ఇజ్రాయెల్ దాడుల భయం... ఖాళీ అవుతున్న టెహ్రాన్
posted on Jun 17, 2025 11:09AM

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో పరిస్థితి దయనీయంగా మారింది. ఇజ్రాయెల్ దాడులతో జనం తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు. మరిన్ని వైమానిక దాడులు జరుగుతాయన్న భయంతో జనం టెహ్రాన్ వీడి వెడుతున్నారు. కాస్పియన్ సముద్ర తీర ప్రాంతంవైపు జనం తండోపతండాలుగా వెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో జనం ఒక్కసారిగా బయటకు వచ్చి నగరం వీడి వెళ్లడానికి ప్రయత్నిస్తుండటంతో టెహ్రాన్ దారులన్నీ కిక్కిరిసిపోయాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
టెహ్రాన్ లోని సైనిక స్థావరాలే తమ లక్ష్యమని జనావాసాలు కాదనీ ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ జనంలో భయం పోవడం లేదు. ఇక టెహ్రాన్ లో ఇంధనంపై, ఏటీఎమ్ ల నుంచి డబ్బులు విత్రాపై ఆంక్షలు విధించడంతో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. నగరం విడిచి పోవడానికి వాహనాలలో ఇంధనం నింపుకునేందుకు పరిమితులు ఉండటంతో వారు నిస్సహాయులుగా మిగిలిపోయారు. అలాగే ఎటీఎమ్ ల నుంచి సొమ్ములు విత్ డ్రాపై కూడా పరిమితులు విధించడంతో నగదు చెలామణిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే టెహ్రాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతేనే బతికి బట్టకడతామన్న ఉద్దేశంతో జనం నగరం దాటి గ్రామీణ ప్రాంతాలుకు తరలి వెడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే టెహ్రాన్ ఖాళీ అవ్వడం ఖాయమంటున్నారు.