ఉపరాష్ట్రపతి రాజీనామా.. తెర వెనక కథేమిటి?!
posted on Jul 22, 2025 12:03PM

ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఎలాంటి సంకేతం, సమాచారం లేకుండా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజునే ధన్‌ఖడ్ తమ రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు సమర్పించారు. అనారోగ్య కారణాల రీత్యా వైద్య సలహా మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే.. కనీసం చిన్న సంకేతం కూడా లేకుండా ఉప రాష్ట్రపతి రాజీనామా చేయడం సంచలనం సృష్టించడమే కాదు.. సందేహాలకు తావిస్తోందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే.. ఇది ఆయన వ్యక్తిగత నిర్ణయం కాకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి.. ధన్‌ఖడ్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నట్లుగా అనారోగ్య కారణాల వల్లనే రాజీనామా నిర్ణయం తీసుకుని ఉంటే.. ఇంత హటాత్తుగా తన నిర్ణయాన్ని ప్రకటించవలసిన అవసరం ఏముందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అది కూడా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలి రోజునే ఇంత సంచలన నిర్ణయం తీసుకోవడం సహజంగానే సందేహాలకు తావిచ్చేలా ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్నిటికీ మించి రోజంతా సభలో ఎప్పటిలా యథావిధిగా కార్యక్రమలు నిర్వహించిన ఉపరాష్ట్రపతి ఆ వెంటనే తమ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించడంతో ధన్‌ఖడ్ ఆకస్మిక రాజీనామా వెనుక రాజకీయ కారణాలుండవచ్చునన్న చర్చ జోరందుకుంది.
అయితే అదేమిటనే విషయంలో మాత్రం ఎవరికీ స్పష్టత ఉన్నట్లు కనిపించడం లేదు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు మొదలు అనేక సంచలన నిర్ణయాల విషయంలో పాటించిన గోప్యతనే ఉప రాష్ట్రపతి రాజీనామా విషయంలోనూ పాటించిందనీ.. విషయం ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడిందని అంటున్నారు.
అయితే.. గత కొంత కాలంగా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రస్తుత వర్షాకాల సమావేశాల్లో సంచలన నిర్ణయం ఏదో తీసుకుంటుందనే అనుమానాలు ఢిల్లీ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా విపక్ష శిబిరంలో వినిపిస్తున్నాయి. కానీ.. మోదీ తీసుకునే సంచలన నిర్ణయం ఉప రాష్ట్రపతి రాజీనామా అవుతుందని మాత్రం ఎవరూ ఉహించలేదు.
అయితే, పహల్గం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్, బీహార్ ఓటర్ల సవరణ అస్త్రాలతో వర్షాకాల యుద్ధానికి సిదమైన విపక్షాలను ఎదుర్కునేందుకు వక్ఫ్ బిల్లును తీసుకురావడమో లేదా మరో కీలక నిర్ణయం తీసుకోవచ్చని విపక్షాలు ఊహిస్తున్నాయి. కానీ, ఉపరాష్ట్రపతి రాజీనామా చేస్తారని మాత్రం ఎవరూ ఉహించలేదు.
కాగా.. విశ్వసనీయ సమాచరం మేరకు మూడు రోజుల కిందట..అంటే శనివారం (జులై 19) ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ హటాత్తుగా ఢిల్లీ వచ్చారు. విమానాశ్రయం నుంచి నేరుగా ప్రధాని నివాసానికి వెళ్లి గంటకు పైగా ప్రధానితో సమావేశమయ్యారు. అక్కడి నుంచి ఆయన నేరుగా హోమ్ మంత్రి అమిత్ షాను కలిశారు. మరో గంట ఆయనతో సమావేశమయ్యారు. ఆ వెంటనే అమిత్ షా, ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశ మయ్యారు. అదే సమయంలో పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించినట్లు సమాచారం.
అలాగే సోమవారం (జులై 21) పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే ప్రధాని పార్లమెంట్ కార్యాలయంలో హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ నాథ్ సింగ్,ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్, రసాయనాలు ఎరువుల శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ జిజూ, మరో ఒకరిద్దరు కీలక శాఖల మంత్రులు సమావేశమయ్యారు. శని(జులై 19),సోమ(జులై 21)వారాల్లో జరిగిన జరిగిన కీలక సమావేశాలకు, ఉప రాష్ట్రపతి ఆకస్మిక రాజీనామాకు ఏదైనా సంబంధం ఉందా? లేదా? అనే విషయంలో స్పష్టత లేకున్నా.. సంబంధం ఉండే ఉంటుందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అలాగే.. ఈ సమావేశాల్లో ఎక్కడా నాగపూర్ ఎంపీ, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లేక పోవడాన్ని కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
తెరవెనక జరిగిన ఈ పరిణామాల నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఆకస్మిక రాజీనామా వెనక.. అసలు కథ ఇంకేదో ఉందని అంటున్నారు. ముఖ్యంగా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ల మధ్య అంతర్గతంగా సాగుతున్న విభే దాలు.. మరీ ముఖ్యంగా 75 సవత్సరాల వయోపరిమితి నిబంధనను ప్రధాని మోదీకి వర్తింప చేయాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ పట్టు పడుతున్న నేపథ్యంలో, మోదీకి పోటీగా ఉన్న నాగపూర్ ఎంపీ నితిన్ గడ్గరిని పక్కకు తప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలలో భాగంగానే ఉపరాష్ట్రపతి చేత రాజీనామా చేయించారని అంటున్నారు. గతంలో వెంకయ్య నాయుడును క్రియాశీల రాజకీయాలకు దూరం చేసేందుకు, ఆయనకు ఇష్టం లేకున్నా, బలవంతంగా ఉపరాష్ట్రపతిని చేసిన విధంగా, ఇప్పడు నితిన్ గడ్కరీని క్రియాశీల రాజ కీయాల నుంచి తప్పించేందుకు ఉపరాష్ర్టప్రతిని చేసే ప్రయత్నం జరుగుతోందని అంటున్నారు. అయితే.. నితిన్ గడ్కరీ అందుకు అంగీకరిస్తారా? అంతకంటే ముఖ్యం గా మోదీ, షా .. జోడీ.. ప్రయత్నాలకు నాగపూర్ ఆమోదిస్తుందా? అంటే చూడాల్సి ఉందని అంటు న్నారు.