తెలంగాణలో కరోనా ప్రకంపనలు.... ఒక్క రోజే 7 పాజిటివ్ కేసులు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా భూతం.. తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకేసారి 7 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మార్చి 18 రాత్రి విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలను పేర్కొంది. రాష్ట్రంలో ఒక్క రోజే 9 పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. బాధితులందరూ ఇండోనేషియాకు చెందిన వారిగా అధికారులు వెల్లడించారు. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 13కు చేరింది. దేశంలో తెలంగాణ ఒక్కసారిగా మూడో స్థానానికి చేరింది.

కొద్ది రోజుల కిందట మత కార్యక్రమాల కోసం ఇండోనేషియా నుంచి త‌బ్లిక్ జ‌మాత్ స‌భ్యులు భారత్‌కు వచ్చారు. ఢిల్లీ నుంచి సంపర్క్ ఎక్స్‌ప్రెస్‌లో తెలంగాణకు వచ్చిన వీరు కరీంనగర్, రామగుండం తదితర ప్రాంతాల్లో పర్యటించినట్లు సమాచారం. ఆయా ప్రాంతాల్లో మసీదులలో బస చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరు ఎంత మందితో కాంటాక్ట్ అయ్యారనే విషయంపై ఆందోళన నెలకొంది.

 

 

వీరిని మార్చి 16 నుంచి ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ 13 పాజిటివ్ కేసుల్లో అందరూ విదేశాల నుంచి వచ్చిన వారే కాగా.. ఎనిమిది మంది ఇండోనేషియా వారే కావడం గమనార్హం.

 

ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన కొంత మంది విదేశీయులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలడంతో సీఎం కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంపై చర్చించడానికి మంత్రులు, అధికారులతో గురువారం నాడు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియంత్రణ పద్ధతులకు సంబంధించి ఈ సమావేశంలో చర్చించనున్నారు. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో జరిగే ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు పాల్గొనాలని ఆదేశాలు జారీ చేశారు.

ఇండోనేషియా నుంచి కరీంనగర్‌కు వచ్చిన వారిలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందిజ కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో కరీంనగర్‌ కలెక్టరేట్‌ నుంచి 3 కిలోమీటర్ల పరిధిలో 3-4 రోజుల పాటు ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. పట్టణంలో 100 వైద్య బృందాలతో గురువారం ఉదయం నుంచి ప్రతి ఇంటికి తిరిగి వైద్య పరీక్షలు నిర్వహిస్తామనీ, దయచేసి ప్రజలంతా వైద్యులకు సహకరించాలని మంత్రి కోరారు. మూడు, నాలుగు రోజుల పాటు అన్ని మతాల వారు ప్రార్థనా మందిరాలకు వెళ్లకూడదని ఆదేశించారు. ప్రభుత్వం కరోనాను అరికట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నందున ప్రజలు కూడా సహకరించాలని పేర్కొన్నారు.

 

కరోనా వైరస్ తీవ్రత తగ్గే వరకు అత్యవసరమైతే తప్ప ఇతర ప్రాంతాలకు వెళ్లొద్దని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం మాత్రమే చర్యలు తీసుకుంటే సరిపోదని.. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.