ఎన్నికల ముందు వార్.. తర్వాత గప్ చుప్! కారు, కమలం నేతలపై డౌట్స్ 

ఎన్నికల సమయంలో, ఆ రెండు పార్టీల నాయకులు ఒకరికొకరు దుమ్మెత్తి పోసుకుంటాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెరాస, ఒకరిపై ఒకరు కత్తులు దూస్తారు, మాటల తూటాలు పేలుస్తారు. అయిత, ఎన్నికల క్రతువు ముగియగానే, అన్నీ మరిచి పోతారు. మళ్ళీ ఎన్నికలు వచ్చే వరకు, ఆ ముచ్చటే మళ్ళీ ఎత్తరు. అందుకే, తెరాస, బీజేపీ నాయకుల జుగల్ బందీకి అంత ప్రధాన్యత ఇవ్వవలసిన అవసరంలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఎమ్మెల్సీ ఎన్నిక సమయంలో మంత్రి కేటీఅర్, ఖాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, ఐటీఐ ఆర్ ప్రాజెక్ట్ గురించి మాటలాడని రోజు లేదు. ఈ మూడు అంశాల చుట్టూనే ప్రచారం నడిపించారు. విపక్షాలు నిరుద్యోగ సమస్య, నియమకాలకు సంబంధించిన లెక్కల తప్పుల అంశాన్ని ప్రస్తావించి నప్పుడు, కేటీఆర్ ఇతర నాయకులు ఈ అంశాలను తెరమీదకు తెచ్చారు.  అయితే,  ఎన్నికలు అయిపోయియన్ తర్వాత  మళ్ళీ  వాటి ఊసే లేదు.  ఖాజీపేట కోచ్  ఫ్యాక్టరీకి కాదు అసలు దేశంలో ఎక్కడ కొత్తగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రపాదన ఏదీ లేదని, కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ కుండ బద్దలు కొట్టారు, అయినా కేటీఆర్ పెదవి విప్పలేదు. కనీసం పిట్టకూత (ట్వీట్) అయినా చేయలేదు.
 
ఇక ఇప్పుడు మళ్ళీ,  హుజురాబాద్ ఉపఎన్నికల వేడి పెరుగతున్న నేపధ్యంలో, టీఆర్ఎస్ మళ్లీ తనదైన వ్యూహాన్ని మొదలెట్టింది. ఆపార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వ  వైఫల్యాలను తెర మీదకు తెచ్చేందుకు మళ్లీ రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆయన  రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమి చేసిందో  చెప్పాలని సవాల్ విసిరారు. పాత పాటను పక్కన పెట్టి కొత్త పల్లవి ఎత్తుకున్నారు. ఖాజీపేట, బయ్యారం, ఐటీఐఆర్ మరిచిపోయారు. కొత్తగా  ఆత్మనిర్భర్ ప్యాకేజిని పైకి తెచ్చారు.  ఈపథకం వల్ల ఒరిగిందేంటని కేంద్రాన్ని ప్రశ్నించారు.  ఈ మేరకు ఆయన  కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్’కు లేఖ రాశారు. ఈ పథకం    ప్రారంభమై   ఒక సంవత్సరం పైగా కావస్తున్నా.. ఇంతవరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా ఎలాంటి లబ్ధి చేకూరలేదని మంత్రి కేటీఆర్ తెలిపారు. 

కరోనా సంక్షోభానికి ప్రభావితమైన వివిధ రంగాలను ఆదుకునేందుకు ప్రధాన మంత్రి రూ. 20 లక్షల కోట్లతో ఆత్మ నిర్భర్ భారత్ పేరిట సహాయ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈపథకం వలన ప్రయోజనం పొంది వారున్నారు, అయితే అందరికీ ప్రయోజనం చేకురిందా, సంక్షోభం పూర్తిగా తొలిగి పోయిందా, అంటే లేదు.. అయితే అదే నిజం అయితే, రాష్ట్ర ప్రభుత్వ్వం స్వయంగా ఆయనే మంత్రిగా ఉన్న పరిశ్రమల శాఖ ఇంత కాలం ఎందుకు మౌనంగా ఉందని, బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు,. ఇంకా విడ్డూరంగా ప్రధానమంత్రి సంవత్సరం క్రితం ప్రకటించిన పథకంలో లోపాలు ఉన్నాయని, మంత్రి ఇప్పుడు గుర్తించారా, అని కూడా బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.