పార్టీ కోసం పని చేసిన వారికి పెద్ద పీట.. చాగంటికి సలహాదారు పదవి

ఏపీలో 59 మందితో నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా విడుదలైంది. ఈ సారి బీజేపీకి చెందిన ఇద్దరికి ఈ జాబితాలో చోటు దక్కింది. అలాగే 10 మంది జనసేన నేతలకు అవకాశం లభించింది. గత ఎన్నికలలో  సీట్లు త్యాగం చేసిన నేతలు, మీడియాలో తెలుగుదేశం భావజాలాన్ని బలంగా వ్యక్తం చేసిన వారికి, అలాగే  విపక్షంలో ఉండగా అప్పటి అధికార వైసీపీ దాడులను ఎదుర్కొన్న వారికి  ఈ సారి జాబితాలో స్థానం కల్పించారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చంద్రబాబు భారీ కసర్తత్తు చేసి సాధ్యమైనంత వరకూ ఎవరూ అసంతృప్తి చెందకుండా జాబితాను తయారు చేసి విడుదల చేశారు. 

తొలి జాబితాలో స్థానం దక్కని తెలుగుదేశం అధికార ప్రతినిథులు కొమ్మారెడ్డి పట్టాభి, జీవీరెడ్డి, ఆనం వెంకటరమణారెడ్డిలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. అలాగే తాడికొండ మాజీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవీ. జనసేన నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడులతో పాటు సుజయ్ కృష్ణ రంగారావు, రావి వెంకటేశ్వరరావు, కావలి గ్రీష్మ వంటి వారికి అవకాశం ఇచ్చారు.  

అలాగే పొడపాటి తేజస్వినికి, ఎన్నికల సమయంలో వైసీపీ దాడులకు గురైన  మంజులా రెడ్డికి కూడా నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు. మొత్తంగా ఈ జాబితాలో తెలుగుదేశం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కేసులకు భయపడకుండా పార్టీ కోసం పోరాడిన వారికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ హోదాతో కూడిన సలహాదారు పదవి ఇచ్చారు.   అదే విధంగా  మండలి మాజీ చైర్మన్ షరీఫ్‌కు కూడా కేబినెట్ ర్యాంక్ తో సలహాదారు పదవి ఇచ్చారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu