ఏపీ సహా 10 రాష్ట్రాలు యమ డేంజర్ 

దేశంలో కరోనా  మహమ్మారి ఉగ్రరూపం కొనసాగుతోంది. రోజుకు 3 లక్షలకు పైగానే కేసులు నమోదవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం 4 లక్షల కేసులకు పెరిగి. తర్వాత కొంత తగ్గినా అదుపులోనికి మాత్రం రావడం లేదు. రికార్డ్ స్థాయిలో రోజు 4 వేలకు పైగా మరణాలు నమోదవుతున్నాయి. అనధికారిక లెక్కల ప్రకారం మరణాల సంఖ్య భారీగా ఉంటుందని చెబుతున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం 10 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. 

దేశంలోని 12 రాష్ట్రాల్లో ఒక్కోచోట లక్షలకు పైగా యాక్టివ్‌ కేసులు ఉండగా.. 8 రాష్ట్రాల్లో 50వేల నుంచి లక్ష వరకూ ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. కర్ణాటకలో అత్యధికంగా క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, యూపీ, ఏపీ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, గుజరాత్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, హరియాణా రాష్ట్రాలు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 2,01,042 మంది చికిత్స  పొందుతున్నారు. 15 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 50వేల కన్నా తక్కువ యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.

పది రాష్ట్రాల్లో 25శాతానికి పైగా కరోనా పాజిటివిటీ రేటు ఉన్నట్టు తెలిపారు. ఇందులో కూడా ఏపీ పైనే ఉంది. పాజిటివిటి రేటు 20 శాతం కన్నా ఎక్కువగా ఉండటం అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. గోవాలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 48.1శాతంగా ఉండగా.. పుదుచ్చేరిలో 42.5, పశ్చిమబెంగాల్‌లో 34.3శాతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో పాజిటివిటీ రేటు 25.3 శాతంగా ఉందియ 15శాతం పాజిటివిటీ రేటు కలిగిన రాష్ట్రాలు 14 ఉన్నట్టు కేంద్రం తెలిపింది.  గత రెండు వారాలుగా 125 జిల్లాల్లో పాజిటివిటీ రేటు తగ్గగా.. గత వారం అంటే మే 6 నుంచి 13 వరకు 338 జిల్లాల్లో తగ్గుదల నమోదైనట్టు కేంద్రం తెలిపింది. మే 3 నుంచి దేశంలో రికవరీ రేటు పెరుగుదల నమోదవుతోందని కేంద్రం వెల్లడించింది. కేరళ, తమిళనాడు, బెంగాల్‌లో ప్రమాదకర స్థాయిలో  కొత్త కేసులు నమోదవుతున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 

ఇప్పటివరకు 17.72కోట్ల డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. తొలి డోసును 13.76కోట్ల మందికి వేయగా.. రెండో డోసును 3.96కోట్ల మందికి వేసినట్టు తెలిపారు. 17 కోట్ల డోసుల పంపిణీకి భారత్‌లో 114 రోజుల సమయం పట్టినట్టు కేంద్రం తెలిపింది. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దగ్గర వేగంగా టీకా పంపిణీ పంపిణీ జరుగుతోందని వెల్లడించింది. 17 కోట్ల మార్కును దాటేందుకు భారత్‌కు 114 రోజులు పట్టగా.. అమెరికాకు 115 రోజులు, చైనాకు 119 రోజుల సమయం పట్టిందని కేంద్రం వెల్లడించింది.