ఇక ఆ ఇద్దరూ కూడా అరెస్టే!
posted on May 16, 2025 2:50PM

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో మరో ఇద్దరు నిందితుల అరెస్టునకు రంగం సిద్ధమైపోయినట్లే.. ఎందుకంటే వారిద్దరి ముందస్తు బెయిలు పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ దశలో బెయిలు ఇవ్వడమంటే దర్యాప్తు అధికారి చేతులు కట్టేసినట్లే అవుతుందని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరంటే మాజీ సీఎం జగన్ మాజీ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి. ఈ ఇద్దరికీ ఇప్పటి వరకూ సుప్రీం కోర్టు నుంచి అరెస్టు కాకుండా రక్షణ ఉంది.
అయితే వారి యాంటిసిపేటరీ బెయిలును తిరస్కరిస్తూ సర్వోన్నత న్యాయస్థానం ఈ రోజు తీర్పు వెలువరించింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ఈ సమయంలో వీరికి యాంటిసిపేటరీ బెయిలు ఇవ్వడం కుదరదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా పేర్కొంది. ఇరువురి ముందస్తు బెయిలు పిటిషన్లను కొట్టివేసింది. దనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ఈ దశలో బెయిలు ఇవ్వడం దర్యాప్తునకు ఆటంకం కలిగించడమే అవుతుందని అభిప్రాయపడింది.
ఈ కేసులో ముందస్తు బెయిలు కోసం వీరిరువురూ తొలుత ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ చుక్కెదురవ్వడంతో సుప్రీంకు వెళ్లారు. వీరి బెయిలు పిటిషన్లను శుక్రవారం (మే 16) విచారించిన సుప్రీం కోర్టు బెయిలు నిరాకరించింది. ఇదే కేసులో గతంలో సుప్రీం కోర్టు వీరిని శుక్రవారం వరకూ అరెస్టు చేయవద్దంటూ దర్యాప్తు సంస్థను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా సుప్రీం కోర్టు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలకు ముందస్తు బెయిలు నిరాకరించడంతో వీరి అరెస్టు తధ్యమని అంటున్నారు.