ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు

తెలంగాణలో తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ కేసులో తాజాగా మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. మంగళవారం జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో విచారణకు హాజరు కావాల్సిందిగా సిట్ ఆ నోటీసులో పేర్కొంది. సిట్ హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.  ఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధిం చిన పలు అంశాలపై హరీష్ రావు నుంచి వివరణ తీసుకో నుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో  ఇప్పటికే పలువురు అధికారులను విచారించిన సిట్, తాజాగా రాజకీయ నేతల వైపు దృష్టి సారించింది. ఇలా ఉండగా  హరీష్ రావుకు సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  మండి పడ్డారు.  

రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందంటూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఫోన్ ట్యాపింగ్  కేసులో పస లేదనీ,  అది కేవలం రాజకీయ కక్ష సాధింపు మాత్రమేననీ పేర్కొన్న కేటీఆర్ ఈ విషయం తాను కాదనీ, సాక్షాత్తూ సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందన్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావుకు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంతగా  దిగజారిందో అర్థమవుతోందని పేర్కొన్నారు.  రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని  బయటపెట్టినందుకే, దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే హరీష్ రావుకు నోటీసులు అని ఆరోపించారు.

 అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ  హరీష్ రావు చూపుతున్న చొరవ సీఎం రేవంత్ రెడ్డికి వణుకు పుట్టిస్తోందన్న కేటీఆర్, హరీష్ ను రాజకీయంగా ఎదుర్కోలేకే,  ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. గత రెండేళ్లుగా  రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ   కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్న కేటీఆర్, తమకు  చట్టం పైన, న్యాయస్థానాల పైన పూర్తి గౌరవం ఉంది, అందుకే ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం  చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu