సోనియమ్మ ఆజ్ఞ లేనిదే...

 

శివుడాజ్ఞ లేనిదే చీమయినా కదలదని నాటి మాట. సోనియమ్మా ఆదేశం లేనిదే మన్మోహనయినా కదలరనేది నేటి మాట. సోనియమ్మ విదేశాలకు వెళ్ళవలసి రావడంతో, దేశంలో, రాష్ట్రంలో పూర్తి స్థాయి ప్రభుత్వాలు ఉన్నపటికీ, రాష్ట్రంలో నానాటికి దిగజారుతున్నపరిస్థితులనూ ‘నిశితంగా గమనించడం’ తప్ప మరేమీ చేయలేకపోతున్నాయి.

 

అసలు ప్రధాన మంత్రి అయితే రాష్ట్ర విభజన విషయంలో తనకు ఎటువంటి సంబంధమూ లేదనే రీతిలో వ్యవహరించడం చాల విచిత్రమయితే, రాష్ట్రంలో అదుపుతప్పుతున్న పరిస్థితులను కళ్ళారా చూస్తూ కూడా, కేంద్ర హోంమంత్రి షిండే రాష్ట్రం చాల బేషుగ్గా ఉందని శలవీయడం, ‘తెలంగాణా నోట్’ పై ఆమోద ముద్ర వేయించుకోవడానికి సోనియమ్మ రాక కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పుకోవడం గమనిస్తే, ప్రభుత్వాన్నిసోనియమ్మ ఏవిధంగా రిమోట్ కంట్రోల్ చేస్తున్నారో అర్ధం అవుతుంది. ఆమె రాక కోసం ఇంత కాలం కాంగ్రెస్ నేతలు, ప్రభుత్వము చకోరపక్షుల్లా ఎదురు చూసారు.

 

ఇక, కిరణ్ కుమార్ రెడ్డి కొద్దో గొప్పో రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ మాట్లాడినప్పటికీ, ఆయన కూడా రాష్ట్ర పరిస్థితులను చక్క దిద్దే ప్రయత్నం చేయడం లేదు. బహుశః ఆయనకు సోనియా గాంధీ అనుమతి లేకపోవడం వలననే నీరో చక్రవర్తి పాత్ర బహు చక్కగా పోషిస్తున్నారేమో మరి తెలియదు. ఇప్పుడు సోనియమ్మ డిల్లీకి తిరివచ్చారు గనుక ఇప్పటికయినా ఆమె అనుమతితో ప్రభుత్వాలు పనిచేయడం మొదలుపెడితే వారిని ఎన్నుకొన్నప్రజలు వారికి కృతజ్ఞతలు అర్పించుకొంటారు.