దొరికిన దుర్గమ్మ రథం వెండి సింహాల ఆచూకీ..! 

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలోని రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమవడం పై తీవ్ర కలకలం రేగిన సంగతి తెల్సిందే. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలోని ఒక నేరస్తుడిని విచారిస్తుండగా వెండి సింహాల మాయం కు సంబంధించిన విషయాలు తెలిసాయి. ఈ కేసు విషయంలో పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. తానే ఆ వెండి సింహాలను అపహరించానని ఒప్పుకున్నాడు. అయితే ఆ వెండి విగ్రహాలను అతడు తునిలోని ఒక జ్యూయలరీ షాపులో విక్రయించినట్లుగ తెలుస్తోంది. దాదాపు 16 కిలోల బరువున్న మూడు వెండి విగ్రహాలను షాపు యజమాని కరిగించేసినట్లుగా విచారణలో తేలింది. దీంతో పోలీసులు షాపు యజమానిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇప్పటివరకు నిందితుడు బాలకృష్ణ అరెస్ట్‌ను పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు.