TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మౌనం కూడా ఒక డిబేటే: సోనియా జ్ణాపకాల దొంతర.. బిలాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్.!

Published on: Sat Nov 14, 2026 2:24PM

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తన ఆత్మకథ బిలాంగింగ్: ఎ జర్నీఆఫ్ లైఫ్ పుస్తకం.. ఎంతగా పాఠకాదరణ పొందిందో, అంతగా వివాదాస్పదం కూడా అయ్యింది. ఇటీవల కాలంలో ఈ స్థాయిలో చర్చ జరిగిన పుస్తకం ఇది వినా మరొకటి కనిపించదు. దేశ రాజకీయాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన కుటుంబం నెహ్రూ గాంధీ కుటుంబమే అనడానికి ఇసుమంతైనా సందేహంఅవసరం లేదు. ఆ కుటుంబానికి చెందిన సోనియా గాంధీ నుంచి వచ్చిన జ్ణాపకాల దొంతర బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్.  అది కూడా ఈ పుప్తకంపై దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరగడానికి ఒక కారణం.  

హార్పర్‌కొలిన్స్ ఇండియా సంస్థ ప్రచురించిన సోనియా గాంధీ స్వీయ చరిత్ర బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్ విడుదలైనప్పటి నుంచే రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. ఒక వ్యక్తిగత జ్ఞాపకాల గ్రంథంగా రూపుదిద్దుకున్న ఈ పుస్తకం, కేవలం ఒక కుటుంబ కథగా కాకుండా దశాబ్దాల కాంగ్రెస్ పాలనా చరిత్రకు అద్దం పడుతోందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ పుస్తకంలో సోనియాగాంధీ ప్రస్తావించిన వివిధ చారిత్రక సంఘటనలు, ఎమర్జెన్సీ కాలం నాటి పరిస్థితులు,  మరి కొన్ని కీలక అంశాలపై   విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.   ఈ పుస్తకంలో పలు చారిత్రక అంశాలను ప్రస్తావిస్తూనే మరి కొన్నిటిని ఉద్దేశపూర్వకంగా విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఉదాహరణకు 1975 నాటి ఎమర్జెన్సీని ఒక తప్పుగా ఆమె అంగీకరించినప్పటికీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న  రాజకీయ పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ గాంధీ వ్యవహారశైలి,  నాటి కుటుంబ నియంత్రణ కార్యక్రమాల అమలు తీరుపై పుస్తకంలో చర్చించిన అంశాలు పాత వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చాయి. షా కమిషన్ నివేదికలు,  నాటి గణాంకాల ప్రకారం ఆ కాలంలో జరిగిన బలవంతపు స్టెరిలైజేషన్లు అధికార యంత్రాంగంపై భారీ ఒత్తిడిని సృష్టించాయని, కేవలం కొద్దిమందిని మాత్రమే బాధ్యులను చేయడం సరికాదని విమర్శకులు వాదిస్తున్నారు.   అలాగే, 1984 నాటి సిక్కు వ్యతిరేక అల్లర్లు,  భోపాల్ గ్యాస్ దుర్ఘటన వంటి అత్యంత విషాదకరమైన సంఘటనలకు సంబంధించి పుస్తకంలో చోటుచేసుకున్న మౌనం,   వివరణలపై తీవ్ర చర్చ జరుగుతోంది. మౌనం కూడా ఒక డిబేటే అనడానికి ఇదే ఆస్కారం ఇస్తోంది. అలాగే నానావతి కమిషన్ నివేదికలు సిక్కు వ్యతిరేక  అల్లర్ల వెనుక ఉన్న వ్యవస్థీకృత వైఫల్యాలను, స్థానిక నాయకుల పాత్రను స్పష్టంగా ఎత్తిచూపిన విషయాన్ని సోనియా తన పుస్తకంలో మాటమాత్రంగానైనా ప్రస్తావించకపోవడాన్ని పరిశీలకులు సైతం తప్పు పడుతున్నారు. ఆమోదయోగ్యం కాని మౌనంగా అభివర్ణిస్తున్నారు. 

 రాజీవ్ గాంధీ హయాంలో తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు, షా బానో తీర్పునకు సంబంధించిన చట్టసవరణలు, అలాగే  బోఫోర్స్ కుంభకోణం వంటి అంశాలు న్యాయపరంగా పలు మలుపులు తిరిగినప్పటికీ, సోనియాగాంధీ పుస్తకంలో  వాటికి లభించిన స్థానంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.   తరువాతి కాలంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న పరిణామాలు, టెలికాం లైసెన్స్‌లు,  బొగ్గు బ్లాకుల కేటాయింపుల రద్దు వంటి అంశాలు అప్పట్లో దేశ రాజకీయాలను కుదిపేశాయి. న్యాయస్థానాలు పలు కేసుల్లో నిందితులను నిర్దోషులుగా ప్రకటించినప్పటికీ, ఆ దశాబ్దంలో నెలకొన్న పాలనాపరమైన అనిశ్చితిని ఈ పుస్తకం సమగ్రంగా స్పృశించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేవలం రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించడమే కాకుండా, స్వపక్షంలో జరిగిన పరిణామాలు ,  నాయకత్వ బాధ్యతల విషయంలో మరింత స్పష్టత ఉండాల్సిందనే అభిప్రాయాలు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.  

ఇది కూడా చదవండి: ఒత్తిడితో ఓకే చెప్పా: ఆ తరువాత నో అన్నా.. ప్రధాని పదవిపై సోనియాగాంధీ.!

 ఈ పుస్తకం విడుదలైన తరుణంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకవైపు కాంగ్రెస్ శ్రేణులు ఈ పుస్తకాన్ని తమ నాయకత్వ పారదర్శకతకు ప్రతీకగా చెబుతుంటే.. మరోవైపు బీజేపీ నాయకులు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. ఎమర్జెన్సీ బాధ్యతలను కేవలం కొద్దిమందిపై నెట్టివేయడం ద్వారా అసలు వాస్తవాలను కప్పిపుచ్చే యత్నం జరుగుతోందంటున్నారు.   మేధావి వర్గాల్లో కూడా ఈ పుస్తకంలోని అంశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

రాబోయే రోజుల్లో ఈ జ్ఞాపకాల దొంతర లాంటి సోనియా ఆత్మకథ పుస్తకం రాజకీయ చర్చలను మరింత ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చరిత్రను కేవలం జ్ఞాపకాల కోణం నుంచే కాకుండా, అధికారిక పత్రాలు,  కమిషన్ నివేదికల ఆధారంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన ఈ ఆత్మకథ భవిష్యత్ తరాలకు,  చరిత్ర పరిశోధకులకు ఏవిధమైన దృక్పథాన్ని ఇస్తుందనేది కాలమే నిర్ణయించాలి. ఏదేమైనప్పటికీ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలకుల జవాబుదారీతనం మరియు సంస్థాగత వైఫల్యాలపై నిరంతరం కొనసాగాల్సిన చర్చకు ఈ పుస్తకం మరోసారి వేదికైంది.   

మీకు నచ్చవచ్చు:   రాజీవ్‌కు రాజకీయాలు వద్దన్న సోనియా.. రాహుల్ విషయంలో ఎందుకు మౌనం.?

నా తొలి బిడ్డ రాహుల్ గాంధీ కాదు: ఆ బిడ్డకేమయ్యిందో తెలుసా? ఆత్మకథలో వెల్లడించిన సోనియా.!

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా  https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.   

[Sonia Gandhi Autobiography,  Belonging A Journey of Love ,  Emergency,  1984 riots,  Congress politics, Debte, TeluguOne]