తెలుగుదేశం పార్టీ వినూత్న నిరసన

 

శుక్రవారం ఉదయం తెలుగుదేశం పార్టీ సభ్యులు సభాపతిని కలిసి విద్యుత్ పై అజెండాలో పెట్టి చర్చ జరపాలని కోరారు. ఉదయం 11.30 గంటలకు సభను శనివారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతి తెలపడంతో తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనసభలోనే బైఠాయించారు. విద్యుత్ కోటలు, తాగునీటి సమస్యలపై చర్చ చేపట్టాల్సిందేనని, ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన సమాస్యలపై చర్చకు హామీ ఇచ్చేవరకూ బయటకు వచ్చేది లేదని, శుక్రవారం రాత్రంతా శాసనసభలోనే వుంటామని భీష్మించుకూర్చున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు, శాసనసభ కార్యదర్శి రాజాసదారాం వారితో చర్చలు జరిపినా సఫలం కాలేదు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు తెలుగుదేశం పార్టీ విప్ దూళిపాళ్ళ నరేంద్రతో ఫోనులో మాట్లాడుతూ విద్యుత్ అంశాన్ని శనివారం నాటి అజెండాలో పెడతామని హామీ ఇచ్చారు. కానీ దూళిపాళ్ళ నరేంద్ర శ్రీధర్ బాబుకు ఘాటుగా సమాధానం ఇస్తూ బడ్జెట్ పై చర్చ, గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం అంటూ మూడు రోజులపాటు అజెండాలో పెట్టారని, కానీ వాటిపై ఆ మూడు రోజులూ చర్చ జరగలేదని గుర్తుచేస్తూ, అజెండాలో పట్టినంత మాత్రాన చర్చ జరుగుతుందనే నమ్మకం లేదని, చర్చ జరుపుతామని హామీ ఇస్తే తప్ప తాము ఇక్కడ నుండి కదలబోమని అన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యులపై తీరుపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు వారితో ఫోన్ లో మాట్లాడుతూ ప్రభుత్వం దిగివచ్చే వరకూ ఆందోళన వీడొద్దని స్పష్టం చేశారు.