GSTలాగా కోడెల ట్యాక్స్...సిట్ దాకా వెళ్ళేట్టుందే ?

 
కే టాక్స్....గత రెండ్రోజులుగా మీడియాలో కాస్త కలకలం రేపుతున్న అంశం ఇది. విన్నవారికి పాతదే కానీ కొత్త వారికి ఇది కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు. ఎందుకంటే ఈ వ్యవహారం గత ఐదేళ్లుగా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో జరుగుతున్నా ఇప్పటి వరకూ బయటకు రాకపోవడం. ఇంతకీ కేట్యాక్స్ ఏంటి అంటే కోడెల ట్యాక్స్, అంటే ఇదేదో దేశాన్ని ఉద్ధరించే ట్యాక్స్ కాదు, మన మాజీ సభాపతి కుమార్తె, కుమారుడు తమ సంపాదన కోసం కనిపెట్టిన ట్యాక్స్, ఇన్నాళ్లూ బయటకు రానిఈ ట్యాక్స్ వ్యవహారం ప్రభుత్వం  మారడంతో పాటు కోడెల ఓడిపోయి ఇంటికి పరిమితం కావడంతో వెలుగులోకి వచ్చింది. ఈ ట్యాక్స్ రూల్స్ అండ్ రేగులేషన్స్ ప్రకారం ట్యాక్స్ కట్టాల్సిన వాళ్ళు సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల వారు అయి ఉండాలి. ఇల్లు కట్టడం మొదలు కిళ్లీ కొట్టు వరకూ అందరూ ఈ ట్యాక్స్ కట్టాల్సిందే, లేదా సినిమాల్లో చూపినట్టుగానే అన్నీ సవ్యంగా ఉన్నా మీ కొత్త ఇంటి నిర్మాణాని పోలీసులు, లేదా అధికారులు వచ్చి ఆపేస్తారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం, ఇప్పటి దాకా ఆ నియోజకవర్గాల్లో జరిగింది అదే. అయితే తమ ప్రభుత్వం కాకుండా జగన్ ప్రభుత్వం ఏర్పడడంతో వారి పాపం పండినట్టు అయింది. బాధితులు ఒక్కరొక్కరుగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే కోడెల కుమార్తె, కుమారుడి మీద చెరొక కేసు నమోదు కాగా ఇప్పుడు ఈ కేసుల నమోదుతో బాధితుల్లో దైర్యం వచ్చి అందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్ లకి క్యూ కడుతున్నారు.

తాజాగా కోడెల కుమార్తె మీద మరో కేసు పెట్టారు బాధితులు. నరసరావుపేటకు చెందిన మారుతి ప్రసాద్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒకటిన్నర ఎకరం పొలం కొనుక్కున్నాడు. అయితే ఆ పొలం తమదే అంటూ వచ్చిన కోడెల కుమార్తె మనుషులు సెటిల్మెంట్ కి అని పిలిచి పదకొండు లక్షల దాకా ఛార్జ్ చేసి అప్పుడు పొలం వదిలి పెట్టారు. ఇప్పుడు ధైర్యం తెచ్చుకున్న సదరు ఉపాధ్యాయుడు పోలీసుల ముందుకు వచ్చి ఆమె మీద కంప్లైంట్ చేసాడు. ఇలాంటి కేసులు కనుక మరి కొన్ని నమోదు అయితే ఈ కే ట్యాక్స్ మీద జగన్ ప్రభుత్వం ఏదైనా సిట్ లాంటిది కూడా నియమించే అవకాశాలు లేకపోలేదు. చూడాలి మరి ఈ కే ట్యాక్స్ వ్యవహారం ఎంత దూరం వెళుతుందో ?