సీల్డ్ కవరులో ఏముందీ? బాబు మనసులో ఏముందీ?

 

 

 అఖిలపక్షసమావేశంలో తెలంగాణా అంశంపై తమపార్టీ అభిప్రాయం కుండబద్దలుకొట్టినట్లు చెప్తామని ప్రజలని ఇంతవరకూ ఊరించి, ఊరించి చంపిన చంద్రబాబు మనసులో ఏముందో తెలుసుకోవాలంటే, ఈ రోజు తెలుగుదేశంపార్టీ తరపున వెళ్ళిన ఇద్దరు ప్రతినిధుల ద్వారా సీల్డ్ కవరులో హోంమంత్రి షిండేకి ఇచ్చిన లేఖని, అక్కడ సమావేశంలో ఆ పార్టీ ప్రతినిధులు ఏమి చెప్పారో అనే విషయాన్నీ కలిపి చూసినట్లయితే, చంద్రబాబు (తెలుగుదేశం పార్టీ) మనసులో మాట స్పష్టంగా అర్ధం అవుతుంది.

 

 

తన లేఖలో స్పష్టంగా తెలంగాణ ఇవ్వమని గానీ వద్దని గానీ వ్రాయకుండా రాష్ట్రాన్ని పాలిస్తున్నముఖ్యమంత్రుల అసమర్ధ పాలన వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు, రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్తితుల వల్ల రాష్ట్రం నష్టపోతున్న తీరు వగైరా వగైరాలనే వ్రాసుకొచ్చి, చివరాఖరిగా రాష్ట్ర విభజనపై తమ అభిప్రాయం తెలుసుకోవాలంటే రిఫెర్ అవర్ లెటర్ డేటెడ్అంటూ తానూ కేంద్రానికి 2008లోనే వ్రాసిన లేఖ చూసుకొని అర్ధం చేసుకోండని ముగించారు. అంతేతప్ప, నాలుగు ముక్కల్లో తెలంగాణా ఇవ్వాలా వద్దా అని మాత్రం స్పష్టంగా వ్రాయలేదు.

 

అయితే, తమ పార్టీ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటునే కోరు కొంటోందని లేఖలో అస్పష్టంగా వ్రాసినప్పటికీ, తరువాత మాట్లాడిన ఆ పార్టీ ప్రతినిధి కడియం శ్రీహరి ద్వారా తెలుగుదేశంపార్టీ అభిప్రాయాన్ని నిర్ద్వందంగా తెలియజేసారు.

 

అఖిలపక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ ప్రతినిధులుగా వెళ్ళిన ఇద్దరిలో ఎనమల రామక్రిష్ణుడు పార్టీ వ్రాసిన లేఖని హోంమంత్రికి షిండేకి అందజేసిన తరువాత, తమ పార్టీ అభిప్రాయాన్ని తమపార్టీ మరో ప్రతినిధి కడియం శ్రీహరి తెలియజేస్తారని చెప్పి కుర్చోన్నతరువాత, కడియం శ్రీహరి తెలంగాణా రాష్ట్రం ఏర్పడాలని తమ పార్టీ కోరుకొంటున్నట్లు విస్పష్టంగా సమావేశంలో ప్రకటించడం ద్వారా, చంద్రబాబు(తెలుగుదేశం పార్టీ) మనసులో మాటని బయట పెట్టారు. అందుకు ఎనమల రామకృష్ణుడు అభ్యంతరం తెలుపకపోవడమే అది పార్టీ యొక్క ఏకగ్రీవ అభిప్రాయమని తెలియజేస్తోంది.

 

అయితే, మరి కర్ర విరగకుండా పాము చావకూడదన్నట్లు చంద్రబాబు వ్రాసిన ఈ లేఖ ఎందుకంటే, అయన ఇప్పటికే తెలంగాణా ప్రాంతాలలో ప్రజలతో చెపుతున్నట్లు పార్టీ అధినేతగా రెండు ప్రాంతాలలో పార్టీని బ్రతికించుకోవడానికి చేసిన ప్రయత్నంగానే చూడాల్సి ఉంది.

 

ఏమయినప్పటికీ, చంద్రబాబు తన స్వహస్తాలతో వ్రాసి సంతకం చేసిన లేఖ నఖలు ఇదిగో: దానిని మీరే స్వయంగా చదువుకొని మీకు తోచిన లేదా నచ్చిన భాష్యం చెప్పుకోండి.