TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తిరుమలలో చంద్రబాబు చేసిన అద్భుతం: నీటి కరవుకు చరమగీతం.!

Published on: Wed Nov 18, 2026 4:15PM

అది 1999వ సంవత్సరం.. తిరుమల కొండపై చుక్క వాన పడలేదు. నైరుతి ముఖం చాటేసింది. తిరుమలలో నీటి కరవు పతాక స్థాయికి చేరింది. పాపనాశనం, గోగర్భం రిజర్వాయర్లు అడుగంటి పోయాయి. కొండపై వసతి గదులకు, నిత్యం లక్షలాదిగా వచ్చే భక్తులు నీటికి కటకటలాడే పరిస్థితి. తిరుమల తిరుపతి దేవస్థానం చేతులెత్తేసింది. చివరికి అన్ని రకాల అంచనాలు, పరిశోధనలూ, పరిశీలనలూ చేసి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి టీటీడీ అధికారులు నివేదించారు. వారి నివేదన ఏంటంటే..మరో రెండు నెలలు అంతే రెండు నెలలు.. ఏదో అద్భుతం జరిగితే తప్ప తిరుమలను మూతవేయడం తప్ప మరో గత్యంతరం లేదు. ఔను టీటీడీ అదికారులు చంద్రబాబుతో చెప్పిన మాట ఇదే. టీటీడీ అధికారులు గుబులుగా, గొంతు నిండా బాధతో చెప్పలేక చెప్పలేక తిరుమలను తాత్కాలికంగా మూసేయడం వినా మరో గత్యంతరం లేదని కుండబద్దలు కొట్టారు. 

ఈ కబురు వినగానే చంద్రబాబు క్షణం ఆలోచించలేదు. అదెలా కుదురుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమల మూతపడడానికి వీల్లేదు అని విస్పష్టంగా, నిష్కర్షగా చెప్పారు. తిరుమలలో అవసరాలకు నీరు ఎన్ని రోజులు వరకూ వస్తుందని ఆరా తీశారు చంద్రబాబు. అప్పటికే తమ వద్ద సిద్ధంగా ఉన్ని రిపోర్టులో ఉన్న విషయాన్ని టీటీడీ అధికారులు చంద్రబాబుకు వివరించారు. రెండు నెలలు అన్నది  వారి వివరణ.  ఆ క్షణం నుంచి చంద్రబాబు తిరుమల నీటి కొరత తీర్చడానికి ఏం చేయాలన్న విషయంపైనే తన దృష్టి అంతా కేంద్రీకరించారు. ఎల్ అండ్ టీ ఇంజనీర్లతో చర్చించారు. మేధో మథనం చేశారు. కల్యాణీడ్యామ్ నుంచి పైప్ లైన్ల ద్వారా కొండపైకి నీటిని తరలించాలని నిర్ణయానికి వచ్చారు. పనుల ప్రారంభానికి ముహూర్తం ఖరారు చేశారు. 1999 డిసెంబర్ 28న పనులు ఆరంభమయ్యాయి. ఆ రోజు నుంచి టీటీడీ అధికారులు చెప్పిన రెండు నెలల గడువుకు కేవలం 49 రోజులే మిగిలింది. అంటే తిరుమలకు నీటిని తరలించే విషయంపై జరిపిన మేధో మథనం 11 రోజుల్లో ముగిసింది. సరిగ్గా 1999 డిసెంబర్ 28 నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.  

 మూడు వేల మంది కార్మికులు రేయింబవళ్లు అన్న తేడా లేకుండా శ్రమించారు. తిరుమల కొండ కింద నుంచి కొండపైకి 9కిలో మీటర్ల పైప్ లై న్.. కొండపైకి లోయల్లోంచి, దట్టమైన అడవుల్లోంచి. ఎక్కడా తడబాటు లేదు. ఎక్కడా విశ్రమం, విరామం లేదు. రేయింబవళ్లు కష్టపడ్డారు. వాహనాలు వెళ్లలేని ఆ రోజుల్లో సామగ్రిని గాడిదలు మోశాయి. కిర్లోస్కర్, జేఎస్‌డబ్ల్యూ సహకారంతో హై కెపాసిటీ పంప్‌లు, ప్రత్యేక పవర్ సబ్‌స్టేషన్లు రెడీ అయ్యాయి. కార్మికులు, అధికారులే కాదు చంద్రబాబూ ఆ 49 రోజులూ అవిశ్రాంతంగా శ్రమించారు. నిత్యం ఉదయం, సాయంత్రం పనుల పురోగతిని సమీక్షించారు.  అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు.  

2000 ఫిబ్రవరి 14. ఉదయం 11:15 గంటలు.. అప్పటి ప్రదాని అటల్ బీహారీ వాజ్ పేయి ఈ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయడానికి ఖరారు చేసిన ముహూర్తం. అంతా సిద్ధమైంది. అందరి కళ్లూ పైప్ లైన్ల ద్వారా కల్యాణి డ్యామ్ నీరు కొండమీదకు చేరుతుందా? అని ఊపిరి బిగపట్టి చూశారు. ఆ ప్రాజెక్ట్ విజయవంతమైంది. కల్యాణి డ్యామ్  నుంచి నీరు కొండపైకి చేరింది. సాధారణంగా అయితే ఈ భారీ ప్రాజెక్టు పూర్తికి రెండు మూడేళ్లు పడుతుంది. కానీ ఒక నాయకుడి సంకల్పం, చిత్తశుద్ధి, అసాధ్యాలను సుసాధ్యం చేయగలనన్న ఆత్మ విశ్వాసం.. సంక్షోభాలను అలవోకగా అధిగమించి వాటి లోంచే అవకాశాలను సృష్టించే నేర్పు, దార్శనికత ఈ ప్రాజెక్టును కేవలం 49 రోజులలో సాకారం చేశాయి.  ఈ రోజు కూడా పాపనాశనం, గోగర్భం, ఆకాశగంగ ఉన్నప్పటికీ, కొండపై అత్యధిక నీరు వస్తున్నది కళ్యాణి డ్యామ్ నుంచే. తిరుమలలో నీటి ఎద్దడి ముప్పు లేకపోవడానికి కారణం చంద్రబాబు ప్రకృతితో యుద్ధం చేసి గెలవడమే.  26 ఏళ్ల క్రితం 49 రోజుల్లో జరిగిన మహాద్భుతం సంకల్పం ఉంటే అసాధ్యం ఉండదన్న చంద్రబాబు ఆత్మవిశ్వాసమే అప్పట్లో శ్రీవారి ఆలయం మూతపడే ప్రమాదాన్ని తప్పించింది.  

ఇది కూడా చదవండి:  ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారం.. గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు..!

ఇది జరిగిన మూడున్నరేళ్ల తరువాత అంటే 2003 అక్టోబర్ 1న శ్రీవారి బ్రహ్మోత్సవాల కోసం తిరుమల వెళ్తున్న చంద్రబాబు కాన్వాయ్ పై మావోయిస్టులు క్లెమోర్ మైన్స్ పేల్చారు. ఆ పేలుడు ధాటికి  వాహనాలు ఛిద్రమయ్యాయి. చంద్రబాబు ప్రయాణిస్తున్న వాహనం అంతెత్తు ఎగిరి ఘాట్ రోడ్డు కూ పక్కన పడింది. ఆయన గాయాలతో బయటపడ్డారు.

ఆయన అంతటి ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడానికి శ్రీవారి ఆలయం మూతపడకుండా, అపర బగీరధుడిలా కొండపైకి నీటిని తరలించడమేనని మనసా వాచా కర్మణా నమ్ముతారు శ్రీవారి భక్తులు.  తన కొండపైకి నీటిని తీసుకువచ్చి ఆలయం మూతపడకుండా కాపాడిన చంద్రబాబును అదే కొండదారిలో ఘోర ప్రమాదం నుంచి చంద్రబాబును ఆ ఏడుకొండల వాడే, ఆ కోనేటిరాయుడే కాపాడారని నమ్ముతారు.  అది పక్కన పెడితే.. కల్యాణి డ్యామ్ నుంచి శ్రీవారి కొండపైకి నీటిని తరలించిన అనుభవంతో, ఏదైనా సాధ్యమేనన్న నమ్మకంతో చంద్రబాబు తన భగీరథ యత్నాలను కొనసాగించారు. 1996లో తాను శంకుస్థాపన చేసిన హంద్రీ నీవా ప్రాజెక్టు ద్వారా 2025లో కుప్పానికి కృష్ణా జలాలను చేర్చారు.  శ్రీశైలం నుంచి దాదాపు 770 కిమీటర్ల జల ప్రవాహం చంద్రబాబు సంకల్పంతోనే సాధ్యమైంది.  అక్కడితో ఆగలేదు..    పోలవరం నుండి నదుల అనుసంధానం వరకు రాష్ట్రానికే కాదు దేశానికి దారి చూపిస్తున్న ప్రణాళికలు, పనులు చంద్రబాబు అసిధారా వ్రతంలా కొనసాగిస్తున్నారు. 

మీకు నచ్చవచ్చు: పవిత్ర సంగమంలో చంద్రబాబు జలహారతి.. ప్రత్యేక పూజలు.!​
సీఈవో సీఎం నుంచి వాటర్ మ్యాన్ సీఎంగా చంద్రబాబు పొలిటికల్ జర్నీ.!

 

[Tirumala, Waterscarecity, CBN, Determination, KalyaniDam, Pipelines, TeluguOne]