ఏపీ బీజేపీలో స్తబ్దత..ఎందుకో మరి!?

ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమిలో బీజేపీ భాగస్వామిగా ఉందా? అసలు ఏపీలో బీజేపీ ఉందా? లేదా? అన్న ప్రశ్నకు సంతృప్తికరమైన సమాధానం లభించడం లేదు. ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుండా.. తన వంతుగా కేబినెట్ లోనూ, నామినేటెడ్ పోస్టులలోనూ పదవులు తీసుకుని కూడా.. ప్రత్యర్థి పార్టీ ప్రభుత్వంపై సంధిస్తున్న విమర్శలను ఖండించడం కానీ, దీటుగా స్పందించడం కానీ చేయడం లేదని పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు. ఏపీలో బీజేపీ నేతల తీరు.. ప్రభుత్వంపై విమర్శలకు స్పందించాల్సిన బాధ్యత తమది కాదు.. కూటమికి నేతృత్వం వహిస్తున్న తెలుుదేశం పార్టీది మాత్రమే అన్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రంలో వైసీపీ అధినేత జగన్‌, ఆ పార్టీ సీనియర్ నేతలు  కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నా..  పరామర్శ యాత్రల పేరుతో నిబంధనలు తుంగలోకి తొక్కి శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యేలా వ్యవహరిస్తున్నా.. బీజీపీ నేతలు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారే తప్ప పెదవి విప్పి విమర్శలు చేయడం లేదు.  

వైసీపీనీ, జగన్‌ని ఎదుర్కోవలసిన బాధ్యత సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌, అలాగే తెలుగుదేశం, జనసేనలదే అన్నట్లు మౌనంగా ఉండిపోతున్నారు. వచ్చే నెల 1న  ఏపీ, తెలంగాణ రాష్ట్రాల బీజేపీ శాఖలకు   కొత్త అధ్యక్షుల ఎంపిక జరగ నుంది.  అయితే తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి కోసం అక్కడి నేతలలో తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు.  ఇప్పుడు కాదు.. భవిష్యత్ లో కూడా ఏపీలో బీజేపీ స్టేక్ పెరిగే అవకాశం కనిపించడం లేదన్న భావనో ఏమో.. ఇంతోటి దానికి అధ్యక్ష పదవి కోసం పోటీ ఎందుకు అన్న నిర్లిప్తతతో రాష్ట్ర బీజేపీ నేతలు ఉన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు.