మునిసిపల్ ఎన్నికలు.. కొత్త తరహా ప్రచారం చేస్తున్న ప్రధాన పార్టీలు

మునిసిపల్ ఎన్నికల వేళ పార్టీలు కొత్త ప్రచార ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నాయి. ఇన్నాళ్లు రోడ్ షోలు.. బహిరంగ సభలతో అదరగొట్టిన నేతలు ఇప్పుడు సోషల్ మీడియా, మీడియా వేదికగా ప్రచారం మొదలుపెట్టారు. ఇప్పటికే తెలంగాణలో అన్ని చానళ్లు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్. అలా టీఆర్ఎస్ లో జోష్ నింపడమే కాకుండా పార్టీ పరంగా ఎలా ముందుకు వెళతామో స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులతో కేటీఆర్ టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. అభ్యర్థుల ప్రచార తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ఎలా నిర్వహించాలి.. ఓట్లను ఎలా కలపాలి అనే విషయాల పై అభ్యర్థులకు కేటీఆర్ పలు సూచనలు చేశారు. 

కొన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా అభ్యర్థుల నుంచి కెటిఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, రామగుండం, మిర్యాల గూడ, నల్గొండ జిల్లా లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులతో పాటు మహిళల క్యాండిడేట్ లతో మాట్లాడారు కేటీఆర్. స్థానికంగా వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేయాలని సూచించారు. ఇటు కాంగ్రెస్ కూడా సోషల్ మీడియా క్యాంపెయిన్ చేపట్టింది. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేస్ బుక్ లైవ్ లో కార్యకర్తలతో మాట్లాడారు. ప్రధాన పార్టీలన్నీ సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తూ స్థానిక యువతని ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యాయి. మొత్తానికి ప్రధాన పార్టీలు సోషల్ మీడియా బాట పట్టాయని చెప్పుకోవచ్చు. రాబోయే ఎన్నికల ట్రెండ్స్ ను చెప్పకనే చెప్తున్నాయి.