కాంగ్రెస్ నుండి మరో ముగ్గురు జంప్ కి సిద్ధం

 

జగన్ మోహన్ రెడ్డి అనుచరులపై వేటువేయడానికి మీన మేషాలు లెక్కిస్తున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నిస్సహాయ పరిస్థితిని చక్కగా అర్ధంచేసుకొన్న మరో ముగ్గురు శాసన సభ్యులు శుక్రవారంనాడు చంచల్ గూడా జైలు బాట పట్టనున్నారని మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. వారిలో కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సభ్యుడిగా ఉంటున్న స్వతంత్ర అభ్యర్ధి శ్రీశైలం గౌడ్ మొదటివారు కాగా, రంగారెడ్డి మరియు మెహబూబ్ నగర్ జిల్లాల నుండి మరో ఇద్దరు శాసన సభ్యులు కూడా ఈ రోజే చంచల్ గూడా జైలులో జగన్ని కలుసుకొనేందుకు ముహూర్తం పెట్టుకొనట్లు సమాచారం. శ్రీశైలం గౌడ్ తానూ స్వతంత్ర అభ్యర్ధి అయినందున కాంగ్రెస్ పార్టీ తీసుకొనే క్రమశిక్షణా చర్యలు తనకు వర్తించవని చెపుతుంటే, ఆయనకీ కాంగ్రెస్ పార్టీ సభ్యులకు వర్తించే నియమ నిబందనలు, శిక్షలు తప్పవని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అంటున్నారు. శ్రీశైలం గౌడ్ సంగతి ఎలా ఉన్నపటికీ, ముందు మిగిలిన ఇద్దరూ చేజారిపోకుండా జాగ్రత్త పడకపోతే, ఆనక క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం కూడా ఉండదు. ఇప్పటికే, తిరుగుబాటు సభ్యుల దయతో నడుస్తున్న కిరణ్ ప్రభుత్వం, ఇప్పుడు మరో ముగ్గురు సభ్యులు గనుక పార్టీని వీడితే ప్రభుత్వం పడిపోవడం ఖాయం.