TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

కార్పొరేట్ సంస్థల్లో సీఈవోలు వెళ్లడం రావడం కొత్త కాదు: జెన్సన్ హువాంగ్ లాంటి వారు ఎందరో.!

Published on: Wed Nov 25, 2026 9:15AM

కార్పొరేట్ ప్రపంచంలో ఒక సంస్థను స్థాపించిన వ్యవస్థాపకులు ఆ సంస్థ నుంచి వైదొలగడం లేదా ఉద్వాసనకు గురి కావడం, తిరిగి సంస్థలోకి రావడం న్విడియా  సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్  తోనే మొదలు కాలేదు.  ఆయనతోనే ఆగిపోతుందనీ చెప్పలేదు.  ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్ తయారీ సంస్థ ఎన్విడియా సహ వ్యవస్థాపకుడు జెన్సన్ హువాంగ్ రాజీనామా చేసిన కేవలం 11 రోజులకే మళ్లీ సీఈఓగా, ప్రెసిడెంట్‌గా, బోర్డు డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  ఈ పరిణామం నేపథ్యంలో, గతంలో తమతమ  కంపెనీల నుంచి తప్పుకున్న లేదా ఉద్వాసనకు గురై తిరిగి మళ్లీ అదే సంస్థలో  బాధ్యతలు చేపట్టిన ప్రముఖులు ఎవరన్నది ఒక సారి పరికిస్తే..

నవంబర్ 12, 2026న తన వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన వివాదాలు, చైనాతో అనుసంధానమైన ఒక వ్యాపారవేత్తతో సంబంధమున్న విదేశీ నిఘా కోణంపై వచ్చిన వార్తల నేపథ్యంలో జెన్సన్ హువాంగ్ ఎన్విడియా సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆర్థిక అధికారి కొలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈఓగా నియమితులయ్యారు. అయితే రాజీనామా తర్వాత సంస్థ బోర్డు అవసరమైతే తిరిగి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నానని హువాంగ్ వెల్లడించగా, ప్రారంభంలో బోర్డు అందుకు ససేమిరా అంది. కానీ ఆ తర్వాత జరిగిన చర్చలు, అమెరికా ప్రభుత్వ సీనియర్ అధికారుల నుంచి అందిన సమాచారం ఆధారంగా జాతీయ భద్రతకు ఎలాంటి ముప్పు లేదని భావించిన బోర్డు నవంబర్ 23న ఏకగ్రీవంగా హువాంగ్‌ను తిరిగి సీఈఓగా నియమించింది. ఆయన తిరిగి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్విడియా షేర్లు భారీగా పుంజుకున్నాయి.

అలాగే..  యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కూడా గ1985లో.. అప్పటి సీఈఓ జాన్ స్కల్లీ, బోర్డుతో ఏర్పడిన విభేదాల కారణంగా    యాపిల్ నుంచి వైదొలిగారు. ఆ తర్వాత నెక్స్ట్ అనే కంప్యూటర్ సంస్థను స్థాపించడంతో పాటు పిక్సార్ యానిమేషన్ స్టూడియోను కొనుగోలు చేశారు. 1990వ దశకం మధ్య నాటికి యాపిల్ ఆర్థికంగా, మార్కెట్ వాటా పరంగా   ఒత్తిడిని ఎదుర్కొంటున్న సమయంలో.. 1996లో దాదాపు పదేళ్ల తరువాత  యాపిల్ నెక్స్ట్ సంస్థను కొనుగోలు చేసింది. ఆ క్రమంలో 1997లో స్టీవ్ జాబ్స్ యాపిల్‌లోకి తిరిగి వచ్చి తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టి, ఆ తరువాత  2000లో పూర్తిస్థాయి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.  

అదే విధంగా ఓపెన్ఏఐ సహ వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్‌మాన్  కూడా సంస్థ నుంచి వైదొలగిన ఐదు రోజులలోనూ మళ్లీ తిరిగి వచ్చారు.   2023 నవంబర్ 17న ఓపెన్ఏఐ బోర్డు ఆల్ట్‌మాన్‌ను సీఈఓ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అప్పట్లో ఓపెన్ఏఐ తీసుకున్న నిర్ణయం టెక్ రంగంలో  కలకలం రేపింది. బోర్డుతో సమాచార మార్పిడిలో పారదర్శకత లోపించిందనే కారణంతో సామ్ ఆల్ట్‌మాన్ కు ఉద్వాసన పలికినట్లు ప్రకటించింది. అయితే బోర్డు నిర్ణయాన్ని  సంస్థలోని   770 మంది ఉద్యోగుల్లో 700 మంది  వ్యతిరేకించారు. ఆల్ట్‌మాన్‌ను తిరిగి నియమించకపోతే రాజీనామా చేసి మైక్రోసాఫ్ట్‌లో చేరతామని   హెచ్చరించారు. మైక్రోసాఫ్ట్ కూడా ఆల్ట్‌మాన్, సహ వ్యవస్థాపకుడు గ్రెగ్ బ్రాక్‌మన్‌లకు కొత్త ఏఐ పరిశోధన బృందంలో అవకాశం కల్పిస్తామని ప్రకటించింది. చివరకు ఉద్యోగులు, పెట్టుబడిదారుల ఒత్తిడి కారణంగా నవంబర్ 22న ఆల్ట్‌మాన్ తిరిగి ఓపెన్ఏఐ సీఈఓగా నియమితులయ్యారు.

ఇది కూడా చదవండి: Nvidia CEO జెన్సన్ హువాంగ్ ప్రసంగిస్తుండగా కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.!​

ఇంకా ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ కూడా.   2006లో ట్విట్టర్‌ను ప్రారంభించి తొలుత సీఈఓగా వ్యవహరించిన డోర్సీ, 2008లో ఆ బాధ్యతల నుంచి తప్పుకుని సహ వ్యవస్థాపకుడు ఇవాన్ విలియమ్స్‌కు అప్పగించారు. ఆ సమయంలో బోర్డు ఛైర్మన్‌గా కొనసాగుతూనే పేమెంట్స్ సంస్థ స్క్వేర్‌ను స్థాపించారు. 2015లో డిక్ కొస్టోలో రాజీనామా చేయడంతో, యూజర్ల వృద్ధి మందగించడం వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న ట్విట్టర్‌ను గాడిలో పెట్టేందుకు డోర్సీ తిరిగి తాత్కాలిక సీఈఓగా, ఆపై పూర్తిస్థాయి సీఈఓగా బాధ్యతలు స్వీకరించారు. 2021లో ఆయన తిరిగి సీఈఓ పదవి నుంచి వైదొలిగే వరకూ ఆ బాధ్యతల్లో కొనసాగారు.

రెడిట్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ హఫ్‌మన్  కూడా అంతే.   2006లో కాండే నాస్ట్ రెడిట్‌ను కొనుగోలు చేసిన మూడేళ్ల తర్వాత, 2009లో ఆయన ఆ సంస్థ నుంచి బయటకు వెళ్లారు. ఆ తర్వాత హిప్‌మంక్ అనే ట్రావెల్ వెబ్‌సైట్ సహ వ్యవస్థాపకుడిగా పనిచేశారు. సుమారు ఆరేళ్ల విరామం తర్వాత..  జూలై 2015లో స్టీవ్ హఫ్‌మన్ తిరిగి రెడిట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు.  2024లో రెడిట్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ చేసే స్థాయికి చేర్చారు. 

మీకు నచ్చవచ్చు: 11 రోజులకే రీఎంట్రీ.. మళ్లీ NVIDIA సీఈవోగా జెన్సన్ హువాంగ్.!​

జెన్సన్ హవాంగ్ పునర్నియామకం: ఎన్విడియో షేర్ల ర్యాలీ.. భారీగా పెరిగిన ట్రంప్ సంపద.!

[TechCEO Comebacks, Jensen Huang, Steve Jobs, Sam Altman, SteveHalfman, Jackdorsi, TeluguOne]