తెలంగాణలో గుడ్లగూబను నమ్ముకున్న ఓ అభ్యర్థి

 

ఓ వైపు ప్రపంచం టెక్నాలజీలో నింగిలోకి దూసుకుపోతుంటే.. మరోవైపు కొందరు మాత్రం మూఢనమ్మకాలతో ప్రపంచాన్ని పాతాళంలోకి తీసుకెళ్తున్నారు. ఆ కొందరిలో ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో గెలవడానికి కొందరు ఎంతకైనా దిగజారుతారు. సాధ్యం కానీ తప్పుడు హామీలతో మోసం చేస్తారు.. డబ్బుతో ఓట్లు కొంటారు.. కులాలు, మతాలు అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతారు. అబ్బే ఇవన్నీ చేసినా గెలిచేలా లేమని కొందరైతే ఏకంగా క్షుద్ర పూజలు నమ్ముకుంటున్నారు. తెలంగాణలో ఓ అభ్యర్థి ఓటమి భయంతో తన ప్రత్యర్థికి క్షుద్రపూజలు చేయించడానికి సిద్దమయ్యాడట.

తాజాగా కర్ణాటకలోని సేడం పట్టణంలో ఇటీవల కొందరు వేటగాళ్లు రెండు గుడ్లగూబలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. విచారణలో వారు వెల్లడించిన విషయాలను విని.. అక్కడి పోలీసులు అవాక్కయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఈ గుడ్లగూబలు కావాలని తమను పురమాయించారని నిందితులు చెప్పారు. ప్రత్యర్థులకు కీడు జరిగేలా క్షుద్రపూజలు నిర్వహించి వీటిని బలిస్తారని పేర్కొన్నారు.