ఆంధ్రులకు సాగునీటికొరత తీర్చే గోదావరి - పెన్నార్ లింకు కాలువలు

ప్రొఫెసర్ టి.శివాజీరావు, డైరెక్టర్, పర్యావరణ అధ్యయన కేంద్రం, గీతం విశ్వవిద్యాలయం, విశాఖపట్నం

 

 

 

ఒకానొకప్పుడు ఎడారికి గురికాబోతున్న రాయలసీమ సాగు భూములకు కృష్ణానదీ జలాలే శరణ్యమని ప్రభుత్వాధికారులు, ఇంజనీర్లు అనుకునేవారు. ఈస్ట్ ఇండియా బ్రిటిషుపాలకులు 19వ శతాబ్దంలోనే తుంగభద్రపై సుంకేశుల ఆనకట్టకట్టి పెన్నానదిలోకి నీరు మళ్ళించడానికి కడప-కర్నూలు సాగునీటికాలువలు త్రవ్వించారంటే రాయలసీమకు కృష్ణాజలాల తరలింపే శరణమని నిరూపించారు. అటు పిమ్మట 1901లో మద్రాసు ప్రభుత్వం నియమించిన సర్.కాలిన్ స్కాట్ కూడా కృష్ణా పెన్నానదుల అనుసంధానం కోసం తుంగభద్ర ప్రాజెక్టు కట్టమన్నారు. అందువల్ల 1905లో ప్రఖ్యాతి గాంచిన ఆంగ్లేయ ఇంజనీరు మెకంజీ దొర తుంగభద్రపై సముద్రమట్టం  మీద 1630 అడుగుల ఎత్తువరకు తుంగభద్ర నీటి జలాశయమట్టాన్ని వుంచుతూ రాయలసీమలో దాదాపు 9 లక్షల ఎకరాలకు సాగునీరిమ్మని సిఫారసు చేశారు. ధనాభావం వల్ల ప్రభుత్వం ఈ ఆయకట్టును 4 లక్షల ఎకరాలకు కుదించింది. 1927లో ప్రభుత్వం కృష్ణానదిపై సంగమేశ్వరం వద్ద ప్రాజెక్టు కట్టి కృష్ణానీటినిదాదాపు 12 లక్షల ఎకరాలకు అందించమన్నారు. ఆ తరువాత మద్రాసు ప్రభుత్వం 1952లో రాయలసీమ సాగునీటి కోసం కృష్ణానదిపై సిద్దేశ్వరం జలాశయాన్ని నిర్మించి 7లక్షల ఎకరాలను సాగుచేద్దామనుకున్నారు.




1953లో ఖోస్లా నిపుణుల కమిటీ సిద్దేశ్వరం డ్యాం జలాశయం నీటిమట్టం 885 అడుగుల నుండి సాగునీటిని రాయలసీమకు మళ్ళించమన్నారు. కానీ దురదృష్టవశాత్తు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వాలు యేవి కూడా ఈ ప్రాజెక్టులను డబ్బులేదనే వంకతో అమలుపరచలేదు. అందువల్లనే ఆంధ్రరాష్ట్రాన్ని సాధించటానికి కోస్టల్ ఆంధ్ర, రాయలసీమ నాయకులు ప్రయత్నించినపుడు 1837లో శ్రీబాగ్ ఒడంబడికను సాగునీటి పంపిణీకై రూపొందించి కృష్ణాజలాలను మరలించేటపుడు రాయలసీమకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని పేర్కొన్నారు. కానీ ఆఒడంబడిక ఇంతవరకు అమలుకాలేదు. ప్రస్తుతం తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినట్లయితే రాయలసీమకు నీరు రాక ఎడారిగా మారుతుందని రాజకీయ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కానీ దీనికి విరుగుడుగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వైనగంగ-పెన్నా నీటిపారుదల ప్రాజెక్టును 1980 నుండి అమలు చేయమని కోరడంలో రాష్ట్ర శాసనసభ, పార్లమెంటు సభ్యులు విఫలమవుతూ వచ్చారు. ఈ ప్రాజెక్టు వివరాలను తెలుసుకోవడం ఆంధ్రుల అందరి ముఖ్య కర్తవ్యం. అంతే కాదు ఈ ప్రాజెక్టును అమలు చేయడం వల్ల నీటికొరత రాదు.




తెలంగాణా రాష్ట్రం నుండి విడిపోయినట్లయితే కోస్తా జిల్లాలు ఎడారులవుతాయని రాజకీయనాయకులు ప్రజలను భయపెడుతున్నారు. నిజానికి కృష్ణాజలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ప్రజలు ఎగువభాగంలో ఉన్న తమ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి 
బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను తుంగలోకి తొక్కి మళ్ళించుకోవడంతో ఆంధ్రకు రావలసిన దాదాపు 460 శతకోటిఘనపుటడుగులు (టి.ఎం.సి.) రావడం లేదని గ్రహించలేకపోతున్నారు. 1978 ప్రాంతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కర్ణాటక నాయకులైన శ్రీశంకరానంద్,  శ్రీరామకృష్ణహెగ్డే అలమట్టి ప్రాజెక్టును విపరీతమైన ఎత్తుకుపెంచినట్లయితే తమ రాష్ట్రంలోని కరవు ప్రాంతాలను సాగుచేసుకోవచ్చునని కేంద్ర జలవనరుల సంఘం అధికారులతో కుమ్మక్కై అలమట్టి డ్యాం ఎత్తును బాగా పెంచేందుకు ప్రయత్నించి సాధించారు. కానీ ఇందువల్ల కృష్ణా డెల్టా భూములు రాయలసీమభూములు ఎడారులవుతాయని అప్పుడే గ్రహించి కొంత మానవతా దృక్పధంతో వారికి ఎక్కువనష్టం రాకుండా చేయడానికి గోదావరి వరదలను, మిగులు జలాలను తెలంగాణా, రాయలసీమ, తమిళనాడు రాష్ట్రాలు కూడా మళ్ళించడానికి ఇంద్రావతి-వైనగంగ-శ్రీశైలం-కావేరి లింకు ప్రాజెక్టును బృహత్తర సాగునీటి ప్రాజెక్టుగా రూపొందించి అమలు చేయాలన్నారు.




ఈ ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం సూచించింది కాబట్టి దాన్ని అమలు చేయమని అడగడానికి ఆంధ్రులు ఎన్నుకొన్న రాష్ట్ర శాసనసభ్యులుగాని, పార్లమెంటు సభ్యులుగాని యేమాత్రం శ్రద్ధచూపకపోవడంతో అది మూలన పడేశారు. ఒకానొకప్పుడు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రాయలసీమను రత్నాలసీమగా మార్చడానికి మిడ్ పెన్నార్ ప్రాజెక్టును రూపొందించి అటు పిమ్మట
తుంగభద్ర జలాశయాన్ని నిర్మించి రాయలసీమ ప్రజలకు సాగునీరిద్దమనుకుంటే స్వార్థపరులైన రాయలసీమ నాయకులే ఈ ప్రాజెక్టులనుండి నీటిని రాయలసీమ భూములకు రానీయకుండా కుట్రలు పన్నిరాయలసీమ బంగారు భవిష్యత్తును నాశనం చేశారు. గతజలసేతుబంధనం అన్నట్లు పాతవిషయాలు మరచిపోయి ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఇంద్రావతి-వైనగంగ-శ్రీశైలం లింకు ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినట్లయితే గోదావరిలో ప్రతి యేటా సముద్రంపాలయ్యే దాదాపు 1000 నుండి 2000 టి.ఎం.సి.ల నీటిని మళ్లించి ఆంధ్ర రాష్ట్రప్రజలకు తాగునీటిని, సాగునీటిని సరఫరా చేయవచ్చు. ఇందుకోసమై ప్రజలంతా ఈ ప్రాజెక్టును గురించి బాగా అర్థం చేసుకునేటట్లు చేయడానికి ఈ క్రింద ఇచ్చిన చిత్రపటం బాగా దోహదపడుతుంది.