ఉప్పల్ స్టేడియంలో రాత్రి సన్ రైజ్! ముంబై బౌలర్లకు సిక్సర్ల వడదెబ్బ!

క్రికెట్ మజా అంటే ఏమిటో బుధవారం రాత్రి హైదారబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై  ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చూపించింది. పరుగుల వరద అంటే ఏమిటో స్టేడియంలో మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకులతో పాటు కోట్లది మంది టీవీ వీక్షకులకు కళ్లకు కట్టినట్లు కనిపించింది.

40 ఓవర్లలో ఏకంగా 523 పరుగులు నమోదయ్యాయి. సిక్సర్లు మోత మోగిపోయాయి. స్టేడియంలోని ప్రేక్షకులు, టీవీ వీక్షకులే కాదు.. గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రేక్షకులు సైతం గుడ్లప్పగించి చూడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పరుగుల తుపాన్ లో అంతా తడిసి ముద్దయ్యారు. ఈ మ్యాచ్ చాలా కాలం గుర్తుండిపోతుంది. ఐపీఎల్ చరిత్రలోనే  ఒక మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు సృష్టించింది. ఇక ఛేజింగ్ లో ముంబై ఇండియన్స్ కూడా దీటుగానే బదులిచ్చినా లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయారు. మొత్తం మీద ఈ మ్యాచ్ క్రికెట్ ను, క్రికెట్ మజాను గెలిపించింది.  

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది. సన్ రైజర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రెచ్చిపోయారు.   ఇప్పటివరకు జరిగిన 17 ఐపీఎల్ ట్రోఫీలలో అత్యధిక పరుగులు సాధించిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (263) నిలువగా, తాజాగా హైదరాబాద్ ఆ రికార్డును బద్దలు కొట్టింది.  ఓపెనర్ హెడ్ (62),   అభిషేక్ శర్మ (63) విధ్వంసం సృష్టించగా, ఆ తరువాత ఆ విధ్వంసాన్ని  క్లాసేన్ (80 నాటౌట్) మరో లెవెల్ కు తీసుకువెళ్లాడు. మార్కరం (42 నాటౌట్) కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.  సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసంతో ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్ గల్లీ క్రికెటర్ల మాదిరిగా కనిపించింది.    

ఇక 278 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ కూడా ధాటిగానే పరుగుల వేట మొదలు పెట్టింది. అయితే క్రమం తప్పకుండా వికెట్లు పడుతుండటంతో లక్ష్యానికి 31 పరుగుల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఈ సీజన్ లో సన్ రైజర్స్ తొలి విజయాన్ని నమోదు చేసింది.