ప‌వ‌న్‌కు ఫ‌స‌క్‌.. గాజుగ్లాసు గ‌ల్లంతు  

ప‌వ‌న్‌కు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. అదే రోజు గాజుగ్లాసు గ‌ల్లంతైంది. ఏరుకోరి ఎంచుకున్న గ్లాసు. ముచ్చ‌ట‌ప‌డి తెచ్చుకున్న గ్లాసు గుర్తు. ప‌వ‌న్‌కు ఎర్ర కండువా ఎంత ఇష్ట‌మో.. సామాన్యులు చాయ్ తాగే గాజుగ్లాసు అంటే కూడా అంతే ఇష్టం. జ‌న సైనికులు ఎప్పుడో గాజుగ్లాసుతో ఎంతో క‌నెక్ట్ అయిపోయారు. గ్లాసు గుర్తుకే మ‌న ఓటంటూ ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఊద‌ర‌గొట్టారు. ఓ చేతిలో గాజుగ్లాసు.. మ‌రోచేతిలో త‌ల‌రాత మార్చే ఓటు. జ‌న‌సేన పార్టీకి ఇంత సెంటిమెంట్‌గా మారిన గాజుగ్లాసు ఇక‌పై ఆ పార్టీకి చెంద‌దు. జ‌న‌సేన‌కు కేటాయించిన గాజుగ్లాసు గుర్తును ఎన్నిక‌ల క‌మిష‌న్ ర‌ద్దు చేసింది. ఈసీ నిర్ణ‌యంతో జ‌న‌సైన్యంలో తీవ్ర నిరుత్సాహం. అదేంటి? ఇంత ప‌ని జ‌రిగిపోయిందేంటని క‌ల‌వ‌రం. 

ఒక్క పొర‌బాటు. ఒకే ఒక్క పొర‌బాటు.. గాజుగ్లాసును జ‌న‌సేన‌కు దూరం చేసింది. ఈ మ‌ధ్య జ‌రిగిన గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌క‌పోవ‌డ‌మే ఆ పార్టీ చేసిన త‌ప్పిదం. అందుకు ఫలితం.. ఎంతో ఇష్ట‌మైన గాజుగ్లాసు ప‌గిలిపోవ‌డం.  GHMC ఎన్నికల్లో కనీసం 10 శాతం సీట్లకు కూడా పోటీ చేయని కారణంగా జ‌న‌సేన గాజుగ్లాసు గుర్తును కోల్పోయినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్‌ తెలిపారు. 

GHMC ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుంది జ‌న‌సేన‌. ఆ కారణంగా పోటీ నుంచి తప్పుకుంది. అప్పట్లో ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘంకి లేఖ రూపంలో తెలిపారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దాని ప్రభావం ఇప్పుడు పడుతుందని అప్పుడు ఆ పార్టీ ఊహించలేదు. ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ కార్పొరేష‌న్ల‌తో పాటు ప‌లు మున్సిపాలిటీల్లో ఎన్నిక‌ల న‌గారా మోగింది. అక్క‌డ పోటీ చేయాల‌ని జ‌న‌సేన భావిస్తోంది. త‌మ అభ్య‌ర్థుల‌కు గాజుగ్లాసు సింబ‌ల్ కొన‌సాగించాల‌ని ఎస్ఈసీని కోరింది. కానీ, జనసేన ఇచ్చిన వినతిపత్రంలో అంశాలు సంతృప్తికరంగా లేవని SEC చెబుతోంది. అందుకే ఈ వినతిని ఒప్పుకోవట్లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శి ఎం.అశోక్‌కుమార్ తెలిపారు. జనసేనకు 2025 నవంబర్‌ 18 వరకు కామన్‌ సింబల్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత లేదని స్పష్టం చేశారు. దీంతో జ‌న‌సేన‌లో క‌ల‌వ‌ర‌పాటు.

ఎన్నిక‌ల్లో కామన్ సింబ‌ల్ ఉంటే ఆ కిక్కే వేర‌ప్పా. ఏ పార్టీకైనా ఎల‌క్ష‌న్ సింబ‌ల్ చాలా ఇంపార్టెంట్‌. బీజేపీ అన‌గానే పువ్వు గుర్తు,  కాంగ్రెస్ అన‌గానే చేతి గుర్తు, టీఆర్ఎస్ అంటే కారు, టీడీపీ అంటే సైకిల్‌, వైసీపీ అంటే ఫ్యాను.. ఇలా జ‌నాలు గుర్తు చూడగానే ఇట్టే గుర్తు ప‌ట్టేస్తారు. ఇంకా ప‌క్కాగా చెప్పాలంటే చాలా మంది ఓట‌ర్లు ఈవీఎంల‌లో అభ్య‌ర్థుల పేర్లు, ఫోటోల కంటే సింబ‌ల్ చూసే ఓటేస్తారు. పార్టీ గుర్తుతో అంత‌లా క‌నెక్ట్ అవుతారు ఓట‌ర్లు. జ‌న‌సేన‌కు ఓటేయాలంటే గాజుగ్లాసు ఎక్క‌డుందా అని వెతుకుతారు కానీ, అభ్య‌ర్థి ఎవ‌రో చూడ‌రు. ఎందుకంటే జ‌న‌సేన అభ్య‌ర్థుల‌కంటే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ మీదున్న అభిమానంతోనే ఆ పార్టీకి ఎక్కువ మంది ఓటేస్తుంటారు. అందుకే వారంద‌రికీ స్థానిక‌ కేండిడేట్ కంటే.. ప‌వ‌న్ కల్యాణ్ పార్టీకి చెందిన గాజుగుర్తే ఎక్కువ గుర్తుంటుంది.

అలాంటిది తెలంగాణ‌లో మినీ ఎన్నిక‌ల సంగ్రామం జ‌రుగుతున్న స‌మ‌యంలో ఆ పార్టీ ఎన్నిక‌ల గుర్తైన గాజుగ్లాసును కోల్పోవ‌డం జ‌న‌సేన‌కు పెద్ద మైన‌స్. జీహెచ్ఎమ్‌సీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌ని త‌ప్పిదానికి ఇంత పెద్ద శిక్ష ప‌డుతుంద‌ని ఆ పార్టీ ఎప్పుడూ ఊహించ‌క‌పోవ‌చ్చు. అందుకే రాజ‌కీయాల్లో ప్ర‌తీ చిన్న విష‌యంలోనూ అప్ర‌మ‌త్తంగా ఉండాలంటారు. కొత్త పార్టీ జ‌న‌సేన‌కు ఆ విష‌యం ఇప్పుడు బాగా తెలిసొచ్చి ఉంటుంది. అయితే, గాజుగ్లాసు గుర్తు తెలంగాణ‌లో మాత్ర‌మే ర‌ద్దు కావ‌డం.. ఏపీలో కొన‌సాగుతుండ‌టం కొంత‌లో కొంత ఊర‌ట‌.