వార్నీ... తండ్రితోనే కిడ్నాప్ డ్రామా

 

ఈమధ్య కొంతమంది యువకులు జల్సాల కోసం ఓవర్ యాక్షన్లు చేయడం మొదలుపెట్టారు. అలాంటి ఓవర్ యాక్షన్లలో ఒక సరికొత్త యాక్షన్ బయటపడింది. జల్సాలకు బాగా మరిగిన ఓ కుర్రాడు తనను ఎవరో కిడ్నాప్ చేశాడని తండ్రికి ఫోన్ చేసి డబ్బులు గుంజాడు. తన తండ్రినే బ్లాక్ మెయిల్ చేసినప్పటికీ చివరికి జైల్లో పడ్డాడు. ముంబైకి చెందిన విజయ్ రోహన్ అనే పాతికేళ్ళ కుర్రాడు బంజారాహిల్స్‌లో నివసిస్తూ, సోమాజీగూడాలోని ఒక ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. బాబుగారికి ఖరీదైన హోటళ్ళలో పార్టీల్లో పాల్గొనడం, డబ్బున్న వాళ్ళతో ఫ్రెండ్ షిప్ చేస్తూ వాళ్ళతో సమానంగా డబ్బు ఖర్చుపెట్టడం, జల్సాలు చేయడం అంటే బాగా ఇష్టం. ఈయనగారి గొప్ప అలవాట్లకు సరిపడా జీతం లేకపోవడంతో ఒక అమోఘమైన ఐడియా వేశాడు. తనను ఎవరో కిడ్నాప్ చేశారని, డబ్బు ఇస్తేనే వదిలిపెడతారని తన తండ్రికే ఫోన్ చేసి చెప్పాడు. కిడ్నాపర్లు తన చేత ఫోన్ చేయిస్తున్నారని అన్నాడు. ఈ విషయం పోలీసులకు చెబితే తనను కిడ్నాపర్లు చంపేస్తారని భయపెట్టాడు. ఆ తండ్రి భయపడిపోయి కొడుకు బ్యాంక్ అకౌంట్లో దాదాపు రెండు లక్షల రూపాయలు వేశాడు. ఆ డబ్బుతో వీడు బాగా ఎంజాయ్ చేశాడు. కిడ్నాపర్లు ఇంకా డబ్బు కావాలని అంటున్నారని, అర్జెంటుగా బ్యాంకులో వేయాలని తండ్రికి ఫోన్ చేశాడు. దాంతో సదరు తండ్రి హైదరాబాద్‌కి వచ్చాడు.. ఆ తర్వాత తన కొడుకు ఫోన్ల మీద అనుమానం వచ్చి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని దర్యాప్తు చేస్తే సదరు పుత్రరత్రం చేస్తున్న ఘనకార్యం బయటపడింది. దాంతో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కి పంపారు. కొడుకును లోపల వేశారని ఆ పుత్రరత్నం తండ్రి ఎంతమాత్రం బాధపడటం లేదు.