మధ్యప్రదేశ్ మంత్రికి సుప్రీం చీవాట్లు !

విజయ్‌ షా, బీజేపీ నాయకుడు. బీజేపీ పాలిత మధ్య ప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి. అంతే, అయితే ఆయన గురించి చెప్పుకోవలసిన అవసరం వచ్చేది కాదు.కానీ.. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను మీడియాకు వెల్లడించిన కల్నల్‌ సోఫియా ఖురేషీని ఉద్దేశించి ఉగ్రవాదుల సోదరి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. దేశం ముందు ఆయన్ని దోషిగా నిలబెట్టాయి. దేశానికి తలవంపులు తెచ్చాయి. అవును.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు  దేశం ముందు ఆయన్ని దోషిగా నిలబెట్టటమే కాదు, మధ్య ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపే సీనియర్ నాయకురాలు ఉమా భారతి అన్నట్లుగా దేశం మొత్తానికి తలవంపులు తెచ్చాయి. 

రెండు రోజుల కిందట ఇండోర్‌లో జరిగిన ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఆపరేషన్‌ సిందూర్‌ విషయంలో ప్రధాని మోదీపై  మంత్రి విజయ్ షా పొగడ్తల వర్షం కురిపించారు. అంతటితో ఆగకుండా.. అదే క్రమంలో   పహల్గాంలో ఉగ్రవాదులు మన సోదరీమణుల నుదుట సిందూరాన్ని తుడిపి వారిని వితంతువులను చేస్తే.. ప్రధాని మోదీ వాళ్ల(ఉగ్రవాదుల)మతానికే చెందిన సోదరిని విమానంలో పంపి ఉగ్రవాదులను మట్టుబెట్టించారు  అని అన్నారు. 

విజయ్‌ షా చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే రాజకీయంగానూ దుమారం సృష్టించాయి. కాంగ్రెస్ తో పాటు జాతీయ మహిళా కమిషన్‌, మధ్యప్రదేశ్‌ హైకోర్టు కూడా ఈ అంశంపై స్పందించాయి. విజయ్‌షా వ్యాఖ్యలను క్యాన్సర్‌తో పోల్చిన హైకోర్టు, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించింది. దీంతో మధ్య ప్రదేశ్ పోలీసులు ఎఫ్ఐఆర్  నమోదు చేశారు. దీంతో అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ సదరు మంత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కాగా.. అరెస్ట్‌ నుంచి రక్షణ కోరుతూ మంత్రి విజయ్ షా దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయ్‌  గురువారం (మే 15) విచారణ జరిపారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మంత్రిని తీవ్రంగా మందలించారు. ఆయన వ్యాఖ్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కావన్నారు. కర్నల్‌పై మంత్రి చేసిన వ్యాఖ్యలు అనుచితమైనవిగా అభివర్ణించారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వ్యక్తులు ప్రసంగాలు చేసేటప్పుడు సంయమనం పాటించాలన్నారు.  మీరు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు?  మీరు కొంత సున్నితత్వాన్ని ప్రదర్శించాలి. వెళ్లి హైకోర్టులో క్షమాపణ చెప్పండి అంటూ మందలించారు. ఆయనపై క్రిమినల్‌ చర్యలు ప్రారంభించాలన్న హైకోర్టు ఆదేశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది.

అదలా ఉంటే బీజేపీ అధిష్టానం ఆయనపై ఎలాంటి చర్యా తీసుకోకపోవడం, కనీసం సంజాయిషీ అయినా అడగక పోవడం  మరింత వివాదంగా మారింది. అంతే కాదు, ఒక్క ఉమాభారతి మినహా  మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ సహా రాష్ట్ర, కేంద్ర బీజేపీ నాయకులు ఎవరూ కూడా విజయ్‌షా వ్యాఖ్యలను ఖండించలేదు. అయితే  సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టిన నేపధ్యంలో  విషయం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో విజయ్‌ షా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకున్నారు. సోఫియా ఖురేషీని కలలో కూడా అవమానించననీ, తన సొంత సోదరి కంటే ఎక్కువుగా ఆమెను గౌరవిస్తున్నానని పేర్కొన్నారు. సోఫియా ఖురేషీ దేశానికి చేసిన సేవలకు ఆమె సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే పది సార్లు క్షమాపణ చెప్పడానికైనా తాను సిద్ధమని వివరణ ఇచ్చారు.

మరోవంక కర్నల్‌ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రి విజయ్‌ షాను ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. మంత్రి అభ్యంతరకర వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా ఖండించింది. ఇప్పటికైనా బీజేపీ అధిష్టానం విజయ్ షా పై చర్యలు తీసుకుంటుందా?  లేదా అనేది చూడవలసి ఉందని అంటున్నారు. అయితే దెశ వ్యాప్తంగా మఖ్యంగా  బీజేపీ సాధారణ కార్యకర్తలు మొదలు సీనియర్ నాయకులు వరకు ప్రతి ఒక్కరు, విజయ్ షా పై పార్టీ, ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu