అమరావతిలో స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీ: శాశ్వత్ గోయెంకాకు మంత్రి లోకేష్ ప్రతిపాదన.!
Published on: Fri Nov 13, 2026 10:57AM

ఆంధ్రప్రదేశ్‌ను క్రీడలు, ఐటీ, పునరుత్పాదక ఇంధన రంగాలలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామిక దిగ్గజాలతో వరుస సమావేశాలు నిర్వహిస్తోంది. విశాఖలో జరుగుతున్న సీఐఐ సదస్సులో భాగంగా ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ శాశ్వత్ గోయెంకాతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో అత్యాధునిక స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని ఏర్పాటు చేయడంతో పాటు, పలు కీలక రంగాలలో ఆర్పీఎస్జీ గ్రూపు కార్యకలాపాలను విస్తరించాలని కోరారు.
ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఆధ్వర్యంలో అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ ట్రైనింగ్ అకాడమీని నెలకొల్పి, క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ అందించాలని కోరిన లోకేష్.. లక్నో, డర్బన్ సూపర్ జెయింట్స్ వంటి ఫ్రాంచైజీల నిర్వహణ అనుభవం ఉన్న ఆర్‌పీఎస్‌జీ గ్రూప్.. రాష్ట్రంలోని గ్రామీణ స్థాయి ప్రతిభను వెలికితీసేందుకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో ఒక స్థానిక జట్టును కొనుగోలు చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. గ్రామ స్థాయి శిక్షణ నుంచి ప్రొఫెషనల్ స్థాయికి క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు పబ్లిక్, ప్రైవేట్-పీపుల్ భాగస్వామ్య (పీ4) నమూనాలో ముందుకు రావాలని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యువ క్రీడాకారులకు స్పాన్సర్‌షిప్ అందించాలని విజ్ఞప్తి చేశారు.
వస్త్ర, జీవనశైలి, ఇంధన రంగాలలో పెట్టుబడుల అవకాశాలను కూడా మంత్రి ఈ భేటీలో చర్చించారు. చేనేతకు ప్రసిద్ధి చెందిన మంగళగిరిలో ఆర్‌పీఎస్‌జీ అనుబంధ లగ్జరీ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ఎఫ్‌ఎస్‌పీ డిజైన్ ప్రైవేట్ లిమిటెడ్ తరపున సోర్సింగ్, తయారీ, డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనీ, అలాగే.. గ్రీన్ పవర్ లిమిటెడ్ ద్వారా రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని కోరారు.

ఐటీ రంగ విస్తరణలో భాగంగా, ప్రస్తుతం విజయవాడలో ఉన్న ఆర్‌పీఎస్‌జీ అనుబంధ సంస్థ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కార్యకలాపాలను మరింత పెంచాలనీ, దీనికి అదనంగా విశాఖపట్నం లేదా తిరుపతిలో కొత్త ఐటీ కార్యాలయాలను ప్రారంభించే అవకాశాలను పరిశీలించాలని లోకేష్ శాశ్వత్ గోయెంకాను కోరారు . రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం, వేగవంతమైన అనుమతులు అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఇది కూడా చదవండి: ఏపీలో పారిశ్రామిక పురోగతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్.!
లోకేష్ ప్రతిపాదనలకు ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ ఎండీ శాశ్వత్ గోయెంకా సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే విజయవాడలోని మేధా ఐటీ టవర్‌లో తమ సంస్థ ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ లిమిటెడ్ కార్యాలయం సమర్థవంతంగా పనిచేస్తోందన్న ఆయన.. 2025లో విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం మేరకు, రాష్ట్రంలో 3 వేల 286 కోట్ల భారీ పెట్టుబడితో 349.8 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు.

విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాలలో తమ గ్రూప్‌నకు చెందిన స్పెన్సర్స్ రిటైల్' ద్వారా హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ముందుంచిన స్పోర్ట్స్ అకాడమీ, ఐటీ , డిజైన్ సెంటర్ల ప్రతిపాదనలు ఆసక్తికరంగా ఉన్నాయని పేర్కొంటూ, వీటిపై తమ బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
మీకు నచ్చవచ్చు: విశాఖ వేదికగా సీఐఐ సదస్సు ప్రారంభం: ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి పియూష్ గోయెల్.!
ఈ నెల 12, 13వ తేదీల్లో సాగర తీరాన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్-2026.!
[SportsTrainingAcademy, RPSGGroup , Shashwat Goenka, APInvestments, RenewableEnergy, TeluguOne]


