ఏపీ రాజకీయాలపై తెలంగాణ ఎన్నికల ఫలితాల ప్రభావం?!
posted on Nov 1, 2023 10:49AM
తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం జరిగిన రెండు ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సంబంధాలు, వైరాలు ఎక్కువయ్యాయి. అందుకు తగ్గట్లే రాజకీయ పార్టీలు కూడా రకరకాల ఎత్తులు, పై ఎత్తులు వేస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా కొన్ని పార్టీలు ప్రణాళికలు రచించుకుంటుంటే.. గెలుపు ఓటములను నిర్ణయించేలా మరొకొన్ని పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో ముందుగా తెలంగాణలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఇక ఏపీలో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాగా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణలో అధికారం దక్కించుకుంటే పార్టీని బట్టి ఏపీ రాజకీయాలు మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఏపీలో తెలుగుదేశం, వైసీపీ, జనసేన పార్టీలకు మాత్రమే రాజకీయంగా చోటు ఉంది. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఉన్నా అన్నీ కలిసినా రెండు శాతానికి మించి ఓట్లు పడే అవకాశం లేదు. కనుక ఏపీ ఎన్నికలలో తెలుగుదేశం, జనసేన, వైసీపీలే ప్రధానంగా రంగంలో ఉన్నట్లుగా చెప్పాల్సి ఉంటుంది. కాగా జనసేన ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తులో ఉన్న సంగతి తెలిసిందే. ఈసారి ఏపీలో తెలుగుదేశం, జనసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ఇప్పటికే సర్వేలు తేల్చేశాయి. అయితే అసలు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ఎన్నికల సమయానికి ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుందన్న చర్చ సహజంగానే వస్తున్నది. అంతేకాదు తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో ఏ పార్టీకి ప్రయోజనం, ఏ పార్టీకి నష్టం అన్న చర్చలూ రాజకీయవర్గాలలో సాగుతున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీలో అధికార పార్టీ వైసీపీకి తీరని నష్టం తప్పదన్న చర్చ గట్టిగా జరుగుతోంది. కర్ణాటక ఫలితాలతో ఫామ్ లోకి వచ్చిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారం దక్కించుకుంటే ఏపీ మీద ఫోకస్ పెట్టడం ఖాయం. అదే జరిగితే వైసీపీకి భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
ఎందుకంటే ఇప్పుడున్న వైసీపీలో కాంగ్రెస్ నేతలే అధికం. కాంగ్రెస్ లో ఓ వెలుగు వెలిగిన నాయకులంతా అనివార్య పరిస్థితుల్లో జగన్ గూటికి చేరారు. వీరిలో కొందరు కాంగ్రెస్ పార్టీలో ఉండే స్వేచ్ఛ, స్వాతంత్య్రం గుర్తు చేసుకుంటూ అయిష్టంగానే వైసీపీలో కొనసాగుతున్నారు. తెలుగుదేశంతో ఉన్న సైద్దాంతిక విభేదాలు, స్థానిక పరిస్థితుల దృష్ట్యా చాలామంది కాంగ్రెస్ నేతలు వైసీపీలో కొనసాగాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కసారి మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటే వైసీపీలోని కాంగ్రెస్ నేతలు చాలా మంది మళ్ళీ వెనక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే జాతీయ స్థాయిలో బలోపేతం అయిన కాంగ్రెస్ తెలంగాణలో కూడా అధికారం దక్కించుకుంటే ఏపీలో మళ్ళీ పార్టీని పరుగులు పెట్టించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అన్నది ఎలా ఉన్నా.. ఏపీలో కూడా కాంగ్రెస్ బలమైన నేతలను వెనక్కు రప్పించగలదు.. అంతో ఇంతో ఓటు బ్యాంక్ కూడా తిరిగి సంపాదించుకోగలుగుతుంది. ఈ నాయకులు, ఓటు బ్యాంక్ వైసీపీ నుండి చీలిపోవడం గ్యారంటీ కనుక ఇది వైసీపీకి తీరని నష్టమే అవుతుంది.
కారణాలేమైనా బీఆర్ఎస్ తెలుగుదేశం పార్టీపై వ్యతిరేక భావనతోనే ఉంటుంది. ఎన్నికల సమయంలో కాస్త దగ్గరైనట్లు కనిపించినా బీఆర్ఎస్ చంద్రబాబును ఎప్పడూ ప్రత్యర్థిగానే చూస్తుంది. కాగా తెలంగాణలోని తెలుగుదేశం సానుభూతి పరులు స్థానిక పరిస్థితుల దృష్ట్యా ఇన్నాళ్లూ బీఆర్ఎస్, కాంగ్రెస్ వైపే ఉంటూ వచ్చారు. కానీ, ఈసారి పరిస్థితి మారింది. తెలుగుదేశం అభిమానులు బీఆర్ఎస్ మీద గుర్రుగా ఉన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టులో బీజేపీ హస్తం ఉందనే భావన కూడా ఉంది. దీంతో ఇక్కడ తెలుగుదేశం పోటీలో ఉండి ఉంటే.. వీరంతా తెలుగుదేశం భ్యర్థులకే గ్యారంటీగా ఓటేసేవారు. అలా జరిగి ఉంటే బీఆర్ఎస్ ఏదో మేరకు లబ్ధి పొంది ఉండేది. కానీ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు ఆ పార్టీ సానుభూతిపరులంతా కాంగ్రెస్ వైపే వెళ్లనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం వలన జాతీయ స్థాయిలో బలపడి ఏపీ మీద ఫోకస్ చేయడం గ్యారంటీ. అది టీడీపీకి మరింత కలిసి వచ్చే అంశం. అదే సమయంలో వైసీపీకి నష్టం చేకూరడం కూడా ఖాయం. అందుకే తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీపై కచ్చితంగా ప్రభావం చూపుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.