పాపం జస్టిస్ కనగరాజ్.. అద్దె కట్టి ఫర్నిచర్ తీసుకెళ్లండి అంటున్న ఓనర్

ఏపీలో జగన్ ప్రభుత్వం గత ఏప్రిల్ నెలలో ఎస్ఇసి గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తప్పించి జస్టిస్ కనగరాజ్ ను కొత్త ఎస్ఇసి గా నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ హైకోర్టులో వాదనల తర్వాత ఈ విషయంలో ఏపీ సర్కార్ నిర్ణయాన్ని కొట్టివేసిన సంగతి తెలిసిందే. అయితే జస్టిస్ కనగరాజ్ కోసం ఏపీ ప్రభుత్వం విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రాంతం లోని ఒక పోష్ ఏరియాలోని అపార్టుమెంట్లో గత ఏప్రిల్ లో ఆయనకు నివాసాన్ని ఏర్పాటు చేసారు. ఆ ఫ్లాట్ కి నెలకు అద్దె రూ.1,11,800. ఒక పక్క హైకోర్టు అయన నియామకాన్ని రద్దు చేసింది. మరో పక్క పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ఆ ఫ్లాట్ కు అద్దె కూడా చెల్లించలేదు. అయితే తాజాగా ఈ ఫ్లాట్ లోని ఫర్నిచర్ ను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వ అధికారులు ప్రయత్నించడంతో తనకు బకాయి ఉన్న అద్దె చెల్లించి తీసుకువెళ్లాలని ఆ ఫ్లాట్ ఓనర్ రవీంద్రనాథ్ కోరారు. దాంతో అధికారులు ఆ ఫ్లాట్ ఓనర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

 

అయితే ఈ విషయం పై ఫ్లాట్ ఓనర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ తమకు మొత్తం ఆరు నెలలు అద్దె కింద రూ.7 లక్షల వరకు రావాల్సి ఉండగా.. అధికారులెవరూ ఈ విషయం పై స్పందించడం లేదని వాపోయారు. అంతేకాకుండా తాము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదని, కేవలం సాధారణ ప్రజలమని.. అద్దె చెల్లించకుండా తమను ఇబ్బంది పెట్టడం సరి కాదన్నారు. వచ్చిన అధికారులకు అగ్రిమెంట్‌ లెటర్‌ ఇచ్చి ఫర్నిచర్‌ తీసుకెళ్లవచ్చని చెప్పానని, వారు స్పందించకపోతే దీనిపై న్యాయస్ధానంలోనే తేల్చుకుంటామన్నారు. ఇది ఇలా ఉండగా అగ్రిమెంట్‌ లెటర్‌ ఇవ్వాలన్న రవీంద్రనాథ్ విజ్ఞప్తి గురించి ఉన్నతాధికారులకు తెలిపామని స్థానిక సిఐ చెప్పారు. దీంతో ఫర్నిచర్ కోసం వచ్చిన అధికారులు వాటిని తీసుకోకుండానే వెళ్లిపోయారు.