ఇంట్లో కూడా మాస్క్ పెట్టాల్సిందే!

దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజురోజుకు కేసులు భారీగా పెరుగుతుండటంతో వైద్య వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా సెకండ్ వేవ్‌లో పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని తెలంగాణ హెల్త్‌  డైరెక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం సుమారు 5 వేల కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. వైరస్ ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లిందన్నారు. ప్రపంచదేశాలు కరోనాకి మొకరిల్లుతున్నాయని చెప్పారు.

ప్రపంచ వ్యాప్తంగా స్పానిష్ ఫ్లూ మొదటి వేవ్‌లో 30 నుంచి 50 లక్షల మంది చనిపోయారని శ్రీనివాసరావు  తెలిపారు. స్పానిష్ ఫ్లూ రెండో వేవ్‌లో 2 నుంచి 7 కోట్ల మంది మృతి చెందినట్టు సమాచారం. మార్చ్ 24న తెలంగాణలోని ఓ జిల్లాకి మహారాష్ట్ర నుంచి 20మంది ఉత్సవం కోసం వచ్చారని పేర్కొన్నారు. మరో 30 మంది తెలంగాణ వాళ్లు వారికి జత కలిశారని ఆయన చెప్పారు. ఈ నెల 4న టెస్ట్‌లు చేస్తే అందులో 34 మందికి కరోనా వచ్చిందని తెలిపారు. ఆ ఘటన తర్వాత 433 మందికి వైరస్ సోకిందన్నారు. తెలంగాణలో ఇదే అతి పెద్ద ఔట్ బ్రేక్ అన్నారు.

రాష్ట్రంలో డబుల్ మ్యుటేషన్ లు వచ్చాయన్నారు హెల్త్‌  డైరెక్టర్‌ శ్రీనివాసరావు. టెస్ట్ ల సంఖ్య పెంచామన్నారు. పాజిటివిటీ రేట్ 2.98 శాతంగా ఉందన్నారు. ఏప్రిల్ 1వ తేదీ నాటికి 1.5 మాత్రమే పాజిటివిటీ రేట్ ఉండేదని చెప్పారు.ప్రైమరీ హెల్త్ కేంద్రాలకు టెస్ట్ ల కోసం జనం భారీగా వస్తున్నారని శ్రీనివాసరావు తెలిపారు.  రాష్ట్రంలో 38 వేల 600 బెడ్స్ ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయన్నారు. రాబోయే రోజుల్లో 53 వేలకు పెంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. 5 వేల ఆక్సిజన్ బెడ్స్ ప్రైవేట్ లో   ఉన్నాయని వెల్లడించారు.కొన్ని పెద్ద ఆస్పత్రుల్లో మాత్రమే బెడ్స్ లేవని, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వెంటిలేటర్ లు, ఆక్సిజన్, బెడ్స్, మందులు, సిబ్బంది కొరత లేదని చెప్పారు శ్రీనివాసరావు. ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చి చికిత్స పొందాలని సూచించారు. మందులను అతిగా వాడటం మంచిది కాదన్నారు. రేమిడిస్వీయర్  వైద్యుడి సలహా మేరకు మాత్రమే వాడాలని హెచ్చరించారు. 

మరో  6 నుంచి 8 వారాల వరకు ప్రజలు జాగ్రత్త గా ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని  హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావు సూచించారు. lancet జర్నల్ లో కూడా గాలి ద్వారా వైరస్ వ్యాపిస్తుందని తెలిపిందన్నారు. ఇంట్లో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలో 1300 లకు పైగా కేంద్రాల్లో వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందన్నారు.ఇప్పటి వరకు 28 లక్షల మందికి వ్యాక్సిన్. అందులో 25 లక్షల మందికి మొదటి డోస్ పూర్తి అయిందని, మరో 3 లక్షల మంది కి రెండో డోస్ కూడా పూర్తి అయిందని వెల్లడించారు. శుక్రవారం  ఒక్కరోజే 170000 వేల మందికి వ్యాక్సినేషన్ వేశామన్నారు శ్రీనివాసరావు.

2020 కన్నా ఇప్పుడు వైరస్ తీవ్రంగా ఉందని గాంధీ సూపరిండెంట్ డాక్టర్ రాజారావు చెప్పారు.  వేగంగా ఒకరినుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతోందన్నారు. లక్షణాలు లేని వారు, స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఉండీ చికిత్స పొందవచ్చని సూచించారు. అత్యంత తీవ్రంగా వైరస్ లక్షణాలు ఉన్న వారికి మాత్రమే  ఐసీయూ అవసరం అవుతుందన్నారు రాజారావు. ప్రస్తుతం యువతలో ఎక్కువగా కోవిడ్ సోకుతోందని తెలిపారు. ఉన్న బెడ్స్ ని సరిగా వాడుకుంటే అవసరం అయిన వారికి చికిత్స అందించడం సులభం అవుతుందన్నారు డాక్టర్ రాజారావు.