విశాఖ రైల్వే జోన్‌కు ముందడుగు..తొలి జీఎంగా సందీప్ మాథుర్

 

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ తొలి జీఎంగా సందీప్ మాథుర్ నియమితులయ్యారు. ఈ మేరకు రైల్వేశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జనరల్ మేనేజర్ నియామకం ఆనందంగా ఉంది. ఇది కేవలం పరిపాలనాపరమైన చర్య కాదు. ఈ జోన్ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావడంలో ఒక మైలురాయి. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహకారంతో మన ప్రాంత వాగ్దానాలు నెరవేరుతున్నాయి' అని కేంద్రమంత్రి రామ్మోహన్ ట్వీట్టర్ ద్వారా తెలిపారు.

ఉత్తరాంధ్ర వాసుల దశాబ్దాల కల ఎట్టకేలకు సాకారమవుతోంది. విశాఖ రైల్వేజోన్‌ ఏర్పాటు ప్రక్రియ శరవేగంగా ముందుకు సాగుతోంది.విశాఖపట్నంలో ప్రత్యేక రైల్వేజోన్‌ ఏర్పాటు చేస్తామని ఏపీ విభజన చట్టంలో హామీ ఇచ్చింది నాటి కేంద్ర ప్రభుత్వం. అయితే గత పదేళ్లుగా ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా జోన్‌ వ్యవహారం ముందుకు సాగలేదు. ఇటీవల కూటమి సర్కార్ ప్రయత్నాలు ఫలించడంతో కేంద్రం నుంచి విశాఖ రైల్వేజోన్‌పై కదలిక వచ్చింది.