ఉత్తరాంధ్ర దశాబ్దాల కల సాకారం.. గోదావరి జలాలను విడుదల చేసిన సీఎం చంద్రబాబు..!
Published on: Wed Sep 2, 2026 5:19PM

ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల దశాబ్దాల నాటి కలను సాకారం చేస్తూ గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుకున్నాయి. పోలవరం ఎడమ కాలువ ద్వారా పారుతున్న గోదావరి పవిత్ర జలాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా జలహారతి ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పాయకరావుపేట నియోజకవర్గంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు తొలుత ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ఎడమ కాలువ నిర్మాణాలను, నీటి పారక స్థితిని ఆకసంలో నుంచి పరిశీలించారు. అనంతరం పాయకరావుపేట వద్ద క్రాస్ రెగ్యులేటర్ ద్వారా నీటిని ఉత్తరాంధ్ర జిల్లాలకు అధికారికంగా విడుదల చేశారు.

ఈ చారిత్రాత్మక ఘట్టానికి గుర్తుగా పాయకరావుపేట సమీపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంలో స్థానిక ప్రజలు, కళాకారులు సాంప్రదాయ కోలాటాలు, మంగళవాయిద్యాలతో సీఎంకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత తదితర ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పోలవరం ఎడమ కాలువ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ. 4,192 కోట్ల భారీ వ్యయంతో పూర్తిచేసి ఈ నీటి తరలింపును సాధ్యం చేసింది. ఎడమ కాలువ నుంచి వచ్చే జలాలతో అనకాపల్లి జిల్లాలోని ఏలేరు కాలువతో పాటు సుమారు 110 చెరువులను నింపేందుకు అధికారులు సమగ్ర ప్రణాళిక రూపొందించారు.
.webp)
ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్ర పరిధిలోని నాలుగు జిల్లాల్లో దాదాపు 2.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా దాదాపు 9 లక్షల మంది ప్రజలకు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల పారిశ్రామిక అవసరాల కోసం 23.44 టీఎంసీల నీటిని కేటాయించనున్నారు.
ఈ ప్రాజెక్టు వల్ల పుష్కర ఆయకట్టు కింద 1.48 లక్షల ఎకరాలు, ఏలేరు పరిధిలో 80 వేల ఎకరాలు, తాండవ, వరహా, మామిడిగెడ్డ ఆయకట్టు కింద ఉన్న మరో 46,620 ఎకరాలు స్థిరీకరణ చెందుతాయని నీటిపారుదల శాఖ అధికారులు వెల్లడించారు. నీటి ఎద్దడితో నానా అవస్థలు పడ్డ ప్రాంతాలకు గోదావరి రాకతో శాశ్వత పరిష్కారం దొరికినట్లయింది.

రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీరు సునాయాసంగా అందడమే కాకుండా విశాఖ పారిశ్రామిక ప్రాంత వృద్ధికి గోదావరి జలాలు దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎడమ కాలువ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి నీటిని విడుదల చేయడంపై స్థానిక రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
[CM Chandrababu Naidu, Godavari Water to Uttarandhra, Polavaram Left Canal, Payakaraopeta, Anakapalli, Andhra Pradesh Agriculture News]


