జగన్ కేసులో శ్రీనివాసన్ గుగ్లీలు

 

భారత క్రికెటర్లు మైదానంలో ఆడితే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అధ్యక్షుడు శ్రీనివాసన్ తన ఆఫీసులో కూర్చొనే ఆట నడిపిస్తాడని, కొద్ది నెలల క్రితం ఆయన అల్లుడు గురునాథ్ మెయప్పన్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయినప్పుడు జనాలకి తెలిసింది. ఏమయినప్పటికీ, ఆయన అల్లుడి గిల్లుడికి శ్రీనివాసన్ పదవికి గోవిందా గోవిందా అనుకోవలసి వచ్చింది. అయితే కేవలం ‘ఇండియాలో మాత్రమే ఏదయినా సాధ్యం’ అనే సూత్రం ప్రకారం, స్పాట్ ఫిక్సింగ్ కధ కంచికి, అందులో అరెస్టయిన క్రికెటర్స్ బెయిలుపై ఇంటికి చేరుకోగలిగారు.

 

షరా మామూలుగానే మన జనాలు ఆ టాపిక్ గురించి ఎప్పుడో మరిచిపోయి ఏనాడో మరో లేటెస్ట్ టాపిక్ కి జంప్ అయిపోయారు. బహుశః జనాల నాడిని సీబీఐ అర్ధం చేసుకొన్నట్లు మరొకరు అర్ధం చేసుకోలేరేమో! అందుకేనేమో శ్రీనివాసన్ పేరుని మళ్ళీ జగన్ అక్రమాస్తుల కేసులో నిన్నసీబీఐ కోర్టులో దాఖలు చేసిన చార్జ్ షీటులో జోడించి కేసుకి మంచి ఊపు, ట్విస్ట్ ఇచ్చింది.

 

బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శ్రీనివాసన్, ఇండియా సిమెంట్స్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టరుగా కూడా. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన కంపెనీకి సున్నపు గనులు, వాటిని త్రవ్వుకోవడానికి అనుమతులు, కంపెనీకి అవసరమయిన నీటిని విరివిగా వాడుకొనేందుకు అనుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఆయన కంపెనీ, జగన్మోహన్ రెడ్డికి చెందిన జగతీ పబ్లికేషన్స్ మరియు భారతి సిమెంట్స్ కంపెనీలలో రూ.140కోట్లు (అక్షరాలా నూట నలబై కోట్లు మాత్రమే) పెట్టుబడులు పెట్టడాన్నితప్పుబడుతూ, జగన్ అక్రమాస్తుల కేసులో సదరు శ్రీనివాసన్ గారిని 3వ ముద్దాయిగా పేర్కొంటూ సీబీఐ నిన్న చార్జ్ షీట్ దాఖలు చేసింది.

 

ఆయనని సీబీఐ గత ఏడాది రెండు సార్లు ఇదే విషయమై విచారించినప్పటికీ, బీసీసీఐకి ఆయన అల్లుడు పెట్టిన స్పాట్ ముందు ఇవేవీ జనాల కళ్ళకి ఆనలేదు. ఇప్పుడు వేరే కధలేవీ నడవడం లేదు గనుక, మరో కొత్త టాపిక్ వచ్చి పడేవరకు జనాలు దీనిపై కొంచెం ఆసక్తి చూపించే ప్రమాదం ఉంది.