జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ముగ్గురు మృతి
posted on Jun 29, 2025 10:40AM
పూరి జగన్నాథ రథయాత్రలో విషాదం చోటు చేసుకుంది. తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు మృతి చెందారు. ఆదివారం (జూన్ 29) తెల్లవారుజామున 4:30 గంటల సమయంలో మూడు రథాలు గుండిచా ఆలయం దగ్గరకు చేరుకున్నాయి. ఈ సమయంలో రథాలపై ఉన్న దేవతల దర్శనం భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగింది. అ తొక్కిసలాటలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృత్యువాత పడ్డారు. పూరి జగన్నథ రథయాత్రలో తొక్కిసలాట జరిగి ముగ్గురు మరణించడం పట్ల ఒడిశా మంత్రి పృధ్విరాజ్ హరిచందన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు.
పూరీలో ఏటా జరిగే జగన్నాథ రథయాత్రకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిలను రథాలలో ఊరేగిస్తూ గుండిచా ఆలయానికి తీసుకెళ్లే ఈ ఉత్సవం ఆధ్యాత్మికంగా అత్యంత ప్రాధాన్యత గల ఉత్సవంగా భావిస్తారు. అందుకే పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. కాగా ఈ తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.