దీనిలో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వరకానాథ రెడ్డి, పెద్దిరెడ్డి తమ్ముడి భార్య ఇందిరమ్మ,   మరో ఇద్దరు సహా  మొత్తం ఆరుగురిపై కేసు నమోదు అయ్యింది త్వరలో పాకాల కోర్టు లో చార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. దీని వెనుక ఉన్న అధికారులు ఎవరు అనే దాని పై విచారణ జరుగుతోంది.
పెద్దిరెడ్డికి బిగుస్తున్న భూముల ఉచ్చు! Publish Date: May 15, 2025 12:52PM

ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు

ఏపీ లిక్కర్ స్కాంలో గోవిందప్ప లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఆయన రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ సిండికేట్‌లో గోవిందప్ప బాలాజీ సభ్యుడిగా ఉన్నారని, మద్యం ఆర్డర్ ఆఫ్ సప్లై, గుర్తింపు పొందిన బ్రాండ్లు నిలిపివేతలో గోవిందప్ప కీలకంగా వ్యవహరించారని సిట్ తేల్చింది. ప్రముఖ బ్రాండ్ల లిక్కర్ ను ఉద్దేశపూర్వకంగా నిలిపివేసి కోట్ల రూపాయలు ఆర్జించారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది. డిస్టలరీల నుంచి ముడుపులు వసూలు చేసే   నెట్ వర్క్ లో గోవిందప్ప కీలకంగా వ్యవరించారని రిమాండ్ రిపోర్ట్ లో  సిట్ స్పష్టం చేసింది. డబ్బులు వసూలు చేయటానికి ఒక వ్యవస్థను రెడీ చేశారని.. ఈ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి గోవిందప్ప బాలాజీ సన్నిహితుడని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది.  లిక్కర్ కేసులో గోవిందప్ప బాలాజీ A 33గా ఉన్నారు. ఈయన అరెస్ట్‌తో లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్‌ల సంఖ్య ఐదుకు చేరింది. ఇదే కేసులో ఇప్పటికే కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, దిలీప్, సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఇన్నాళ్లూ సిట్ విచారణకు దూరంగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తాజాగా లాయర్ల సమక్షంలో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ట్విస్ట్ ఏంటంటే.. చాణక్య, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణ తర్వాత ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలను నిందితులుగా చేరూస్తూ సిట్ అధికారులు మెమో దాఖలు చేశారు. వసూళ్ల నెట్వర్క్ ద్వారా వచ్చిన డబ్బును షెల్ కంపెనీలకు మళ్లించి చివరికి అంతిమ లబ్దిదారుకు చేర్చడంలో గోవిందప్ప క్రియాశీలక పాత్ర పోషించారన్నది సిట్ ప్రధాన అభియోగం.  గోవిందప్ప బాలాజీ మాజీ సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడని, జగన్‌ సతీమణి భారతి తరఫున ఆర్థిక వ్యవహారాలన్నీ చూస్తుంటారని చెబుతున్నారు. నెల రోజులుగా పరారీలో ఉన్న గోవిందప్ప బాలాజీ కోసం మూడు రాష్ట్రాల్లో గాలించిన సిట్‌ బృందాలు.. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లోని చామరాజనగర జిల్లా బీఆర్‌హిల్స్‌ అటవీ ప్రాంతంలో ఉన్నారని గుర్తించి అక్కడే మాటు వేసి పట్టుకున్నాయి. ట్రాన్సిట్‌ వారంట్‌ కోసం ఆయన్ను ఎలందూరు కోర్టులో హాజరుపరిచి, విజయవాడకు తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు. బాలాజీ అరెస్టుతో ఈ కుంభకోణంలో అసలైన కుట్రదారులు, సూత్రధారుల పేర్లు బయటకొచ్చే అవకాశం ఉంది.  అత్యధికంగా ఆర్డర్లు కట్టబెట్టిన లిక్కర్ సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి రాజ్‌ కెసిరెడ్డి బృందం ప్రతి నెలా 50 నుంచి 60 కోట్ల ముడుపులు వసూలు చేసేదని సిట్‌ దర్యాప్తులో తేలింది. తాము గోవిందప్పకు లంచాలు ఇచ్చామని కొంతమంది డిస్టిలరీల యజమానులూ సిట్‌కు వాంగ్మూలా లిచ్చారు. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల యజమానులతో ఆయన హైదరాబాద్, తాడేపల్లిల్లో తరచూ సమావేశమయ్యేవారని సిట్‌ ఐడెంటిఫై చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈనెల 11న విచారణకు రావాల్సిందిగా గోవిందప్పకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు.  గైర్హాజరవడంతో ఆయన కదలికపై నిఘా పెట్టి అరెస్ట్ చేశారు. గోవిందప్ప చార్టర్డ్‌ అకౌంటెంట్‌. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ద్వారా జగన్ కుటుంబానికి దగ్గరయ్యారంటారు. గోవిందప్పది చిత్తూరు జిల్లా వి.కోట మండలం పట్రపల్లి.  సీఏ అయ్యాక బెంగళూరులో ఆడిటర్‌గా పనిచేశారు. కొన్నాళ్లు ఆస్ట్రేలియా వెళ్లి, భారత్‌కు తిరిగొచ్చారు. 2010 ఏప్రిల్‌ 30 నుంచి భారతి సిమెంట్స్‌లో పూర్తికాలపు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆ సంస్థ ఆర్థిక వ్యవహారాలు, కొనుగోళ్లు, ఐటీ బాధ్యతలు చూస్తారు. అయితే ఈ లిక్కర్ స్కాంలో అంతిమ లబ్దిదారు ఎవరు అనే అంశాలపై సిట్‌ ఆయన్ను ప్రశ్నించనుంది. అక్కడ వచ్చిన సమాచారం ఆధారంగా ఎవిడెన్సులతో సహా మ్యాటర్ బయటపెట్టనుంది.
ఏపీ లిక్కర్ స్కాం.. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్‌లో షాకింగ్ విషయాలు Publish Date: May 15, 2025 11:21AM

ఇకపై తోక ఝాడిస్తే పాక్ పని దబిడిదిబిడే!

ఆపరేషన్ సిందూర్ ఆపి అమెరికాకు మోకాలొడ్డిన ప్రధాని మోడీ అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ ఈ ఆపరేషన్ ద్వారా ఇండియా పాకిస్థాన్ కు కలిగించిన నష్టం నుంచి కోలుకోవడానికి రెండుమూడు దశాబ్దాలు పడుతుందంటూ.. యుద్ధ నిపుణులు చేస్తున్న వ్యాఖ్యలు, విశ్లేషణలు భారత ప్రభుత్వం ఎంత సంయమనంతో వ్యవహరించిందో.. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలు సాధించిందో అవగతమౌతోంది.  తమ యుద్ధం ఉగ్రవాదంపైనే తప్ప.. పాక్ పౌరులపై కాదని విస్పష్టంగా ప్రకటించిన ప్రధాని, కాల్పుల విమరణ పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం మళ్లీ భారత్ పై పంజా విసరనంత వరకేననీ,  అటువైపు నుంచి ఒక్క ఉగ్రదాడి జరిగినా యుద్ధమేననీ విస్పష్ట హెచ్చరిక చేశారు.   అదే సమయంలో కాల్పుల విరమణకు మాత్రమే అంగీకరించామనీ, పాక్ తో దౌత్య సంబంధాల ప్రశ్నే లేదనీ తేల్చేసిన  ఆయన ఇండస్ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందన్న తేల్చేశారు.  ఆపరేషన్ సిందూర్ ఆగలేదని పాకిస్తాన్ నుంచి మళ్లీ ఉగ్రదాడి జరిగితే యుద్ధ చర్యగానే భావించి ప్రతి దాడులు చేస్తామనీ హెచ్చరించారు.  ఇప్పటికే కోలుకోలేని దెబ్బతిని ఉన్న పాకిస్థాన్ కు ఈ హెచ్చరిక చాలదా? మరోసారి భారత్ పైకి ఉగ్రవాదులను ప్రేరేపించాలంటే వణుకుపుట్టడానికి అని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.  ఇక పాకిస్తాన్ తో చర్చలు అంటూ జరిగితే.. అవి  ఉగ్రవాద  నిర్మూలన,పీవోకే అంశాలపైనేననీ క్లియర్ కట్ గా చెప్పేశారు.   అలాగే పాక్,భారత్ మధ్య   ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ప్రకటించడం ద్వారా పరోక్షంగా అమెరికాకు మీ మర్యాద మీరు కాపాడుకోండన్న హెచ్చరికా చేశారు.  పాక్  యుద్ధం ఆపమని కాళ్ల బేరానికి రావడం,అమాయక పౌరులు సంక్షోభంలో పడటం ఇష్టం లేక మాత్రమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందని కుండబద్దలు కొట్టినట్లు మోడీ చెప్పారు. ఇక్కడ కొసమెరుపేంటంటే.. కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్థాన్ భారత్ కాళ్లా వేళ్లా పడుతోంది. సింధు జలాల ఒప్పందం రద్దు పునస్సమీక్షించండి ప్లీజ్ అంటూ బతిమలాడుకుంటోంది. ఈ ఒప్పందం రద్దు కారణంగా నీటి సమస్యతో  నానా ఇబ్బందులూ ఎదుర్కొంటున్నామంటూ లేఖ రాసింది. దీనిని బట్టే మోడీ తన వ్యూహాలతో పాకిస్థాన్ ను చక్రబంధంలో బిగించేశారనీ, ఆ దేశం ఇక తోక జాడించే అవకాశాలు ఇంచుమించు లేవనీ అవగతమౌతోందని పరిశీలకులు అంటున్నారు.  
ఇకపై తోక ఝాడిస్తే పాక్ పని దబిడిదిబిడే! Publish Date: May 15, 2025 11:12AM

టార్గెట్ 60 డేస్.. రూ.41 కోట్ల విలువైన పనులు పూర్తి

కోటం రెడ్డి స్పీడే వేరు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్టైలే డిఫరెంట్. అభివృద్ధి పనుల విషయంలో ఆయన టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ ముందుకు కదులుతారు. తన సొంత నియోజకవర్గమైన నెల్లూరు రూరల్ లో దాదాపు 41 కోట్ల 13 లక్షల రూపాయల వ్యయంతో మొత్తం 339 అభివృద్ధి పనులను రికార్డు సమయంలో పూర్తి చేసి అన్ని పనులనూ ఓకే రోజు ప్రారంభిస్తున్నారు. అందుకు మే 15 (గురువారం) ముహూర్తం పెట్టారు. ఈ పనులన్నిటీనీ రెండంటే రెండు నెలల్లో పూర్తి చేశారు. ముందుగానే 60 రోజుల టార్గెట్ ఫిక్స్ చేసుకుని రంగంలోకి దిగారు. రికార్డు సమయంలో పూర్తి చేసినా పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలకు ఎక్కడా ఎలాంటి లోటూ రానీయలేదు. ఇక వీటి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా వినూత్నంగానే చేస్తున్నారు. మే 15న నెల్లూరు రూరల్ లో ఈ  పనులను తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు ప్రారంభించనున్నారు. మంత్రి పొగూరు నారాయణ, కూటమి నేతలూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, పెట్టుకున్న టార్గెట్ మేరకు కేవలం 60 రోజుల వ్యవధిలోనే మొత్తం 339 అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మంత్రి లోకేష్ అభినందించారు.  
టార్గెట్ 60 డేస్.. రూ.41 కోట్ల విలువైన పనులు పూర్తి Publish Date: May 15, 2025 10:48AM

కాల్పుల విరమణకు అసలు కారణం ఏంటో తెలుసా?

ఆపరేషన్ సింధూర్  కొనసాగుతున్న వేళ అకస్మాత్తుగా భారత్,పాక్ ల మధ్య కాల్పుల విరమణ జరగడం..కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలనూ అంగీకరింపచేయడం తన ఘనతేనంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన భుజాలను తానే చరిచేసుకుని, తనను తానే ఓ గొప్ప శాంతి దూతగా అభివర్ణించేసుకోవడం తెలిసిందే. అయితే భారత్ నిర్ద్వంద్వంగా ఖండించింది. భారత్, పాక్ ల విషయంలో ట్రంప్ చేసిందేమీ లేదని మోడీ నిష్కర్షగా చెప్పేశారు. అయినా భారత్ అన్ని విధాలుగా అప్పర్ హ్యాండ్ లో ఉన్న సమయంలో హఠాత్తుగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించిందా అన్న విస్మయం ప్రపంచ దేశాలలో వ్యక్తం అవుతోంది.  ఇక దేశంలో అయితే  ప్రధాని మోదీ నిర్ణయంపై భారత్ లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. విమర్శలూ వెల్లువెత్తాయి.  ఇప్పుడిప్పుడే కాల్పుల విరమణకు భారత్ అంగీకరించడానికీ, కాల్పులు ఆపండి మహప్రభో అంటూ పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడానికి గల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి.  భారత్ ఆపరేషన్లలో భాగంగా పాకిస్తాన్ అణు స్థావరమైన కిరానాహిల్స్ సమీపంలోని సర్గోదా ఎయిర్ బేస్ పై క్షిపణి దాడి చేసింది. కిరానా హిల్స్ నుంచి 20 కి.మీ వరకూ సోరంగాలు ఉన్నాయి.భారత్ క్షిపణీలు సర్దోదా ఎయిర్ బేస్ పక్కన ఉన్న సోరంగంలోని అణువార్ హెడ్స్ ను తాకాయి. దాంతో   రేడియేషన్ లీక్ అయినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. దీంతోనే పాకిస్థాన్ కాళ్లబేరానికి వచ్చిందనీ, భారత్ కు కాల్పుల విరమణకు అంగీకరించి.. రేడియేషన్ లీక్ ను ఆపుకునేందుకు తమకు  వెసులుబాటు కల్పించాలనీ బతిమ లాడుకుంది. ఆ కారణంగానే  భారత్ కాల్పులు విరమణకు అంగీకరించిందనీ తెలుస్తోంది. రేడియేషన్ లీక్  అయ్యిందనీ, ఆ ప్రాంతానికి రెండు కిలోమీటర్ల పరిధిలో ఉండేవారంతా అప్రమత్తంగా ఉండాలని పాకిస్థాన్ జీవో జారీ చేసింది. ఇదే విషయాన్ని భారత్ కు తెలియజేసి కాల్పుల విరమణకు ఒప్పించిందని తెలుస్తోంది.  పాక్ పౌరుల ప్రాణ రక్షణ కోసమే భారత్ కాల్పుల విరమణకు అంగీకరించిందన్న ప్రశంసలూ సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ప్రపంచ దేశాలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన యుద్ధరంగ నిపుణులు భారత్ పై ప్రశంసలు కురిపించడం, భారత్ సంయమనాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వెనుక కారణం ఇదేనని అంటున్నారు.  
కాల్పుల విరమణకు అసలు కారణం ఏంటో తెలుసా? Publish Date: May 15, 2025 10:08AM

నక్కజిత్తుల పాక్ నడ్డి విరిచిన భారత్

భారత్ పై టర్కీ డ్రోన్స్ తో పాక్   దాడి చేసింది. నాలుగురోజుల  ఆపరేషన్  సింధూర్ తో భారత్ గట్టి జవాబు ఇచ్చింది. వందల సంఖ్యలో టర్కీడ్రోన్స్ ను భారత్ కూల్చివేసింది.  2023 లో టర్కీలో వచ్చిన భూకంపానికి ఆ దేశం కకావికలం అయి దిక్కుతోచని స్థితిలో పడిన సమయంలో  ఏ దేశం ముందుకు రాని స్థితిలో భారత్  ఆపరేషన్ దోస్తు అంటూ ఆహారం,మందులు ఇతర సహాయం అందించింది. ఆపద సమయంలో ఆదుకున్న భారత్ పట్ల టర్కీ మిత్రద్రోహం చేసింది.  భారత్ మంచితనానికి డ్రోన్లతో రుణం తీర్చుకున్న ద్రోహబుద్ది టర్కీది అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. బ్యాన్ టర్కీ ట్యాగ్ లైన్ తో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తుతోంది. భారత పర్యాటకులు తమ పర్యాటక ప్రదేశాల నుంచి టర్కీని తుడిచేశారు.  టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌కు భారత్‌  పట్ల నిలువెల్లా ద్వేషం. దాన్ని పలుమార్లు ఆయన బహిరంగంగానే వ్యక్తం చేశారు. పెహల్గామ్‌ ఉగ్రదాడిని మాట మాత్రంగా కూడా ఖండించలేదు ఎర్డోగాన్‌. ఇక ఇస్లామిక్‌ దేశాలకు సౌదీ అరేబియా నేతృత్వం వహిస్తోంది. అయితే ఇస్లామిక్‌ దేశాలకు నేతృత్వం వహించాలన్నది టర్కీ కల. దీనికి సౌదీ అరేబియా అడ్డు రావడం, ఆ దేశంతో భారత్ కు మంచి సంబంధాలు ఉండడమే ఆ దేశం భారత్‌ పట్ల విషం కక్కడానికి కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. భారత్ పై పాకిస్థాన్ దాడులు చేయడానికి టర్కీ ఐదు విమానాల్లో   ఆయుధాలను కూడా ఆదేశానికి పంపించింది. పాక్ కు ఆయుధాలతో విమానం పంపి ఇంధనం కోసం దిగిందని సమర్ధించుకుంది టర్కీ. అలాగే కరాచీ ఓడరేవుకు యుద్ధనౌక ను పంపింది. ప్రపంచం మొత్తం మీద పాకిస్తాన్ కు టర్కీ, అజర్ బైజాన్ లు మాత్రమే మద్దతు పలికాయి.  టర్కీ చేసిన ద్రోహాన్ని భారత్ ప్రజలు మర్చిపోరు.  ఇదిలా ఉండగా  గత నాలుగు రోజులుగా జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతిన్నా భారత్ కు భారీగా నష్టం కలిగించామని పాకిస్థాన్ అవాస్తవాలను ప్రచారం చేసుకుంటోంది.   సుదర్శన చక్ర-400 ను నిర్వీర్యం చేశామనీ, ఏయిర్ పోర్టులను నాశనం చేశానని, పౌర ప్రాంతాల్లో దాడి చేయలేదని, సైనిక స్థావరాలను మాత్రమే ధ్వంసం చేశామనీ చెప్పుకుని తన భుజాలను తానే చరుచుకుని సంబరపడిపోతోంది.   కాని వాస్తవంగా పాకిస్థాన్ భారత్ కు ఏలాంటి నష్టం కలిగించలేకపోయింది. డ్రోన్స్, క్షిపణిలను భారత్ విజయవంతంగా తిప్పికొట్పింది. ఎల్వోసీ  సరిహద్దు వెంబడి ప్రాంతాలపై కాల్పులు జరిపి  16 మంది అమాయక పౌరుల ఉసురు తీసింది. జనావాసాలే లక్ష్యంగా దాడులకు తెగబడి.. కనీస నీతి నియమాలకు తిలోదకాలొదిలేసింది.  భారత్ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోని  9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.   ఆ తరువాత పాక్ దాడులను భారత్ సమర్ధంగా తిప్పికొట్టడంతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోయింది. అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న ఆ దేశం.. భారత్ తో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే ఉనికి మాత్రంగా కూడా మిగలమన్న భయంతో కాల్పుల విరమణ అంటూ శరణు జొచ్చింది. శరణనన్నవారిపై ఆయుధ ప్రయోగం సరికాదన్న యుద్ధ నీతిని అనుసరించి భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.  నక్క జిత్తుల పాక్ ను నమ్మడం కష్టమన్న భావనతోనే.. ఇకపై ఎలాంటి ఉగ్ర  దాడి జరిగినా యుద్ధం కిందే పరిగణిస్తామన్న గట్టి హెచ్చరిక చేసిన భారత్.. పాక్ ఇప్పటిలో తేరుకోలేనంత గట్టి గుణపాఠమే చెప్పిందని యుద్ధరంగ నిపుణులు చెబుతున్నారు. 
నక్కజిత్తుల పాక్ నడ్డి విరిచిన భారత్ Publish Date: May 15, 2025 9:45AM

ప్రేమించడం తప్పు కాదు.. కానీ  రిలేషన్ నిలబడాలంటే ఇవి ముఖ్యం..!

   ఎవరితోనైనా ప్రేమ గురించి మాట్లాడటం చాలా సులభం, కానీ ఆ సంబంధాన్ని ఎక్కువ కాలం కొనసాగించడం చాలా కష్టం. చాలా మంది కొన్ని రోజుల రిలేషన్ లో ఉన్న  తర్వాత విసుగు ప్రదర్శిస్తూ ఉంటారు. వారు చేసే కొన్ని తప్పుల వల్ల ఇద్దరి మధ్య  సంబంధం బలహీనపడుతుంది. ఈ తప్పుల వల్ల  రిలేషన్  లోతును,  దాని బాధ్యతలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ప్రేమ అయినా, పెళ్లి అయినా, స్నేహం అయినా.. ఇలా ఏ రిలేషన్ అయినా సరే.. కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది.  ఆ నియమాలను తెలుసుకోకపోతే ఎంత మందితో కొత్తగా రిలేషన్ మొదలుపెట్టినా సరే.. అది తొందరగా బ్రేకప్ అవుతుంది.  ముఖ్యంగా ప్రేమికులు, భార్యాభర్తలు వారి రిలేషన్ లో ఈ క్రింది విషయాలను తప్పనిసరిగా తెలుసుకుని ఆచరించాలి. నమ్మకం.. సంబంధంలో నమ్మకం లేకపోతే దాని పునాది బలహీనంగా మారుతుంది. అటువంటి పరిస్థితిలో  భాగస్వామిని ఎప్పుడూ అనుమానించకూడదు. ఇద్దరి  మధ్య ఏదైనా అపార్థం ఉంటే ఇద్దరూ కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడి, అపార్థాన్ని తొలగించుకోవాలి. ఏ సంబంధంలోనైనా ఓపెన్ గా మాట్లాడటం,  సమస్యను పరిష్కరించుకోవడం చాలా ముఖ్యం. దీని వల్ల ఇద్దరి మధ్య  సమన్వయం కూడా పెరుగుతుంది. స్వేచ్ఛ.. ప్రతి సంబంధంలో ఎదుటి వ్యక్తికి స్పేస్  ఇవ్వడం చాలా ముఖ్యం. చాలా మంది తమ హక్కులను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఎదుటి వ్యక్తిపై ఆధిపత్యం చెలాయించడం ప్రారంభిస్తారు, ఎదుటి వారి స్వేచ్ఛను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. దీని కారణంగా సంబంధం బలహీనపడటం ప్రారంభమవుతుంది. అందుకే భార్యాభర్తలు తమ భాగస్వాములకు  స్పేస్ ఇవ్వాలి. వారికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే పూర్తి హక్కు వారికి ఉందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. ఇది చేయకపోతే భాగస్వామి సంబంధంలో ఊపిరాడకుండా పోవడం ప్రారంభిస్తాడు. దీని వల్ల బంధం ఎక్కువ కాలం నిలబడలేదు. కమ్యూనికేషన్.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు  సంభాషించకపోతే, సంభాషణలో పారదర్శకత ఉండదు. మాట్లాడకపోవడం వల్ల ఇద్దరి మధ్య  అపార్థాలు ఏర్పడతాయి. దీని కారణంగా సంబంధం  పునాది బలహీనపడటం ప్రారంభమవుతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని భాగస్వామితో ఓపెన్ గా మాట్లాడాలి. శ్రద్ద.. చిన్న చిన్న విషయాలు భార్యాభర్తల మధ్య సంబంధాన్ని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఏం తింటావని అడగడం, జాగ్రత్తగా ఉండమని చెప్పడం, నచ్చిన చోటకు వెళ్లడం, గొడవను పెద్దవి చేసుకోకుండా ఒకరి బాధను మరొకరు పంచుకోవడం వంటివి చేస్తుంటే భాగస్వామికి  ఖచ్చితంగా నచ్చుతుంది. వారు ఎల్లప్పుడూ బంధంలో ఉండాలని అనుకుంటారు.  ఏవైనా గొడవలు జరిగినా వాటిని పరిష్కరించుకుని బంధం నిలబెట్టుకోవాలి అనుకుంటారు. పోలిక.. భార్యాభర్తలు ఇద్దరూ ఎవరూ ఎవరిని ఇతరులతో పోల్చకూడదు.  బయట సంబంధంలో ఉన్నవారిని,  ఇతరులను చూసి వాళ్లు బాగున్నారు, వాళ్లు మంచివారు,  నువ్వు చెడ్డ.. ఇలాంటి కోణంలో ఎప్పుడూ మాట్లాడకూడదు. ఇలా పోలిస్తే అది వారి మనసును బాధపెడుతుంది.  తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, చిన్న చూపు చూస్తున్నారని భావిస్తారు.  దీనివల్ల బంధంలో అప్యాయత తగ్గుతుంది.                                                   *రూపశ్రీ.  
ప్రేమించడం తప్పు కాదు.. కానీ  రిలేషన్ నిలబడాలంటే ఇవి ముఖ్యం..! Publish Date: May 15, 2025 9:30AM

పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? Publish Date: May 15, 2025 9:30AM

‘స్థానిక’సుముహుర్తం ఎప్పుడో?

జూన్, జూలై నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గతంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గడవు ముగిసనా ఎన్నికలు జరగక పోవడం వలన స్థానిక సంస్థలకు రావలసిన కేంద్ర నిధులు ఆగిపోయాయి. దీంతో కులగణన అయిన వెంటనే ఎన్నికలు నిర్వహించాలని గత ఫిబ్రవరిలో  ప్రభుత్వం  నిర్ణయం తీసుకుందని వార్తలొచ్చాయి.  అయితే.. తాజా పరిస్థితులను, ముఖ్యంగా హామీల అమలులో జాప్యం కారణంగా ప్రజల్లో వ్యక్త మవుతున్న వ్యతిరేకతను  గమనిస్తే ప్రభుత్వం స్థానిక ఎన్నికలు నిర్వహించే సాహసం చేస్తుందా? అనే అనుమనాలు వ్యక్త మవుతున్నాయి.     అవును. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పూర్తి చేస్తామని ఇచ్చిన హామీలను, అమలు చేయడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. ఇందులో మరో అభిప్రాయానికి ఆస్కారమే లేదు. మంత్రులి సైతం అంగీకరిస్తున్నదే..  ఆ విషయం రాష్ట్ర ప్రజలకు కూడా అర్థమైపోయింది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ  ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇవ్వడమే కాకుండా.. దానికి అదనపు ఆకర్షణగా వందరోజుల ట్యాగ్ లైన్ జోడించింది. ఇచ్చిన హమీలు అన్నింటినీ వంద రోజులల్లో అమలు చేస్తామని  కాంగ్రెస్ మ్యానిఫెస్టో భరోసా ఇచ్చింది. అయితే  వందర రోజులు కాదు, రెండు వందలు, మూడు వందలు, నాలుగు, ఐదు వందల రోజులు కూడా వెళ్లి పోయాయి. అయినా ఇంతవరకు హస్తం పార్టీ ఇచ్చిన హామీల్లో అమలు కానీ హమీలదే  పై ‘చేయి’ గావుంది. నిజమే ఇచ్చిన ప్రతి హమీనీ అమలు చేయడం కాంగ్రెస్ ప్రభుతానికి మాత్రమే కాదు, మరే ప్రభుత్వానికి అయినా అయ్యే పనికాదు. అందుకే ప్రజలు కూడా సహజంగా నూటికి నూరు శాతం హామీలు అమలు అవుతాయని ఆశించరు. అలాగే వంద రోజులంటే వంద రోజుల్లోనే అమలు కావాలని కోరుకోరు. ఎన్నో కొన్ని అయినా అమలు  చేస్తే చాలని అనుకుంటారు.  కానీ  రాష్ట్రంలో అలాంటి పరిస్థితి కూడా లేదని అంటున్నారు.   కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిపోయినా.. హామీల అమలు విషయంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కదలిక లేక పోవడంతో సహజంగానే ప్రజలో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అలాగే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ప్రతి రోజు వినిపిస్తున్న ప్రవచనాలు హామీలు అమలవుతాయనే ఆశలను పూర్తిగా తుడిచేశాయని  క్షేత్ర స్థాయి సర్వేలు సూచిస్తున్నాయి.  రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, రాష్ట్రానికి ప్రపంచంలో ఎక్కడా రూపాయి అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రే స్వయంగా  బహిరంగ ప్రకటన చేసిన తర్వాత  వేల కోట్ల రూపాయల విలువైన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం  వంద రోజుల్లో కాకున్నా వెయ్యి రోజులకు అయినా అమలు చేస్తుందనే నమ్మకం లేకుండా పోయింది. నిజానికి  హామీలను చెత్త బుట్టకు ఎత్తడం కోసమే ముఖ్యమంత్రి, ఆర్థిక విలాపం అలపిస్తున్నారనే అనుమనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో... సహజంగానే కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత, అవిశ్వాసం రోజురోజుకు పెరిగి పోతోందని కాంగ్రెస్ వర్గాలే కలవర పడుతున్నాయి.   ముఖ్యంగా  స్థానిక సంస్థల ఎన్నికల గడువు దగ్గరపడుతున్న కొద్దీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఓటమి భయం గుబులు  రేపుతోందని అంటున్నారు. మరో ఒకటి రెండు నెలలలో (జూన్‌ లేదా జూలై) స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయన్న ఉహాగానాలు వస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ వర్గాల్లో ఆందోళన స్పీడ్ పెరుగుతోందని అంటున్నారు.  అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,  స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు గ్రామాలలో విస్తృతంగా పర్యటించాలని, ఏప్రిల్ 15 జరిగిన శాసనసభ పక్ష సమావేశంలో  ఆదేశించారు. నిజానికి అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి  మీనాక్షి నటరాజన్  అనేక సందర్భాలలో గ్రామాలకు వెళ్ళాలని ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయితే  గ్రాలకు వెళితే  హామీల అమలు కోసం ప్రజలు నిలదీస్తున్నారని ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ఒక విధంగా  క్షేత్రస్థాయి పర్యటనలు ఎమ్మెల్యేలకు, ఇతర ప్రజాప్రతినిధులకు, నాయకులకు తలనొప్పిగా మారాయి. ప్రభుత్వం ఏర్పడి 17 నెలలైనా హామీలు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోకపోవడంతో గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. దీంతో వారు ఆందోళన చెందుతున్నారు.  ముఖ్యంగా సంక్షేమ పధకాలు అన్నిటికీ  మూలాధారం అయిన,రేషన్ కార్డుల విషయంలోనూ ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో రైతులు సహా అన్ని వర్గాల ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు. గత ఏప్రిల్‌ 21న నిజామాబాద్‌లో జరిగిన రైతు మహోత్సవంలో వ్యవసాయ మంత్రి తుమ్మల స్వయంగా రైతు భరోసా సహాయం విడుదలలో జాప్యాన్ని అంగీకరించారు. చాలా మంది రైతుల పంట రుణాలు ఇంకా మాఫీ కాలేదని నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అంగీకరించారు. ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. దీంతో, ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఇంచార్జి ఆదేశాలను  చాలా మంది నాయకులు  అంతగా పట్టించుకోవడం లేదు. అలాగే  కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు రాష్ట్ర నాయకత్వంతో తమ ఆందోళనలను వ్యక్తిగతంగా తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో జరిగిన తెలంగాణ పంచాయతీ కార్యదర్శుల సమాఖ్య కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పంచాయతీల్లో నెలకొన్న సమస్యలను బయటపెట్టారు. పెండింగ్‌ బిల్లుల జాప్యం వల్ల పంచాయతీ కార్యదర్శులు తమ భార్యల బంగారం, మంగళ సూత్రాలను తాకట్టు పెడుతున్నారని మంత్రి సీతక్కకు బహిరంగ లేఖ రాయడం గమనార్హం. అదలా ఉంటే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో ఆ సామాజిక వర్గాలను ఎలా ఒప్పించాలనేది కాంగ్రెస్‌ నాయకులను తీవ్రంగా కలవరపాటుకు గురిచేస్తున్నదని పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కుల సర్వే నిర్వహించినా అది చెల్లుబాటు అవుతుందా ? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెకింపులో కులగణన చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ గణన పూర్తయ్యే వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎలా ముందుకు పోవాలనే చర్చ రాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల సుముహుర్తం పైనా అనుమనాలు వ్యక్తమవుతున్నాయి.
‘స్థానిక’సుముహుర్తం ఎప్పుడో? Publish Date: May 15, 2025 9:18AM

ఉగ్రవాదుల సోదరి కల్నల్ సోఫియా ఖురేషి.. బీజేపీ మంత్రి వాచాలత!

కల్నల్ సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్  మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషీ 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరారు.  2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఆమెపై మధ్యప్రదేశ్ మంత్రి, బీజేపీ నేత విజయ్ షా  టెర్రరిస్టుల సోదరి'గా పేర్కొంటూ ఆమెను కించపరచేలా మాట్లాడారు.  మహులోని  రాయ్‌కుంద గ్రామంలో జరిగిన జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన విజయ్ షా ఆపరేషన్ సిందూర్ విజయం, మోడీ గొప్పదనం గురించి మాట్లాడుతూ.. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేసి పారిపోయిన ముష్కరులకు వారి సొంత సోదరితోనే గట్టి సమాధానం చెప్పామన్నారు.  విజయ్ షా వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయ్. దీంతో వెనక్కు తగ్గిన మంత్రి విజయ్ షా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటూ క్షమాపణలు కోరారు. అదలా ఉంటే.. మంత్రి విజయ్ షాపై తక్షణమే పోలీసు కేసు నమోదు చేయాలని మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మంత్రి వ్యాఖ్యలపై సుమోటోగా మధ్య ప్రదేశ్ హైకోర్టు ఆ రాష్ట్ర డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. మహిళా కమిషన్ సైతం సీరియస్ గా స్పందించింది. మంత్రి పేరు ప్రస్తావించకుండా ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.  కాంగ్రెస్ పార్టీ అయితే విజయ్ షాను వెంటనే కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేసింది. 
 ఉగ్రవాదుల సోదరి కల్నల్ సోఫియా ఖురేషి.. బీజేపీ మంత్రి వాచాలత! Publish Date: May 14, 2025 5:24PM

మసూద్ అజహర్ కు పాక్ భారీ నష్టపరిహారం.. పాక్ టెర్రర్ లింక్ కు ఇంతకంటే రుజువేంటి?

పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి ఉన్న నెక్సస్ ప్రతి సందర్బంలోనూ బయటపడుతూనే ఉందిద. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థల ప్రమేయం, వాటికి పాకిస్థాన్ ప్రభుత్వ, సైన్యం సహాయ సహకారాలు మద్దతు ఉన్నట్లు పదేపదే రుజువైంది. అయితే ప్రతి సందర్భంలోనూ పాకిస్థాన్ ఉగ్రదాడులతో సంబంధం లేదని బుకాయిస్తూనే వస్తోంది. తాజాగా పహల్గాం ఉగ్రదాడిలో కూడా పాక్ హస్తం ఉందన్న విషయం నిర్ధారణ అయ్యింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో పాక్ భూభాగంలోని 9 ఉగ్ర స్థావరాలను  ధ్వంసం చేసింది. ఆ సందర్భంగా దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఆ తరువాత ఇరు దేశాల మధ్యా కొన్ని రోజుల పాటు అప్రకటిత యుద్ధం కొనసాగింది. ఆ సందర్భంగా కూడా పాకిస్థాన్ కు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు చేతులెత్తేసింది. కాల్పుల విరమణ ఒప్పందం కోసం బతిమలాడుకుంది. సరే ఇరు దేశాలూ కాల్పుల విరమణకు అంగీకారించాయి.  అయితే ఇక్కడే పాక్ తన కుత్సితబుద్ధిని మరో సారి బయటపడింది. ఉగ్రవాదులతో సంబంధం లేదనీ, ఉగ్రవాదాన్నితాము ప్రోత్సహించడం లేదనీ, తామూ ఉగ్రబాధితులమేననీ బుకాయిస్తూ వస్తున్న పాక్  తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకుంది. పాక్ భూభాగంలోని 9 ఉగ్ర సంస్థలను భారత్ ధ్వంసం చేసిన సందర్భంగా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు పాకిస్థాన్ ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ప్రకటించింది. అలా పాక్ ప్రకటించిన నష్టపరిహారం అందుకునే వారిలో అంతర్జాతీయ ఉగ్రవాది, నిషేధిత  జైషే అహ్మద్ ఉగ్ర సంస్థ అధినేత మసూద్ అజహర్ కూడా ఉన్నాడు. బహావల్పూర్ ప్రాంతంలో భారత్ జరిపిన దాడుల్లో మసూద్ అజహర్ కుటుంబ సభ్యులు 14 మంది మరణించారు. వారందరికీ వారసుడు మసూద్ అజహారే. దీంతో పాక్ ప్రభుత్వం ఆయనకు 14 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించబోతున్నది. నిజంగా పాకిస్థాన్ కు ఉగ్ర సంస్థలతో బంధం లేకుంటే, నిజంగా ఆ దేశం కూడా ఉగ్రబాధిత దేశమే అయి ఉంటే.. తమ దేశంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన భారత్ కు కృతజ్ణతలు చెప్పుకోవాలి. కానీ పాకిస్థాన్ ఆ పని చేయడం లేదు. పాక్ సైనికాధికారులు మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరై ఉగ్రవాదుల శవాలపై వారి దేశ జెండా కప్పి అధికార లాంఛ నాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అంతేనా మరణించిన ఉగ్రవాదుల కుటుంబాలకు భారీగా నష్టపరిహారం ఇస్తున్నారు.  నిషేధిత ఉగ్రవాద సంస్థ అధినేత, ప్రకటిత ఉగ్రవాది   మసూద్ అజార్‌కు ఇలా ప్రభుత్వం నేరుగా నష్టం పరిహారం ఇవ్వనుండటం వివాదాస్పదంగా మారింది. ప్రపంచ దేశాలకు పాక్ సంజాయిషీ ఇచ్చుకోవలసి ఉంటుంది. 
మసూద్ అజహర్ కు పాక్ భారీ నష్టపరిహారం.. పాక్ టెర్రర్ లింక్ కు ఇంతకంటే రుజువేంటి? Publish Date: May 14, 2025 4:35PM

వంశీకి బెయిలొచ్చింది కానీ..!

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు దాదాపు 3 నెలల తరువాత బెయిలు మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదరించి ఆ కేసు ఉపసంహరించుకునేలా చేసిన కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఊచలు లెక్కిస్తున్న వంశీకి ఎస్సీఎస్టీ కోర్టు మంగళవారం బెయిలు మంజూరు చేసింది. ఇది వంశీకి ఒకింత ఊరటకలిగించే విషయమే అయినా.. ఈ కేసులో బెయిలు వచ్చినంత మాత్రాన ఆయన విడుదలయ్యే అవకాశాలు లేవు. అందుకే ఇంకా జైలులోనే ఉన్నారు. ఎందుకంటే వంశీపై మొత్తం నాలుగు కేసులు ఉణ్నాయి. సత్యవర్థన్ కిడ్నాప్ కేసు మాత్రమే కాకుండా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి, భూకబ్జా, అక్రమ మైనింగ్ కేసులు ఉన్నాయి. వీటిలో సత్యవర్థన్ కిడ్నాప్, అక్రమ మైనింగ్ కేసులలో మాత్రమే వంశీకి బెయిలు లభించింది. ఇంకా గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో సీఐడీ సీబీఐ దాఖలు చేసిన కేసులో ఆయనకు కోర్టు మే 21 వరకూ రిమాండ్ విధించింది.  ఆ కేసులో వంశీకి ఈ నెల 22న బెయిలు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని వైసీపీ వర్గాలు, వంశీ అనుకూలురు అంటున్నారు. ఒక వేళ వారు ఆశిస్తున్నట్లు జరిగితే ఆయన బెయిలుపై బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి.   
వంశీకి బెయిలొచ్చింది కానీ..! Publish Date: May 14, 2025 3:42PM

పాక్ మిడిసిపాటుకి భారత్ చెక్.. అతలాకుతలమైన పాక్ ఎయిర్‌ఫోర్స్

అమెరికా, చైనా ఫైటర్‌ జెట్లను చూసుకుని తమ వాయుసేన బలంపై పాకిస్థాన్ మిడిసిపడింది. అయితే తాజాగా ఆపరేషన్‌ సిందూర్‌లో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్‌ చావు దెబ్బ తీసింది. అత్యంత కచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్‌ ధ్వంసం చేసింది. ఈ దాడిలో పాక్‌ వాయుసేనకు చెందిన దాదాపు ఐదోవంతు మౌలిక వసతులు, ఫైటర్‌ జెట్లు ధ్వంసమైనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. భారత సైనిక స్థావరాలు, పౌర నివాసాలను పాక్‌ సైన్యం లక్ష్యంగా చేసుకోవడంతో  మన దేశం జరిపిన ప్రతిదాడిలో ఇవి దెబ్బతిన్నాయి. ఇందుకోసం భారత్‌ ఆత్మాహుతి డ్రోన్లు, క్షిపణులను పాక్‌ ఆయుధాగారాలు, ఎఫ్‌-16, జేఎఫ్‌-17 వంటి విమానాలు దాచిన సర్గొదా, భోలారీ ఎయిర్‌ పోర్టులతోపాటు.. పాక్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ఉన్న చక్లాలలోని నూర్‌కాన్‌ ఎయిర్‌ బేస్‌ను కూడా ధ్వంసం చేసింది. ఈ దాడుల్లో మొత్తం 50 మంది చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు.  సింధి రాష్ట్రంలోని జమ్సోరో జిల్లాలోని బోలారీ ఎయిర్‌ బేస్‌లోనే స్క్వాడ్రన్‌ లీడర్‌ ఉస్మాన్‌ యూసఫ్‌, మరో నలుగరు ఎయిర్‌మెన్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ నిలిపి ఉంచిన పలు ఫైటర్‌జెట్లు కూడా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రతిదాడిలో భారత్‌ నూర్‌ఖాన్‌, రఫీకీ, షోర్కోట్‌, మురిద్‌, సుక్కోర్‌, సియాల్కోట్‌, పసురూర్‌, చునియన్‌, సర్గోదా, భోలారీ, జకోబాబాద్‌లో దాడులు చేసింది. దాడికి ముందు.. తర్వాత ఇక్కడినుంచి సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో నష్టం తీవ్రత స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా జకోబాబాద్‌లోని షాబాజ్‌ బేస్‌ చాలావరకు ధ్వంసమై కనిపిస్తోంది. ఇక భారత పదాతి దళం జరిపిన దాడిలో నియంత్రణ రేఖ వద్ద పాక్‌ సైనిక స్థావరాలు, ఉగ్ర బంకర్లు నాశనమయ్యాయి.  తమ కాల్పుల్లో పాక్‌ ఆర్మీ  దాదాపు 40 మంది  సైనికులను కోల్పోయి ఉండొచ్చని భారత్‌ చెబుతోంది.  మంగళవారం భారత మిలిటరీ ఈ దాడులకు సంబంధించిన ఫొటోలు సహా ఇతర ఆధారాలను 70 దేశాల ప్రతినిధులకు చూపించాయి. వీటిల్లో పాక్‌ క్షిపణి, డ్రోన్‌ శకలాలు కూడా ఉన్నాయి.  డిఫెన్స్ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ డీసీ డీఎస్‌ రానా ఈ ప్రెజెంటేషన్‌ నిర్వహించారు. తాము లక్ష్యాలను ఎలా ఎంచుకొంది.. ఎలా ధ్వంసం చేసిందీ కూడా తెలిపారు. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎక్స్‌ఖాతాలో వెల్లడించింది.
పాక్ మిడిసిపాటుకి భారత్ చెక్.. అతలాకుతలమైన పాక్ ఎయిర్‌ఫోర్స్ Publish Date: May 14, 2025 2:31PM

జగన్‌కి బుగ్గన ఝలక్?

వైసీపీ ప్రభుత్వంలో తిరుగులేని స్థాయిలో చక్రం తిప్పిన  ఆర్థికశాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. 2024 ఎన్నికలలో బుగ్గన  పరాజయం పాలయ్యారు. కర్నూలు జిల్లా డోన్ లో తెలుగుదేశం అభ్యర్థి కోట్ల విజయం సాధించారు. డోన్ లో తెలుగుదేశం జెండా ఎగరడం పదేళ్ల తర్వాత  ఇదే తొలిసారి. చంద్రబాబు వ్యూహం ఫలించి కోట్ల విజయం సాధించారు. బుగ్గన పరాజయం పాలయ్యారు.  వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పి, ఐదేళ్లూ వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన ఆ ఓటమితో డోన్ లో అడ్రస్ లేకుండా పోయారు.  అపర మేధావిలా అసెంబ్లీ లో వ్యవహరించిన ఆయన ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో తన వ్యాపార వ్యవహారాల కోసం జగన్‌కి హ్యాండ్ ఇచ్చే ఆలోచన చేస్తున్నారంట. అయితే కూటమి పార్టీలు నో ఎంట్రీ బోర్డు పెట్టడంతో ఏం చేయాలో తోచక అండర్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోయారన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని డోన్ రాజకీయం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. గతంలో ఈ సెగ్మెంట్ లో ప్రస్తుతం తెలుగుదేశంలో  ఉన్న కేఈ, కోట్ల కుటుంబాలే ప్రత్యర్ధులుగా కొనసాగాయి.  1978 నుంచి 2009 వరకు ఆ రెండు ఫ్యామిలీ మధ్యే ఎలక్షన్ వార్ నడుస్తూ వచ్చింది. 2014లో వైసీపీ నుంచి ఎంట్రీ ఇచ్చిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అనూహ్యంగా కేఈ కృష్ణమూర్తిపై గెలుపొందారు. రెండోసారి కూడా గెలిచిన బుగ్గన ఆర్థిక మంత్రిగా అయిదేళ్లు చక్రం తిప్పారు  రాజకీయ ప్రత్యర్థులైన దిగ్గజ కుటుంబాలు కేఈ, కోట్ల కుటుంబాలు గత ఎన్నికల సమయానికి ఒకే గూటి కిందకు చేరడం, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగడంతో బుగ్గనకు ఘోర పరాజయం తప్పలేదు. అదీ కాక నియోజకవర్గానికి అందుబాటులో ఉండకుండా అసెంబ్లీలో పిట్టకథలు చెప్తూ గడిపేసిన బుగ్గనపై డోన్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ ఓటమి తర్వాత బుగ్గన డోన్ వాసులకు నల్లపూసై పోయారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన అక్రమాలపై కూటమి సర్కారు దృష్టి సారిస్తోందన్న ప్రచారంతో భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను, వారి వ్యాపారాలను టార్గెట్‌ చేస్తూ బుగ్గన వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలున్నాయి. అదే విధంగా బుగ్గనను ప్రజలు నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకునే అవకాశం ఎప్పుడూ రాలేదు, అమరావతి, ఢిల్లీలోనే ఎక్కువ సమయం గడుపుతూ నియోజకవర్గంలో ప్రజలకు దూరమయ్యారు. అంతేగాక సొంత పార్టీ కేడర్‌ను కూడా బుగ్గన పట్టించుకోలేదని టాక్‌. వాటికి తోడు  సొంత మండలం బేతంచెర్లలోనే బుగ్గన తీవ్రస్థాయిలో అరాచకాలకు పాల్పడ్డారంట.  ప్రస్తుతం కేసుల భయం వెంటాడుతుండటంతో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వైసీపీని వీడి జగన్‌కు హ్యాండ్ ఇచ్చే ఆలోచనలో ఉన్నారంట. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అప్పుల కోసం ఢిల్లీ చుట్టూ తిరిగి అక్కడి పెద్దలతో అంతో ఇంతో పరిచయాలు పెంచుకున్న ఆయన.. బీజేపీలో చేరడానికి వారితో మంతనాలు సాగిస్తున్నారంట. అందుకే ఆయన వైసీపీ కార్యక్రమాల్లో కూడా కనిపించడం లేదనీ, ఎక్కువ టైమ్ ఢిల్లీలోనే గడుపుతున్నారని బుగ్గన అనుచరులు చెప్పుకుంటున్నారంట. బీజేపీలో చేరడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసి డోన్ కూటమి నేతలు తమ అధిష్టానాలపై తీవ్ర ఒత్తిడి తెచ్చారంట. దాంతో బుగ్గనకు కూటమి పార్టీల్లో ఎంట్రీకి డోర్స్ క్లోజ్ అయిపోయారంటున్నారు. ఆ క్రమంలో బుగ్గన ఆచూకీ ఆయన సొంత అనుచరులకే అంతుపట్టకుండా తయారైందంట.
జగన్‌కి బుగ్గన ఝలక్? Publish Date: May 14, 2025 2:15PM

హాట్‌టాపిక్‌గా మారిన చెవిరెడ్డి కన్నీటి ఎపిసోడ్!

వైసీపీలో కీలక నేతగా వెలుగొందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం తెగ దూకుడు ప్రదర్శించారు.  అలాంటి ఫైర్‌బ్రాండ్ కనీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తన స్వగ్రామం తుమ్మలగుంట అత్మీయసభలో మీకు అన్ని చేశాను, కాని మీరు నా కొడుకును ఓడించారంటూ తన మనోవేదన  వెళ్లగక్కిన సందర్భంలో ఆయన కళ్లు చెమర్చాయి. గత 11 నెలలుగా గ్రామస్తులలో ఎలాంటి సమావేశాలు పెట్టని అయన తాజాగా ఉన్నట్లుండి మీటింగ్ పెట్టారు. అసలు చెవిరెడ్డి ఎందుకు అంత అత్యవసరంగా అత్మీయ సమావేశం ఏర్పాటు చేశారనేది చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాలలో వైసిపి కీలక నాయకుడు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అంటే తెలియని వారుండరు. జగన్ ప్రభుత్వంలో తుడా చైర్మన్‌గా వ్యవహరించిన ఆయన మంత్రి పదవి దక్కించుకోలేక పోయినప్పటికీ.. చాలా మంది మంత్రుల కంటే ఎక్కువగానే చెలాయించారు.  జగన్‌కు అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి ఏకంగా తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్‌లో తిరుమల దేవాలయ సెట్ వేయించి తన నాయకుడితో ఉగాది వేడుకలు నిర్వహింప చేసి తన వీరవిధేయత చాటుకుని  విమర్శల పాలయ్యారు. 2014లో టీడీపీలోని అనైక్యతతో చంద్రగిరిలో సొంత సామాజికవర్గం గల్లా అరుణకూమారిని వ్యతిరేకించడంతో చెవిరెడ్డి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత 2019లో జగన్ గాలిలో సునాయాస విజయం సాధించారు. అయితే మొదటి సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి నియోజకవర్గంలో పట్టు కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. నియోజకవర్గం వ్యాప్తంగా పండుగలకు తాయిలాలు పంచడంతో పాటు ఇంటింటికి శుభాకాంక్షలు వెళ్ళేవి. దానికి తోడు వాలంటీర్ వ్యవస్థ రాక ముందే తానే నియోజకవర్గంలో అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకుని మంత్రాంగం సాగించారు. అలా అన్నీ కలిసి వచ్చి 2019లోఆయన భారీ మెజార్టీతో గెలవగలిగారు. ఎన్నికల తర్వాత శాసన సభ విప్‌తో పాటు తుడా చైర్మన్ పదవి కూడా అయనకే దక్కింది.  తుడా పదవిని అడ్డంపెట్టుకుని చెవిరెడ్డి పెద్ద తతంగమే నడిపారు. తన గ్రామ సమీపంలోని తుమ్మలగుంట చెరువును సగానికిపైగా పూడ్పించి.. తుడా నుంచి 60 కోట్లు పైగా ఖర్చు పెట్టి అత్యాధునిక వాకింగ్ ట్రాక్‌తో పాటు, అనేక విధాలుగా అభివృద్ది చేసారు. చెరువును పూడుస్తున్నా చెవిరెడ్డి హవా చూస్తూ ఇరిగేషన్ శాఖ వారు నోరెత్తలేకపోయారంటారు.  తుడా పరిధిలో ఇష్టా రాజ్యంగా బెంచీల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి,  ఆ బల్లలపై తన పేరు వేయించుకుని చెవిరెడ్డి చేసిన ప్రచార అర్భాటం ఇప్పటికీ ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. దానికి తోడు రహాదారులకు సైతం వైఎస్‌తో పాటు తన పేరు పెట్టుకున్న ఘనత ఆయనది. తుడా అనేది కేవలం చంద్రగిరి నియోజకవర్గం వరకే అన్నట్లు పాలన సాగించారు. తుడా నిధులతో సొంత సర్వే టీములకు, వ్యక్తిగత సిబ్బందికి జీతాలు ఇప్పించుకున్నారన్న ఆరోపణలున్నాయి. వాటితో పాటు అనేక రకాలుగా తుడా నిధులు దుర్వినియోగం చేశారన్న అభియోగాలున్నాయి. తుడా నిధులతో  తుమ్మల గుంట చెరువులో ఏర్పాటు చేసిన పార్కుపై ఇప్పటికీ వివాదాలు నడు స్తున్నాయి.  పూర్వం చెరువు ఏలాగుందో అలా ఉంచాలని చాలామంది గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్ళారు. ఇప్పటికే గ్రీన్ ట్రిబ్యునల్ అదేశాలతో అవిలాల చెరువును యాధావిధిగా ఉంచడానికి టీటీడీ ఇరిగేషన్ శాఖ అందులో ఉన్న నిర్మాణాలు తొలగిస్తోంది. ఇదే పరిస్థితి తుమ్మల గుంట చెరువులో ఏర్పాటు చేసిన పార్క్‌కు కూడా పట్టే కాలం దగ్గరలో ఉందని అంటున్నారు. ఎన్నికలలో ఎంపీగా ఒంగోలు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు చెవిరెడ్డి. మరో వైపు చంద్రగిరిలో తన కూమారుడు మోహిత్ రెడ్డిని అభ్యర్థిగా రంగంలో దించారు. మోహిత్ భారీ తేడాతో టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని చేతిలో ఓటమి పాలయ్యారు. ఇప్పుడు పలు కేసులు, వివాదాలు చెవిరెడ్డిని చుట్టుముడుతున్నాయి. ఓటర్ల జాబితా తయారీలో అక్రమాలకు పాల్పడ్డారని ఎమ్మెల్యే పులివర్తి నాని ఫిర్యాదుతో సీఐడీ కేసులు పెట్టి విచారిస్తోంది. తుడా నిధల అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతున్నది. దాంతో పాటు పోలింగ్ తర్వాత పులివర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటిలో జరిగిన దాడికి సంబంధించి హత్యాయత్నం కేసుల విచారణ సాగుతోంది. వాటితో పాటు తుమ్మలగుంట చెరువులో ఉన్న పార్క్‌ను ఇప్పటి వరకు చెవిరెడ్డి తన సొంత ఆస్తిలా భావిస్తూ వచ్చారు.. ఇప్పుడు దాన్ని తుడా నిర్వహణలో తీసుకోవాలని పై స్థాయిలో నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో పావులు కదపడం మొదలు పెట్టారంట. గ్రామంలోని వారందరితో అత్యవసర అత్మీయ సమావేశం ఏర్పాటు చేసి మరీ తాను అందర్నీ బిడ్డల కంటే ఎక్కువగా చూసుకున్నా, తన బిడ్డని ఓడించారంటూ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేశారంట. దాంతో పాటు పార్క్‌ను తుడా నిర్వహిస్తే దారుణంగా మారిపోతుందని దాని కోసం పోరాటం సాగిద్దామని పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా మారింది.  పార్క్ కట్టిన చెరువు ఇరిగేషన్ శాఖది, అయితే నిధులు తుడావి అయినప్పుడు  నిర్వహణ అవి  చేయాలి కానీ తన పరిధిలో ఉంచుకోవాలని ప్రయత్నించడంపై విమర్శలు వస్తున్నాయి. మొత్తం మీద సొంత అస్తి కోల్పోతున్నట్లు చెవిరెడ్డి తెగ ఇదై పోతున్నారని అందరూ సెటైర్లు విసురుతున్నారు. పక్కనున్న హాథీరాంజీ మఠం భూములలో గ్రామస్తులు కొంతమంది ఇల్లు కట్టుకున్నప్పుడు వాటిని చెవిరెడ్డి కూల్చి వేయించారు. ఇప్పుడు తన దాకా వచ్చే సరికి నొప్పి తెలుస్తోందని గ్రామస్తులు దెప్పిపొడుస్తున్నారు. మొత్తం మీద చెవిరెడ్డి కన్నీటి ఎపిసోడ్ ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
హాట్‌టాపిక్‌గా మారిన చెవిరెడ్డి కన్నీటి ఎపిసోడ్! Publish Date: May 14, 2025 1:48PM

పాకిస్థాన్ కి బిగ్ షాక్.. బలూచిస్థాన్ స్వతంత్ర దేశం

75 ఏళ్ల  సుదీర్ఘ పోరాటం ఫ‌లించిన వేళ‌ అజిత్ దోవ‌ల్ అన్న మాట నిజ‌మైన సంద‌ర్భం!  ఎట్ట‌కేల‌కు బ‌లూచిస్థాన్ స్వ‌తంత్ర దేశంగా ప్ర‌క‌టించుకుంది.ప్ర‌భుత్వ ఏర్పాట్ల‌కు స‌న్నాహాలు చేసుకుంటోంది. క్వెట్టాలో కొత్త పార్ల‌మెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోష‌ల్ మీడియాలో పంచుకుంది. భార‌త్ స‌హా ప‌లు దేశాలు త‌మ దేశంలో యాంబ‌సీలు ఏర్పాటు చేసుకోవాల‌ని కోరింది. పాక్ నుంచి స్వాతంత్రం కోసం.. బ‌లూచిస్థాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ స‌హా ప‌లు సంస్థ‌లు ద‌శ‌కాలుగా పోరాడుతున్నాయి. ఈ యుద్ధం సంద‌ర్బంగా వారి ఆశ‌లు ఆశ‌యాలు ఒక్క‌సారిగా  ఫ‌లించిన‌ట్ట‌య్యింది. బ‌లూచిస్థాన్ ది 75 ఏళ్ల స్వ‌తంత్ర పోరాటం. ఖాన్ ఆఫ్ క‌లాత్ పాల‌న‌లో స్వేచ్ఛ‌గా ఉన్న ఈ రాజ్యం.. 1948లో బ‌ల‌వంతాన పాక్ ప్ర‌భుత్వ సైనిక చర్య ద్వారా ఆ దేశంలో క‌లిసింది. పాకిస్థాన్ భూభాగంలో 44 శాతం బ‌లూచిస్తాన్ దే. పాక్ జ‌నాభాలో వీరి  వంతు 7 నుంచి 8 శాతంగా ఉంది. ఇప్పుడు బ‌లూచిస్తాన్ విడిపోవ‌డం వ‌ల్ల పాక్ కి వ‌చ్చే న‌ష్టాలేంట‌ని చూస్తే..  మొద‌టిది నైస‌ర్గికంగా పాక్ మ‌రింత బ‌ల‌హీన‌ప‌డుతుంది. మొత్తం పాకిస్థాన్ లోనే 44 శాతం వేరు ప‌డడం అంటే దాదాపు స‌గానికి స‌గం దాని నైస‌ర్గిక ముఖ‌చిత్రమే మారిపోతుంది. దీనికి తోడు సింధ్, గిల్గిట్ బ‌ల్టిస్థాన్ సైతం.. వేరు ప‌డే అవ‌కాశాలున్నాయి.  దీంతో ఇది మ‌రో దెబ్బ‌గా క‌నిపిస్తోంది. రెండో స‌మ‌స్య ఏంటంటే చైనా ఇన్నాళ్ల పాటు ఉచిత సాయాలు చేసిందే బ‌లూచిస్థాన్ని చూసి. ఇక్క‌డ డ్రాగన్ కంట్రీ ఇది వ‌ర‌కే హైబ్రిడ్ రోడ్లు వేసి, ట్రాకులు నిర్మించడం.. వాటిని బ‌లూచీలు ధ్వంసం చేస్తున్నార‌న్న ఆలోచ‌న కొద్దీ ఎయిర్ పోర్టు నిర్మించ‌డం వంటి ఎన్నో కార్య‌క‌లాపాల‌ను చేప‌ట్టింది.. అంతే కాకుండా గ్వ‌ద‌ర్ పోర్టు నిర్మించి చైనా ప‌డుతున్న పాట్లు మొత్తం బూడిద‌లో పోసిన  ప‌న్నీరే.  దీంతో ఇక‌పై పాక్ కి చైనా త‌న వ్యూహాత్మ‌క స‌హ‌కారం అందించే అవ‌కాశం లేక పోవ‌చ్చు. పాకిస్థాన్ విదేశాంగ మంత్రికి, చైనా విదేశాంగ మంత్రి.. మొన్న చెప్పిన మాట ఏంటంటే.. మీ దేశ సార్వ‌భౌమాధికారానికి ఇబ్బంది క‌లిగితే తాము అడ్డుకుంటామ‌ని.  అది పీఎల్ 15లు స‌ర‌ఫ‌రా చేసిందికూడా అందు కోస‌మే. అలాంటి స‌హాయ స‌హ‌కారాలు ఇక‌పై చైనా చేయ‌క పోవ‌చ్చు. కార‌ణ‌మేంటంటే.. చైనాకు కావ‌ల్సింది బ‌లూచిస్థాన్ అందులో ఉన్న అశేష విశేష ఖ‌నిజ సంప‌ద‌లు. అంతే కానీ, పాకిస్థాన్, దాని ప్రేరేపిత ఉగ్ర‌వాదం కోసం కాదు. ఇక‌పై చైనా ఏదైనా స‌హాయం చేయాల్సి వ‌స్తే నేరుగా బ‌లూచిస్తాన్ కే చేసే అవ‌కాశ‌ముంది. దీంతో పాక్ కి ఇటు గోడ దెబ్బ అటు చెంప దెబ్బ త‌గిలింద‌నే చెప్పాల్సి ఉంటుంది. ఒక్క బ‌లూచిస్తాన్ ని వేరు చేసుకోవ‌డం అంటే పాకిస్థాన్ దాదాపు స‌గం శ‌క్తిని కోల్పోయిన‌ట్టే. వారు మొన్నంటే మొన్న ఒక ట్రైన్ని హైజాక్ చేసి మ‌రీ త‌మ నిర‌స‌న తెలిపింది బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ. ఇటీవ‌ల భార‌త్ తో జ‌రిగిన యుద్ధంలోనూ క్వెట్టాలోని పాక్ ప్ర‌ధాన  సైనిక కార్యాల‌యాల‌పై దాడులు చేసి త‌రిమి త‌రిమి కొట్టింది బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీ. ఎందుకంటే పాకిస్తానీయులు, బలూచి యువ‌త‌ను కిడ్నాప్ చేసి మ‌రీ.. త‌మ సైన్యంలో క‌లుపుకునేవారు. ఇలాంటి  ఎన్నో పాక్ అరాచ‌కాల నుంచి ప్రస్తుతం బ‌లూచిస్తాన్ బ‌య‌ట‌ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. ఈ విష‌యం అజిత్ దోవ‌ల్ ఎప్పుడో చెప్పారు. ఈ సారిగానీ ముంబై త‌ర‌హా దాడులు రిపీట్ అయితే.. మీ  నుంచి బ‌లూచిస్తాన్ వేరుప‌డ్డం ఖాయ‌మ‌ని. బ‌లూచిస్తాన్ లిబ‌రేష‌న్ ఆర్మీకి సంబంధించిన కొంద‌రు వేర్పాటు వాదులు ఆఫ్గ‌నిస్తాన్ వెళ్లి అక్క‌డ సైనిక శిక్షణ  తీస్కుని మ‌రీ.. పాకిస్థాన్ తో పోరాడారు. బలూచిస్థాన్ ఇండిపెండెంట్ నేషన్ అయ్యిందంటే పాక్ రెక్క‌లు తెగిన‌ట్టే. ఇటు బ‌లూచిస్తాన్ పోయి అటు చైనా స‌పోర్టు కూడా క‌నుమ‌రుగు కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది.  
పాకిస్థాన్ కి బిగ్ షాక్.. బలూచిస్థాన్ స్వతంత్ర దేశం Publish Date: May 14, 2025 1:26PM

అందాల పోటీలకు లేని ముప్పు ఐపీఎల్‌కి ఎందుకు?

సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, డ్రోన్ దాడులు, వార్ మాక్ డ్రిల్స్ నడుస్తున్న సమయంలో.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఇండియాలో ఆందోళనకరమైన పరిస్థితులు లేవని స్పష్టం చేస్తోంది. ఉద్రక్తతల తీవ్రత అంతగా లేని దేశంగా భారత్ ఫోకస్ అవుతోంది. సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉండటం, ప్రశాంతంగా ఈవెంట్ కొనసాగుతుండటంతో.. దేశంలో భద్రతపై అందరికీ స్పష్టత వచ్చింది. అయితే.. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు.. ఐపీఎల్‌కు ఎక్కడి నుంచి వచ్చిందనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయ్.  హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీల నిర్వహణపై.. రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయ్. ఓ వైపు.. ఈ మెగా ఈవెంట్‌ని తెలంగాణని అంతర్జాతీయ వేదికపై ప్రమోట్ చేసే అధ్బుతమైన అవకాశంగా చెబుతున్నారు.  మరో వైపు జాతీయ భద్రతా సంక్షోభ సమయంలో అందాల పోటీల నిర్వహణ కరెక్ట్ కాదనే విమర్శలూ వినవస్తున్నాయి. అయితే సర్కార్ చేసిన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో హైదరాబాద్ సురక్షితమైన గమ్యస్థానమనే సందేశాన్నిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఆసక్తిగూ చూసే ఇలాంటి మెగా ఈవెంట్లు సక్సెస్ కావాలంటే భద్రతా చర్యలు అత్యంత పకడ్బందీగా ఉండాలి. సరిహద్దుల్లో ఉన్న ఉద్రిక్తతల ప్రభావం ఈ పోటీలపై పడకుండా చూడాలి.  ఎలాంటి ఆటంకాలు, ఇబ్బందులు లేకుండా.. మిస్ వరల్డ్ పోటీలు విజయవంతమైతే.. హైదరాబాద్, తెలంగాణ సేఫ్ డెస్టినేషన్‌ అనే గుర్తింపు వస్తుంది. దాంతో భవిష్యత్తులో ఇలాంటి వరల్డ్ క్లాస్ ఈవెంట్లు మరిన్ని నిర్వహించేందుకు హైదరాబాదే ఫస్ట్ ఆప్షన్‌గా మారుతుంది.  గ్లోబల్ కాన్ఫరెన్స్‌లకు హైదరాబాద్ వేదిక అవుతుంది. పరోక్షంగా రాష్ట్రంలో పెట్టుబడులు కూడా పెరిగే అవకాశముంది. అందు కోసమేప్రభుత్వం ఈ ఈవెంట్‌ని సమర్థవంతంగా నిర్వహించి సిటీ ఇమేజ్‌ని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తోంది.  అయితే ఇదే సమయంలో ఐపీఎల్ ఎందుకు వాయిదా వేశారనే చర్చ కూడా సాగుతోంది. మిస్ వరల్డ్ పోటీలకు లేని ముప్పు  ఐపీఎల్ మ్యాచ్‌లకు ఎందుకు ఉంది? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయ్.   ఐపీఎల్ , మిస్ వరల్డ్ అందాల పోటీలు రెండూ మెగా ఈవెంట్లే. కానీ మిస్ వరల్డ్ పోటీలు ఇండోర్ ఈవెంట్.  అందువల్ల  భద్రతాపరంగా రిస్క్ తక్కువనే వాదనలు వినిపిస్తున్నాయ్. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫుల్ సెక్యూరిటీ ఏర్పాట్లు చేసింది. జనం కూడా ఎక్కువగా గ్యాదర్ అయ్యే పరిస్థితి లేదు. అందుకోసమే మిస్ వరల్డ్ పోటీలను షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తున్నారు. కానీ ఐపీఎల్ అలా కాదు. ఒకే చోట పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువగా ఉంటుంది. వేలాది మంది ఒకచోటుకి చేరతారు. పైగా సరిహద్దులకు దగ్గరలో ఉన్న స్టేడియాల్లో మ్యాచ్‌లు జరుగుతున్నాయ్.  ఇప్పటికే పాకిస్తాన్‌లోని రావల్పిండి స్టేడియంపై భారత ఆర్మీ డ్రోన్‌తో దాడి చేసింది. దాంతో బోర్డర్‌కు దగ్గరలో ఉన్న స్టేడియాలకు డ్రోన్ దాడుల ముప్పు పొంచి ఉంది. పాక్ ఏ క్షణమైనా డ్రోన్లతో దాడి చేయొచ్చనే సమాచారం ఉంది. ఒకవేళ అదే జరిగితే నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుంది. స్టేడియంలో ఒక్క డ్రోన్ పేలినా భయంతో జనం పరుగులు పెడితే తొక్కిసలాట లాంటి దుర్ఘటనలు కూడా జరిగే అవకాశం ఉంది. అప్పుడు డ్రోన్ దాడితో జరిగే నష్టం కంటే ఇలా తొక్కిసలాట జరిగితే సంభవించే నష్టం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఐపీఎల్ మ్యాచ్‌లను తాత్కాలికంగా వాయిదా వేశారు. దేశంలో పరిస్థితులు మెరుగై సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గడంతో మళ్లీ ఐపీఎల్ మొదలకానుంది. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా భారత్‌లోని మిగతా రాష్ట్రాల్లో పరిస్థితులు చక్కగానే ఉన్నాయ్, చాలా ప్రాంతాల్లో శాంతియుత వాతావరణమే కొనసాగుతుందనే సందేశం ఇవ్వడంలో హైదరాబాద్‌లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలు  సక్సెస్ అయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. ఇందుకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన మిస్ వరల్డ్ ఈవెంట్ ఓపెనింగ్ సెర్మనీని విజయవంతంగా నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ అయింది. పైగా.. ఈ ఈవెంట్‌లో 110 దేశాల సుందరీమణులు తమ జాతీయ జెండాలతో.. ఫ్లాగ్ పరేడ్‌లో పాల్గొన్నారు. ఈ మెగా ఈవెంట్.. ప్రపంచం దృష్టిని తెలంగాణ వైపు మరల్చింది. పైగా.. ఈ ఈవెంట్ ద్వారా తెలంగాణ సంస్కృతి, చారిత్రక స్థలాలు, ఆధునిక, మౌలిక సదుపాయాలను.. అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడంలో ప్రభుత్వం విజయవంతమైంది. టూరిజం పరంగా.. ఈ ఈవెంట్ తెలంగాణని గ్లోబల్ టూరిజం డెస్టినేషన్‌గా ప్రమోట్ చేస్తోంది. పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలు రాష్ట్రంలోని ప్రముఖ టూరిజం స్పాట్‌లను సందర్శిస్తున్నారు. ఇది.. స్టేట్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచింది. ఎన్ని విమర్శలు ఎదురైనా ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈవెంట్‌ని కొనసాగించడంతో.. తెలంగాణ ప్రభుత్వం కమిట్‌మెంట్ ఏమిటో కూడా అందరికీ తెలిసింది.
అందాల పోటీలకు లేని ముప్పు ఐపీఎల్‌కి ఎందుకు? Publish Date: May 14, 2025 1:06PM

నిమ్మరసం నీళ్లు తాగితే.. షుగర్ తగ్గుతుందా?

నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు.  అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా?  నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే.. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు.  అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి. నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది.  ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది.  తద్వారా  రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..  నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.  ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర,  చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది.  ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్,  అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు. నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది.                                     *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
నిమ్మరసం నీళ్లు తాగితే.. షుగర్ తగ్గుతుందా? Publish Date: May 14, 2025 12:01PM

భార్యాభర్తల మధ్య సైలెంట్ డైవోర్స్ గురించి  తెలుసా..!

  నేటి కాలంలో విడాకుల కేసులు పెరిగినప్పటికీ, విడాకుల కొత్త పోకడలు కూడా ఉనికిలోకి వచ్చాయి. ఈ కొత్త విడాకుల నిబంధనలలో గ్రే విడాకులు, స్లీవ్ విడాకులు, సిల్వర్ విడాకులు మొదలైనవి ఉన్నాయి. అదే సమయంలో ఈ రోజుల్లో  నిశ్శబ్ద విడాకుల కేసులు కూడా పెరుగుతున్నాయి. సైలెంట్ డైవోర్స్ అంటే నిశ్శబ్ద విడాకులు. ఈ రకమైన విడాకులలో చాలా సార్లు దంపతులకు తమ సంబంధం నిశ్శబ్ద విడాకుల వైపు కదులుతోందని లేదా వారు ఇప్పటికే సైలెంట్ డైవర్స్   తీసుకున్నారని వారి కూడా  తెలియదు. తమ మధ్య సైలెంట్ గా విడాకులు  జరిగాయని ఆ జంట గ్రహించినప్పుడు వారు చట్టబద్ధంగా విడిపోతారు. ఇది విడాకుల చట్టపరమైన ప్రక్రియకు ముందు దశ కావచ్చని ఫ్యామిలీ కౌన్సిలర్లు అంటున్నారు. సైలెంట్ డైవర్స్ అంటే.. సైలెంట్ డైవర్స్  అంటే భార్యాభర్తలు చట్టబద్ధంగా కలిసి ఉండే వైవాహిక పరిస్థితి. అంటే విడాకులు తీసుకోలేదు కానీ భావోద్వేగ, మానసిక,  కమ్యూనికేషన్ స్థాయిలో ఒకరి నుండి ఒకరు పూర్తిగా విడిపోతారు. ఇద్దరూ ఒకే ఇంట్లో  నివసిస్తుంటారు కానీ వారి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదా సంభాషణ ఉండదు. వారి మధ్య భౌతిక దూరం కూడా ఉండవచ్చు. ఇది బంధం నిశ్శబ్దంగా అదృశ్యమవడాన్ని సూచిస్తుంది. సైలెంట్ డైవోర్స్ లో ఇద్దరి మధ్య సంబంధం సజీవంగా ఉంటుంది.  కానీ బంధంలో ఆత్మ,  జంట మధ్య పరస్పర అనుబంధం చనిపోతుంది. సైలెంట్ డైవర్స్ సిగ్నల్స్ ఇవే.. భార్యాభర్తల మధ్య బంధం సైలెంట్ డైవోర్స్ వైపు వెళుతోందా లేదా అనే విషయం తెలుసుకోవడానికి కొన్ని సిగ్నల్స్ కనిపిస్తాయి.  వాటి ద్వారా దీన్ని గుర్తించి జాగ్రత్త వడవచ్చు. సంభాషణ ఉండదు.. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరితో ఒకరు సాధారణ విషయాలే కాదు.. ఒకరితో ఒకరు ముఖ్యమైన విషయాల గురించి కూడా మాట్లాడుకోరు. వారి మధ్య దాదాపుగా కమ్యూనికేషన్ ఉండదు. రోజువారీ విషయాలు కేవలం లాంఛనాలుగా జరుగుతూ ఉంటాయి. ఎమోషనల్ డిస్టెన్స్.. భార్యాభర్తలు ఒకరి భావాలను ఒకరు పట్టించుకోరు. ఇద్దరి మధ్య ఎమోషన్ డిస్టెన్స్ ఏర్పడుతుంది. ఒకరి సుఖదుఃఖాలను ఒకరు పంచుకోరు.  ఒకరి సమస్యలను లేదా ఆలోచనలను ఒకరు పట్టించుకోరు. శారీరక దూరం.. సైలెంట్ డైవర్స్ దిశగా వేళ్లే భార్యాభర్తల బంధంలో  వారి శారీరక  సంబంధాన్ని కోల్పోతారు. కలిసి కూర్చోవడం, ఒకరి చేతులు ఒకరు పట్టుకోవడం, కౌగిలించుకోవడం,  కలిసి పడుకోవడం వంటివి దూరం అవుతాయి.   గదిని పంచుకోవచ్చు కానీ రూమ్‌మేట్ లాగా ఎవరికి వారు ఉంటారు. సమయం ఇవ్వకపోవడం.. భార్యాభర్తలు ఒకరికొకరు సమయం ఇవ్వనప్పుడు సమయాన్ని కలిసి  గడపాలని అనుకోరు . కలిసి తినాలనే కోరిక, బయటకు వెళ్లాలనే కోరిక లేదా సెలవు దినాల్లో కలిసి సమయం గడపాలనే కోరిక తగ్గినప్పుడు వారు సైలెంట్ డైవోర్స్ వైపు  ఉన్నారని అర్థం చేసుకోవాలి. ఆసక్తి.. సాధారణంగా భార్యాభర్తలు  ఒకరి జీవితం గురించి ఒకరు తెలుసుకోవాలనుకుంటారు. వారు గొడవ పడినా, తమ భాగస్వామి రోజు ఎలా గడిచిందో, ఏం చేశారో, తమ స్నేహితులు ఎలా ఉన్నారో తెలుసుకోవడంలో   ఆసక్తి కలిగి ఉంటారు. కానీ వారి మధ్య అలాంటి సాధారణ విషయాలు కూడా  అదృశ్యమైనప్పుడు, వారి మధ్య సైలెంట్ డైవర్స్ పరిస్థితి ఏర్పడుతుంది. గొడవలు.. కొన్నిసార్లు వాదనలు లేదా విభేదాలు లేకపోవడం మంచిదని అనిపించవచ్చు. కానీ వాటి మధ్య ఎటువంటి భావోద్వేగ సంబంధం లేదని కూడా ఇది సూచిస్తుంది. వారికి ఒకరి నుండి ఒకరు ఎటువంటి ఆశలు ఉండవు. కాబట్టి వారు ఒకరితో ఒకరు గొడవ పడటానికి కూడా ఇష్టపడరు. సైలెంట్ డైవోర్స్ గురించి కొన్ని నిజాలు.. భార్యాభర్తలు చాలా మంది తమ పిల్లలను పెంచడానికి మాత్రమే కలిసి ఉంటారు. వారు భార్యాభర్తలుగా తమ సంబంధంలో సంతోషంగా లేరు కానీ తమ పిల్లల కోసం చట్టబద్ధంగా విడాకులు తీసుకోకుండా ఉంటారు విడాకులు సమాజంలో అవమానానికి కారణమవుతున్నాయి. సామాజిక కళంకం, కుటుంబ ఒత్తిడి,  విమర్శల భయాన్ని నివారించడానికి, జంటలు విడాకులు తీసుకోరు,  అందుకే ఇద్దరి మధ్య సైలెంట్ వాతావరణం ఏర్పడుతుంది. దీన్నే సైలెంట్ డైవోర్స్ అంటారు. భర్తలు డైవోర్స్ వల్ల ఆర్థికంగా లాస్ అవుతారు. దీని వల్ల విడాకులు ఇవ్వకుండా  ఆర్థిక లక్ష్యాల  కోసం రాజీగా  సైలెంట్ డైవోర్స్ ఎంచుకుంటారు. బంధంలో ప్రేమ, గౌరవం,  అవగాహన కాలక్రమేణా ముగిసినప్పుడు ప్రజలు బాధ్యతల కోసం మాత్రమే కలిసి ఉంటారు.                                         *రూపశ్రీ.  
భార్యాభర్తల మధ్య సైలెంట్ డైవోర్స్ గురించి  తెలుసా..! Publish Date: May 14, 2025 11:55AM

చీలిక ముంగిట బీఆర్ఎస్? మూడు కుర్చీలాట సంకేతమదేనా?

భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చీలిక ముంగిట నిలిచిందా? ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తన వారసుడి ప్రకటనకు ముహూర్తం పెట్టేసి రాజకీయ విరమణ లేదా రాజకీయ సన్యాసానికి రంగం సిద్ధం చేసేసుకున్నారా? అంటే బీఆర్ఎస్ లో గత కొన్ని రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది. గత కొంత కాలంగా ఒక పద్ధతి ప్రకారం పార్టీలో హరీష్ రావు ప్రాధాన్యత తగ్గుతూ లేదా తగ్గిస్తూ వస్తున్న తీరు, అలాగే ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, పార్టీ అధినేత కుమార్తె కల్వకుంట్ల కవిత పార్టీ లైన్ కు భిన్నంగా చేస్తున్న వ్యాఖ్యలు గమనిస్తే.. పార్టీ పగ్గాల విషయంలో బీఆర్ఎస్ లో మూడు కుర్చీలాట జోరుగా సాగుతున్నదని పరిశీలకులు అంటున్నారు. 2023 ఎన్నికలలో బిఆర్ఎస్ పరాజయం తరువాత నుంచీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ పొలిటికల్ గా ఏమంత యాక్టివ్ గా లేరు. ఇంత కాలం ఆయన రాజకీయాల నుంచి తాత్కాలిక విరామం మాత్రమే తీసుకున్నారని అంతా భావిస్తూ వచ్చారు. అయితే  ఇప్పుడిప్పుడే పార్టీ వర్గాలలో కూడా ఆయన తీసుకున్నది తాత్కాలిక విరామం కాదనీ, రాజకీయ విరమణేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు పూర్తిగా పగ్గాలు అప్పగించేయడమే తరువాయి అన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అందుకు అనుగుణంగా కేసీఆర్ నెమ్మదిగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల వరంగల్ వేదికగా జరిగిన పార్టీ పాతికేళ్ల సభలో హరీష్ రావు ప్రస్తావన, ప్రాముఖ్యత ఇసుమంతైనా లేకుండా అంతా కేటీఆరే అన్నట్లుగా నిర్వహించారంటున్నారు. అదే సమయంలో విషయాన్ని గుర్తించిన హరీష్ రావు తన దారి తాను చూసుకునేందుకు నిర్ణయించుకున్నారన్న వార్తలూ జోరుగా వినిపించాయి. అదే సమయంలో కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా తన సంగతేంటంటూ గొంతెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  తాజాగా ఆమె  రామానుజపురంలో నాంచారమ్మ జాతరలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోది చెప్పే నాంచారమ్మలు కవిత భవిష్యత్ లో తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని  జోస్యం చెప్పారు. వారి మాటలను చిరునగవుతో విన్న కవిత జై తెలంగాణ అంటూ నినదించారు. ఈ సంఘటన యథాలాపంగా జరిగింది కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆమె సామాజిక తెలంగాణ సాధన ఇంకా మిగిలే ఉందంటూ చేసిన వ్యాఖ్యకు దీనిని జోడించి సొంత సోదరుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నారంటున్నారు. అది పక్కన పెడితే.. సందర్భంతో సంబంధం లేకుండా తాను కేసీఆర్ ఎవరికి పగ్గాలు అప్పగించినా స్వాగతిస్తానంటూ హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కూడా ఆయనలోని అసంతృప్తికి, అసహనానికీ తార్కానంగా చెబుతున్నారు. అదే సమయంలో హరీష్ పార్టీ తదుపరి అధ్యక్షుడి విషయం లేవనెత్తడాన్ని కేసీఆర్ పోలిటికల్ రిటైర్మెంట్ కు రెడీ అయిపోయారన్న సంకేతాన్ని ఇవ్వడమేనని చెబుతున్నారు.  పార్టీ శాసనసభా పక్ష నేతగా కేటీఆర్ అంగీకరించని పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు.. ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్ష పగ్గాలనే అప్పగిస్తానని కేసీఆర్ అంటే అంగీక రిస్తారా అన్న అనుమానాలూ సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. పార్టీ అధినేతగా కేసీఆర్ ఉన్నంత వరకూ ఆయన అభిప్రాయాన్ని కాదని ఎవరూ అనరు కానీ, ఒక సారి ఆయన ఆ స్థానం నుంచి తప్పుకుంటే మాత్రం కేసీఆర్ మాట ఇక పార్టీలో ఎంత మాత్రం శిలాశాసనం అన్న పరిస్థితి ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశీలకులు బీఆర్ఎస్ చీలిక అంచున ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. 
చీలిక ముంగిట బీఆర్ఎస్? మూడు కుర్చీలాట సంకేతమదేనా? Publish Date: May 14, 2025 11:01AM

ప్రతికూలతల మధ్య కూడా అమెరికాను ధిక్కరించిన ధీర వనిత ఇందిర.. మరి మోడీ?

భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మోడీ సర్కార్ అంగీకరించడంపై దేశం రగిలిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో 1971 యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెగువ.. సాహసం గుర్తు చేసుకుంటూ.. మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు.  అమోరికా ఒత్తిడిని లెక్క చేయకపోవడమే కాకుండా, ఆ దేశ హెచ్చరికలను, ఆంక్షల బెదరింపులను లెక్క చేయకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అద్భుత దౌత్యం నెరపడమే కాకుండా పాకిస్థాన్ పీచమణిచిన తీరును ప్రస్తుతిస్తున్నారు.      పాకిస్తాన్‌పై అన్ని విధాలుగా పై చేయి సాధించి కూడా అమెరికా ఒత్తిడికి తలొగ్గి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన మోడీ  తీరును గర్హిస్తూ..  నాడు అంటే 1971 యుద్ధ సమయంలో ఇందిరాగాంధీ సాహసోపేత నిర్ణయాలను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  అప్పటి అమెరికా అధ్యక్షుడు పాక్ తో యుద్ధం ఆపాలని ఎంతగా ఒత్తిడి తెచ్చినా ఇందిరా గాంధీ పట్టించుకోలేదని గుర్తు చేస్తున్నారు. అప్పట్లో భారత్ , పాకిస్థాన్ మధ్య ఆర్థికంగా, అభివృద్ధి పరంగా ఇంత తేడా లేదు. దాదాపు ఇరు దేశాలూ సమాన స్థాయిలో ఉన్నాయి. అప్పట్లో అయితే అమెరికా ఎలాంటి దాపరికం లేకుండా పాకిస్థాన్ కు మద్దతుగా నిలిచింది. అయినా సరే ఇందిరా గాంధీ అగ్రరాజ్యం అభ్యంతరాలను, ఒత్తిడినీ తోసిరాజని గట్టిగా నిలబడింది. అదే ఇప్పుడు.. పాకిస్థాన్ ఒక చితికిపోయిన దేశం. ఏ రకంగానూ భారత్ తో సరితూగలేదు. ఉగ్రవాదాన్ని అడ్డంపెట్టుకుని భారత్ లో అశాంతి, అల్లర్లు రేపాలన్న ప్రయత్నంలో ఉంది. ఇన్ని సానుకూలతల మధ్య కూడా మోడీ అమెరికా ఒత్తిడికి తలొగ్గి.. ట్రంప్ చెప్పినదే తడవుగా బేషరతు కాల్పుల విరమణకు ఓకే చెప్పేశారు. కనీసం భారత్ లో దాడులకు సూత్రధారులైన మసూద్ అజర్ వంటి ఉగ్రవాదుల అప్పగింతకు కూడా డిమాండ్ చేయలేదు.  అందుకే దేశమంతా ఇప్పుడు ఇందిరాగాంధీని గుర్తు చేసుకుంటోంది. గట్టిగా నిలబడి భారత్ సత్తాను చాటడంలో మోడీ వైఫల్యాన్ని ఎండగడుతోంది. భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడాన్ని ఎత్తి చూపుతోంది.  
ప్రతికూలతల మధ్య కూడా అమెరికాను ధిక్కరించిన ధీర వనిత ఇందిర.. మరి మోడీ? Publish Date: May 14, 2025 10:03AM

ముగిసిన తిరుపతి గంగమ్మ‌ జాతర

తిరుపతి గంగమ్మ జాతర వేడుకగా ముగిసాయి.  బుధవారం ( మే 14) ఉదయం అమ్మవారి విశ్వరూపానికి చెంప తొలగింపు కార్యక్రమంతో ఎనిమిది రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తం అయ్యింది. అమ్మవారి విశ్వరూప దర్శనాన్ని చూసేందుకు రాయలసీమ ప్రాంతం, రాష్ట్రం నలుమూలల నుంచే  కాకుండా పలు రాష్ట్రాల నుంచి కూడా జనం పోటెత్తారు.  ఆలయంలోని విశ్వరూప స్తూపానికి గంగమ్మ విశ్వరూపాన్ని తయారు చేశారు.  ఆలయం ముందు బాగంగలో గంగమ్మ బొమ్మ తయారీలో దళితులు, కుమ్మరి, కంసాలి, చాకలి, మంగళి, గొల్ల వంటి మిరాశిదార్లు పాల్గొంటారు. గంగమ్మ బొమ్మకు కావలసినంత బంకమట్టిని పక్కనే ఉన్న కుమ్మరి వాళ్ళు   ఆచ్చారులకు అందించడం ఆనవాయితీ. అచ్చారులు నీలిమందునూనెను రంగరించి గంగమ్మ ముఖానికి నీలిరంగును అద్దారు. బంగారు పూతపూసిన చేప ఆకారంలో చెక్కిన  ముక్కెరను అలంకరించారు. బంగారం రంగురేకుల చెవులను గంగమ్మ బొమ్మకు జోడించారు. చెవులకు బంగారంలా మెరిసే సింగపూరు రేకుతో చేసిన కమ్మలు, జుంకీలను అలంకరిస్తారు. మంగళి వాళ్ళు గంగమ్మ బొమ్మ తలమీద తలవెనుక తెల్ల వెంట్రుకలను దారాల్లాగా పేర్చి, పొడవుగా వేలాడదీశారు. బంగారంలా ధగధగ మెరిసే సింగపూరు రేకుతోనే చేసిన నగిషీలు చెక్కిన కిరీటాన్ని అమ్మవారికి అలంకరించారు. కిరీటం క్రింద మల్లెపూలతోను., కనకంబరాలతోను అలంకరించారు. గంగమ్మ నుదురు భాగమంతా ఎర్రని కుంకుమను పట్టీలా పెట్టారు.  నుదురు భాగం మధ్యలో వెండితో చేసిన అడ్డనామాలను అమర్చారు. కనుబొమ్మల మధ్య గంధంతో పెద్ద బొట్టును పెట్టారు. గంగమ్మ బొమ్మ నోరు తెరుచుకొని ఉన్నట్లుగా రూపాని పెట్టారు. నోటినిండా ఎర్రకుంకుమను నింపారు. వెదురు రెబ్బలతో చేసిన పళ్ళను పెట్టారు. చాకలి వాళ్ళు తెచ్చిన చీరను గంగమ్మ బొమ్మకు కట్టారు. గొల్లవాళ్లే తెచ్చిన మంగళసూత్రాలను గంగమ్మ మెళ్ళో వేశారు. గంగమ్మ చీరకు ఒడిబాలును గొల్లవాళ్లే తెచ్చి పెట్టారు. కొద్దిసేపు బంగారు తాళిబొట్లును గంగమ్మ బొమ్మకు కట్టి తీశారు. కింద వెండితో చేసిన కన్నులను అమర్చుతారు. వెండి కన్నుల మధ్యలో నల్లని కనుగుడ్లు పెట్టడానికి ఖాళీ ప్రదేశం ఉంటుంది. కనుగుడ్లను మాత్రం చివరలో పెడ్తారు. నల్లగుడ్లను పెడితే గంగమ్మ బొమ్మకు ప్రాణం వచ్చినట్లు భావిస్తారు. తెల్లవారు జామున పేరంటాలు తాతయ్య గుంట గంగమ్మ గుడికి పేరంటాలు చేరుకున్నాయి. గుడి ముందున్న గంగమ్మ బొమ్మను చూస్తూనే పేరంటాలు వేషానికి పూనకం వచ్చి చిందులేసి చేతితో హారతి సమర్పించింది. గంగమ్మ బొమ్మ దగ్గరుండే వారు పేరంటాలు వేషానికి హారతిచ్చి గంగమ్మ పూలహారాన్ని తీసి పేరంటాలు వేషానికి వేశారు. తర్వాత చుట్టూ ఉన్న జనం, అరుపులు, కేకలు, కిలారింపులు అధికమయ్యాయి. పంబలవారు పంబను వాయిస్తూంటే పేరంటాలు వేషధారి పంబలకు అనుగుణంగా అడుగులేస్తూ, ఆవేశంతో, ఉద్రేకంతో గంగమ్మ బొమ్మ చెంప దగ్గరుండే మట్టిని చేత్తో లాగేయడాన్నే  "గంగమ్మ చెంప నరకడం" అంటారు. పేరంటాలు వేషం వెనక్కు వెళ్ళిపోతూ ఎదురుపడ్డ వారికి ఒడిబాలులోని అక్షింతల్ని ఇస్తారు. మొదటి తాతయ్యగుంట గంగమ్మ చెంప నరికి.. అక్కడి నుంచి బస్టాండ్ సమీపంలోని తాళ్లపాక పెద్ద గంగమ్మ చెంప నరకడంతో జాతర పూర్తి అయ్యింది. తిరుపతి గంగ జాతర చాటింపుతో ప్రారంభమై వివిధ వేషాలతో, మ్రొక్కులతో, వినోదాలతో, వ్యాపారాలతో, వివిధ పూజలతో సాగి చిట్ట చివర గంగమ్మ చెంప నరకడంతో పరిసమాప్తం అయింది.
ముగిసిన తిరుపతి గంగమ్మ‌ జాతర  Publish Date: May 14, 2025 9:39AM

మూడ్ ఆఫ్ ది నేషన్ మారుతోందా?

నిజమే. కాల్పుల విరమణ  విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీలు, చివరకు బీజేపీ అభిమానులు, సామాన్యులు  కూడా తప్పు పట్టారు. ఒక విధంగా చూస్తే.. అంతవరకు సానుకూలంగా ఉన్న  ‘మూడ్ ఆఫ్ ది నేషన్’, ప్రతికూలంగా  మారిపోయింది. అంతవరకు  ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని సమర్ధించిన రాజకీయ పార్టీలు విమర్శలకు తెర తీశాయి. కాల్పుల విరమణకు కారణాలు చెప్పాలని డిమాండ్ చేశాయి. అలాగే  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  చేసిన ట్వీట్లకు సంబంధించి విపక్షాలు చేసిన విమర్శలు, విశ్లేషణలi దేశం మూడ్  ను మరింతగా మార్చివేశాయి. ఫలితంగా దేశ వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం వ్యాపించింది. ప్రభుత్వం ఇరకాటంలో పడింది.   అయితే అదే సమయంలో ఇటు ప్రభుత్వం, అటు బీజేపీ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టాయి. గడచిన 24 గంటల్లో చోటు చేసుకున్న పరిణామాలను గమనిస్తే..  ఇటు ప్రభుత్వం, అటు బీజేపీ నష్ట నివారణ  చర్యల వేగం పెంచినట్లు స్పష్టంవుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి.. బీజేపీ ముందుగానే  మూడ్ అఫ్ ది నేషన్ ను పసిగట్టింది. కాల్పుల విరమణ నిర్ణయం సామాన్యుల నుంచి మేథావుల వరకు అందరినీ అసంతృప్తికి గురిచేసిందనే సత్యాన్ని కమల దళం ముందుగానే గుర్తించింది. అందుకే..  ఏ మాత్రం జాప్యం చేయకుండా దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా సొంత పార్టీలో వినిపించిన అపశ్రుతులను సరి చేసేందుకు  చర్యలు తీసుకుంది.  అందులో భాగంగానే  తిరంగ యాత్ర  పేరిట పార్టీ క్యాడర్ ముందు ఒక కార్యక్రమాన్ని ఉంచిందని పార్టీ వర్గాలు  పేర్కొంటున్నాయి. మరోవంక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగం కూడా  నష్ట నివారణ చర్యల్లో భాగంగా తీసుకున్న నిర్ణయమే అంటున్నారు. మోదీ ప్రసంగం పార్టీని మళ్ళీ ఏక తాటిపైకి తీసుకు వచ్చిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే  కాల్పుల విరమణ నిర్ణయం పట్ల మరీ ముఖ్యంగా అమెరికా ఆదేశాలతో మోదీ కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నారని జరిగిన ప్రచార ప్రభావాన్ని మోదీ ప్రసంగం కొంతవరకు తగ్గించగలిగిందని అంటున్నారు. అలాగే..  మోదీ ప్రసంగానికి కొనసాగింపుగా  భారత విదేశాంగ శాఖ  మంగళవారం(మే 13) ఆపరేషన్ సిందూర్, కాల్పుల విరమణ, జమ్మూ కశ్మీర్ వ్యవహారం, అమెరికా జోక్యంకు సంబంధించి మరింత స్పష్టత ఇచ్చిందిని అంటున్నారు.  అందులో ప్రధానంగా జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని విదేశాంగ శాఖ మరో మారు స్పష్టం చేసింది. కాల్పుల విరమణ ప్రతిపాదత పాకిస్థాన్ నుంచే వచ్చిందని దానిపై డీజీఎంవోల సమావేశంలో చర్చించి  నిర్ణయంతీసుకున్నామని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. అలాగే.. పరోక్షంగానే అయినా  అమెరికా అధ్యక్షుడు ట్రంప్  చేసిన చప్పుళ్ళకు జైస్వాల్ సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్ జరుగుతున్న సమయంలో భారత్, అమెరికా నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చ జరగలేదని చెప్పారు. ఇక సింధూ   జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. కాశ్మీర్‌పై తమ విధానం మారలేదని తెలిపారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో మూడో దేశం జోక్యాన్ని ఎంత మాత్రమూఆమోదించబోమని పేర్కొన్నారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి మధ్యవర్తిత్వం వహిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి పేర్కొన్న నేపథ్యంలో విదేశాంగ శాఖ ప్రతినిధి..  నో ..థాంక్స్ అని చెప్పకనే చెప్పారు. అదలా ఉంటే  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం (మే 13)  ఉదయం పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌ బేస్‌ను సందర్శించి, జవాన్లతో మమేకమై సైనిక ఆపరేషన్ వివరాలను అడిగి తెలుసుకుని వారి ధైర్యసాహసాలను అభినందించారు. ఈ సందర్భంగా పాక్ నడ్డివిరిచిన ఎస్-400 (S-400) మిసైల్ బ్రాక్‌ డ్రాప్‌లో వీర జవాన్లకు ప్రధాని సెల్యూట్ చేస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అదొకటి అయితే ప్రధాని అదంపూర్ విమానాశ్రయం పర్యటించడం ద్వారా, అదంపూర్ ఎయిర్‌బేస్‌ను తుత్తినియలు చేసినట్టు పాక్ చేస్తున్న అసత్య ప్రచానికి మోదీ ప్రత్యక్షంగా సమాధానం ఇచ్చారు. అదంపూర్ ఎయిర్ బేస్‌లోని రన్‌వేను తమ క్షిపణులతో దాడి చేశామని, అక్కడే ఉన్న రష్యా తయారు చేసిన ఎస్-400 మిసైల్ డిఫెన్స్ సిస్టంను ధ్వంసం చేశామని పాక్  సాగించిన అసత్య ప్రచారాన్ని మోదీ పర్యటన తుత్తునియలు చేసింది.   ఈ పరిణామాలను గమనిస్తే, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ఆపరేషన్ సిందూర్ ఫలాలు చేజారకుండా   కాపాడుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయని  అంటున్నారు. మరో వంక ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీలో ఎలా స్పందించాలనే విషయంలో స్పష్టత లోపించడం కూడా బీజేపీకి రాజకీయంగా కలిసి వచ్చిందని అంటున్నారు. ముఖ్యంగా శశి థరూర్, చిదంబరం, మనీష్ తివారీ వంటి సీనియర్ నాయకులు  పార్టీ లైన్ కు విభిన్నంగా స్పందించిన తీరు హస్తం పార్టీని ఇరకాటంలో పడేస్తే, కమల దళానికి కలిసొచ్చిందని అంటున్నారు.
మూడ్ ఆఫ్ ది నేషన్ మారుతోందా? Publish Date: May 14, 2025 8:59AM

ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..హైదరాబాద్‌లో సిట్‌ సోదాలు

  ఆంధ్రప్రదేశ్‌ మద్యం కుంభకోణం కీలక పరిణామం చేటుచేసుకుంది. సిట్ అధికారులు హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించారు. మెహిదీపట్నం, రాజేంద్రనగర్, గుడిమల్కాపూర్, షేక్‌పేట, యాకుత్‌పూరా తదితర ప్రాంతాల్లోని ఐదు కంపెనీల డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను  స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్  మైసూరులో అదుపులోకి తీసుకుంది. అతన్ని విజయవాడకు తరలించారు. మరోవైపు, ఈ కేసులో మరో ఇద్దరు నిందితులైన మాజీ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ రెడ్డి, జగన్‌ మాజీ ఓఎస్‌డీ కృష్ణమోహన్ రెడ్డికి  సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరటను అందించింది.  అదే సమయంలో హైదరాబాద్‌లో నిందితుల కార్యాలయాల్లో సిట్ సోదాలు నిర్వహిస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సరఫరా ఆర్డర్లు పొందిన కంపెనీలు, డిస్టిలరీల నుంచి నెలవారీగా రూ.50-60 కోట్ల ముడుపులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆర్థిక లావాదేవీలను నిర్వహించడంలో బాలాజీ గోవిందప్ప కీలకంగా వ్యవహరించినట్లు సిట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కెసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అతని వ్యక్తిగత సహాయకుడు దిలీప్ కుమార్, మరో నిందితుడు సిట్ అధికారులను అరెస్ట్ చేసింది.
ఏపీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం..హైదరాబాద్‌లో సిట్‌ సోదాలు Publish Date: May 13, 2025 9:39PM

ఆదాయం పెంచేందుకు మార్గాలను అన్వేషించండి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం

  ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం పెంచేందుకు మార్గాలను అన్వేషించాలని అధికారాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గడిచిన 30 ఏళ్ల ఆదాయ ఫలితాలను పరిశీలించి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం పెంచుకునేందుకు ఎలక్ట్రానిక్స్, ఐటీ, సేవల రంగాలు ఎక్కువగా దోహదం చేస్తాయని ముఖ్యమంత్రి అన్నారు. ఇవాళ సచివాలయంలో ఆదాయార్జన శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షలో శాఖలవారి పురోగతిపై చర్చించారు. మరోవైపు గోల్డ్ అత్యధికంగా కొనుగోలు చేస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందున్నప్పటికీ.. పన్ను ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు లేదో అధికారులు దృష్టి పెట్టాలని.. పన్ను ఎగవేతలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమాచారంతో డేటా లేక్ ఏర్పాటు చేయాలని... ప్రతిశాఖకు ఏఐ బృందం ఉండాలని ముఖ్యమంత్రి చెప్పారు. పన్ను చెల్లింపుదారులకు ఏఐ టూల్ ద్వారా సేవలు అందించేలా వచ్చే రెండు, మూడు నెలల్లో ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.  ప్రక్క రాష్ట్రాల నుంచి లిక్కర్ అక్రమంగా రాష్ట్రంలో విక్రయించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో మద్యం విక్రయాలు పారదర్శకంగా జరిగేలా సరఫరా దగ్గర నుంచి అమ్మకం వరకు.. ప్రతీది రియల్ టైమ్‌లో ట్రాక్ చేయాలని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో రవాణా శాఖ ఆదాయం పెరుగుతుంటే.. ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు తక్కువుగా ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నించారు. దీనికి కారణాలు అన్వేషించి వెంటనే, సరైన విధానాలను అవలంభించి ఆదాయం పెరిగేలా చూడాలని చెప్పారు. నెలవారీ లక్ష్యాలను అధిగమించేలా ఆదాయార్జన శాఖలు ప్రయత్నించాలని అన్నారు. తెలంగాణలో హైదరబాద్ నుంచే 75% ఆదాయం వస్తోందని ముఖ్యమంత్రి తెలిపారు.  ఏపీకి అలాంటి అవకాశం లేనందున ఆదాయం పెంచేందుకు లోతైన అధ్యయం చేయాలని అధికారులను సీఎం సూచించారు.
ఆదాయం పెంచేందుకు మార్గాలను అన్వేషించండి..అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం Publish Date: May 13, 2025 9:07PM

ఏపీకి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి : మంత్రి నారా లోకేశ్

  ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు  91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. .ఉండవల్లిలోని తన నివాసంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీఎస్ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్న సంస్థలకు సత్వర అనుమతులు, పూర్తిస్థాయి సహకారం అందించాలని అధికారలను మంత్రి ఆదేశించారు. ఏపీలో రూ.91,839 కోట్ల పెట్టుబడితో, 1,41,407 ఉద్యోగాలను కల్పించేందుకు సుమారు 91 దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని వెల్లడించారు.  రాబోయే ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విశాఖపట్నం నగరాన్ని అత్యాధునిక ఐటీ హబ్‌గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఐటీ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రోత్సాహకాల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.పెద్ద కంపెనీలకు అవసరమైన అనుమతులను త్వరితగతిన మంజూరు చేసేందుకు ప్రతి కంపెనీకి ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించాలని అధికారులను ఆదేశించారు.  
ఏపీకి వచ్చేందుకు 91 పెద్ద కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి : మంత్రి నారా లోకేశ్ Publish Date: May 13, 2025 7:10PM

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త...వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం

  తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు ఉంటాయని ఏపీ దేవాదయశాఖ మంత్రి ఆనం రామనారయణ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో శ్రీవారి బ్రేక్ దర్శనాల కోసం భక్తులు ఇచ్చే సిఫార్సు లేఖలను తిరిగి స్వీకరించేందుకు తిరుమల దేవస్థానం సిద్ధమైంది. ఈ క్రమంలో మే 15 నుంచి సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు కేటాయింపు ప్రారంభం కానునట్లు  మంత్రి ఆనం పేర్కొన్నారు.  ఏపీ, తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల పై బ్రేక్ దర్శనాలు కేటాయిస్తారని పేర్కొన్నారు. ఈ మేరకు ఇవాళ టీటీడీ అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. శ్రీవారి దర్మనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. ఈ క్రమంలో ప్రపంచ నలుమూలల నుంచి భక్తులు తిరుమల కొండకు చేరుకుని శ్రీవారికి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ తరుణంలో టీటీడీలో కొన్ని సార్లు భక్తుల రద్దీ అధికంగా, మరికొన్ని సార్లు స్వల్పంగా ఉంటుంది. వేసవి సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సిఫార్సు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసిన విషయం తెలిసిందే.   
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త...వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం Publish Date: May 13, 2025 6:35PM

బీఆర్‌ఎస్ పార్టీలో విభేదాలపై హరీష్ రావు క్లారిటీ.. కేటీఆర్‌‌ బాధ్యతలుపై కీలక వ్యాఖ్యలు

  బీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలపై మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి వర్గ విభేదాలు లేవని హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. అధినేత కేసీఆర్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తప్పకుండా స్వాగతిస్తాని ఆయన పేర్కొన్నారు. గులాబీ బాస్  తీసుకునే ప్రతీ నిర్ణయాన్ని తాను గౌరవిస్తాను, ఆయన ఆదేశాలను పాటిస్తానని అన్నారు. రాముడికి హనుమంతుడిలాగా కేసీఆర్‌కు క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను నేను.. కేసీఆర్ మాటే.. హరీష్ బాట అని పార్టీలో విభేదాలను పుల్ స్టాప్ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేక  చేతులు ఎత్తేసిందని అన్నారు. సీఎం రేవంత్ చేతిలో మోసపోయామని గ్రహించిన ప్రజలంతా.. కేసీఆర్ కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు.  రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రస్తుత ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ పరిస్థితి పాకిస్థాన్‌ కంటే దారుణంగా ఉందని ఆయన అన్నారు. పాక్‌ను నమ్మి అప్పు ఇస్తున్నారు. కానీ రేవంత్‌ను నమ్మి అప్పు ఇవ్వడం లేదని హారీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రికి రాష్ట్రాన్ని పాలించడం చేతకావడం లేదని విమర్శించారు
బీఆర్‌ఎస్ పార్టీలో  విభేదాలపై హరీష్ రావు క్లారిటీ.. కేటీఆర్‌‌ బాధ్యతలుపై కీలక వ్యాఖ్యలు Publish Date: May 13, 2025 6:24PM