బీజేపీకి టీడీపీ, జనసేన మద్దతు? బద్వేలు ఫార్మూలా అసెంబ్లీకి రిపీట్!

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత ప్రయోజనాలే ఉంటాయి. రాజకీయ చర్చల్లో తరచూ వినిపించే ఈ మాట, ఇప్పుడు, ఉప ఎన్నిక జరుగతున్న కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గంలో  వినిపిస్తోంది. అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య  చనిపోవడంతో ఉపఎన్నిక జరుగుతున్నఈనియోజక వర్గం నుంచి వైసీపే అభ్యర్ధిగా ఆయన సతీమణి డాక్టర్ దాసరి సుధ పోటీ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో సంప్రదాయాన్ని మన్నించి తెలుగు దేశం, జనసేన ఉప ఎన్నికల్లో పోటీ చేయరాదని నిర్ణయించాయి. అయితే, జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మాత్రం తమ అభ్యర్ధులను బరిలో దించాయి. బీజేపీ యువ నేత పనతల సురేశ్ బరిలో దించింది. కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ ఎమ్మెల్ల్యే కమలమ్మ పోటీ చేస్తన్నారు.

చిత్రంగా తెలుగు దేశం, జన సేన పార్టీలు రెండూ కూడా, అనధికారికంగానే అయినా, బీజీపీ అభ్యర్ధికి మద్దతు నిస్తున్నాయి. దీంతో మాజీ మిత్రులు (బీజేపీ, టీడీపీ, జనసేన) ఒకటవుతాయానే చర్చ మొదలైంది. స్థానిక నేతల చొరవతో, బీజేపీకి తెలుగు దేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు సహకరిస్తున్నారే కానీ, పార్టీల స్థాయిలో ఎలాంటి ఒప్పందం లేదని బీజేపీ, టీడీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం కడప జిల్లాకు చెందిన బీజేపీ కీలక నాయకులు సత్యకుమార్, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డికి స్థానిక టీడీపీ నేతలతో మొదటినుంచీ మంచి సంబందాలే ఉన్నాయి. సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి అయితే, టీడీపీలో ఎదిగారు, ఎన్నికలలో గెలిచారు. అందుకే, స్థానిక  నాయకులు క్యాడర్ వ్యక్తిగత స్థాయిలో బీజేపీకి సహకరిస్తున్నారని అంటున్నారు.

ఇలా అనుకోకుండా, మాజీ మిత్రుల నుంచి అందుతున్న మద్దతుతో, అసలు పోటీలో ఉండదనుకున్న బీజేపీ.. పోలింగుకు రెండురోజుల ముందు, అధికార వైసీపీకి గట్టి పోటీ ఇచ్చే స్థాయికి చేరటం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఆరంభంలో కాంగ్రెస్ రెండవ స్ధానంలో ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు బీజేపీ రెండవ స్థానంలో ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.నిజానికి బద్వేలో  బీజేపీ నియోజకవర్గంలో, కనీసం డిపాజిట్ తెచ్చుకునే పాటి ఓటు కూడా లేదు.అంతే కాదు, బీజేపీకి అన్ని పోలింగ్‌బూత్‌లలో పోలింగ్ బూత్ ఏజెట్లు, స్లిప్పులు పంపిణీ చేసేవారు, పోలింగ్‌బూత్‌ల వద్ద టేబుల్ వేసుకుని కూర్చునేంత సంఖ్యలో కార్యకర్తలు- యంత్రాంగం కూడా లేరన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఆ కొరత లేకుండా టీడీపీ కర్యకర్తలు పనిచేస్తున్నారు. 

టీడీపీ నేతలు కూడా తమ పార్టీ బరిలో లేకపోవడం, స్థానికంగా వైసీపీ నేతల దాడులు, తమ పార్టీ కార్యకర్తలకు పథకాలు వర్తింపచేయకపోవడం, ఉన్నవాటిని తొలగించడం వంటి కారణాలతో ఉప ఎన్నికలో బీజేపీకి అనుకూలంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇంతటితోనే బీజేపీ,టీడీపీ ఒకటై పోతయ్యా అంటే .. కాకపోవచ్చును. కానీ ఆ దిశగా ఇదొక అడుగు అని అయితే అనుకోవచ్చును.