మంత్రి లోకేష్ కి శిష్యుడు దొరికాడు

 

సాధారణంగా మనం మాట్లేడేటప్పుడు తడబడటం, టంగ్ స్లిప్ అవ్వటం సహజం. అది సాధారణ వ్యక్తులకైతే పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఎవరైనా ప్రముఖులు టంగ్ స్లిప్ అయితే మాత్రం వాళ్ళని మాములుగా ఆడుకోరు సుమీ. పాపం ఇలా బలి అయిన వాళ్లలో ఏపీ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ ప్రముఖులు. మంత్రి అయ్యాక ఆయన ఇచ్చిన ప్రసంగాల్లో చాలా సార్లు టంగ్ స్లిప్ అయ్యారు. అలా అనటం ఇలా వైరల్ అవ్వటం. ఎన్నో విమర్శలు, ఎన్నో సెటైర్లు ఎదుర్కొన్నారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో శ్రద్ధాపూర్వకంగా అనే బదులు శ్రద్ధాంజలి అంటూ లోకేశ్‌ తడబడ్డారు. ఓ టీడీపీ కార్యక్రమంలో బంధుప్రీతి, మతపిచ్చి, కులపిచ్చి ఉన్న పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీయే అంటూ టంగ్‌ స్లిప్ అయ్యారు. పొరపాటున కూడా సైకిల్‌ గుర్తుకు ఓటేస్తే మనల్ని మనం ఉరి తీసుకున్నట్టే అంటూ నోరుజారారు.

అయితే ఇప్పుడు ఆయనకి తగ్గ శిష్యుడు దొరికారు. తాజాగా లోకేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా టీడీపీ నాయకులు కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. అయితే ఓ టీడీపీ నాయకుడు మాట్లాడుతూ.. నారా లోకేశ్‌ గారికి 36వ వర్ధంతి శుభాకాంక్షలు అని ఆ తర్వాత వెంటనే పక్కన వాళ్లు అందిస్తే సవరించుకున్నాడు. దీంతో అక్కడున్న వారందరూ ఒక్కసారిగా బిగ్గరగా నవ్వారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవ్వడంతో.. అంబేద్కర్‌ జయంతినాడు వర్ధంతి శుభాకాంక్షలు చెప్పిన లోకేశ్‌ను గుర్తు చేసుకుని గురువుకు తగ్గ శిష్యుడు అంటూ నెటిజన్లు ఓ ఆట ఆడుకుంటున్నారు.