ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణలో జరిగిన కులగణన సర్వే డేటా 88 కోట్ల పేజీల్లో నిక్షిప్తమైందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని ఏఐసీసీ భవన్‌లో కులగణన సర్వేపై కాంగ్రెస్ ఎంపీలు, నేతలకు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రధాని మోదీకి బీసీలపై నిజమైన ప్రేమ లేదన్నారు. కొన్ని విషయాల్లో ఎన్డీయే సర్కార్ దిగి వచ్చేలా రాహుల్ గాంధీ పోరాటం వల్లే కులగణన చేసేందుకు కేంద్రం అంగీకరించిందని రేవంత్ తెలిపారు. కులగణన దేశానికి ఒక దిక్సూచిలా ఈ సర్వే నిలిచి పోతుందని అన్నారు. ఈ సర్వేపై తెలంగాణలోని అగ్రకులాల నుంచి అభ్యంతరం వచ్చిందని, అందరి సంతోషం కోసం పరిస్థితులను బట్టి ముందుకు సాగాలని వివరించి, ఒప్పించామని సీఎం తెలిపారు.  ప్రధాని మోడీ పుట్టుకతో ఓబీసీ కాదని, లీగల్లీ కన్వర్టెడ్ ఓబీసీ అని అందుకే ఆయన బీసీల కోసం ఏమీ చేయరని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీసీల కోసం అన్ని త్యాగాలు చేస్తుందని వెల్లడించారు. ఓబీసీలకు ఎన్నికల్లో, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ నిర్ణయంతో, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కులగణన సర్వే పూర్తి చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన పకడ్బందీగా నిర్వహించిందని రాహుల్ అన్నారు. కులగణన అంత సులభం కాదు కానీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇతర నేతలు అంచాలకు మించి రాణించారని తెలిపారు. దేశంలో సామాజిక న్యాయానికి ఇదో మైలరాయిగా నిలుస్తుందని తెలిపారు.  ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం కులగణన సర్వే ఇవాళ దేశానికి దిక్సూచిగా మారిందని అన్నారు. రాహుల్‌ గాంధీ హామీ మేరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కులగణన చేపట్టామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి 150 ఇళ్లను ఒక బ్లాక్‌గా విభజించి సమగ్రమైన సర్వే నిర్వహించినట్లు వివరించారు. కాంగ్రెస్‌ ఒత్తిడితో దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్రం దిగి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదు..సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు Publish Date: Jul 24, 2025 7:50PM

ఏపీ ఎలక్ట్రానిక్స్‌ పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్

  ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన  సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ఎలక్ట్రానిక్స్‌ తయారీ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.50 వేల కోట్ల పెట్టుబడుల SIPB ప్రతిపాదనలకు ఆమెదం తెలిపారు. సాగుభూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టంగా చర్చించారు.  పలు సంస్థలకు భూకేటాయింపులకు నిర్ణయం తీసుకున్నారు. విశాఖలో సిఫి సంస్థ రూ.16,466 కోట్లతో డేటా సెంటర్‌ ఏర్పాటు చేయనుంది. మధురవాడలో ఆ సంస్థకు 3.6 ఎకరాలు ఇచ్చేందుకు క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది’’అని మంత్రి పార్థసారథి తెలిపారు.  త్వరలో రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని.. ఈ విషయంపై అందరూ దృష్టి సారించాలని మంత్రులకు మార్గనిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. క్వాంటమ్ వ్యాలీ మాదిరిగా మనం గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీలో కూడా అందరి కంటే ముందు ఉండాలని.. దీనివల్ల మనకు ప్రయోజనం ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు.  
ఏపీ ఎలక్ట్రానిక్స్‌  పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ Publish Date: Jul 24, 2025 6:51PM

ఈ నెల 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన

    ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ లో పర్యటించనున్నారు. ఈ నెల 26 నుంచి 31 తేదీ వరకు 6 రోజుల పాటు ఆయన  ఆ దేశంలో పర్యటించి దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత దావోస్ పర్యటనకు వెళ్లిన సిఎం...రెండో విదేశీ పర్యటనగా సింగపూర్ కు వెళుతున్నారు.  బ్రాండ్ ఏపీ ప్రమోషన్ తో రాష్ట్రానికి పెట్టుబడులను సాధించేందుకు ఈ పర్యటనను వేదిక చేసుకోనున్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజెనెస్ విధానాలను వివరించి పెట్టుబడుదారులను ఆహ్వానించనున్నారు. పోర్టులు, ఎయిర్ పోర్టులు, హైవేలు, హార్బర్లు, భూముల లభ్యత, కనెక్టివిటీ, 1053 కి.మీ తీర ప్రాంతం, నిపుణులైన మానవ వనరులు గురించి వివరించనున్నారు. అలాగే పారిశ్రామిక వేత్తలను పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరనున్నారు. 6 రోజుల పర్యటనలో సీఈఓలు, కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.  మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంఘం నిర్వహించే ‘తెలుగు డయాస్పోరా’ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. ఏపీలో పెట్టబడులపై ఆయా దేశాల వారిని ఆహ్వానించనున్నారు. పేదరిక నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పీ4 కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సీఎం పారిశ్రామిక వేత్తలను కోరనున్నారు.  విశాఖ పెట్టుబడుల సదస్సు లక్ష్యంగా... ఏపీలో పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులపై ముఖ్యమంత్రి చర్చించనున్నారు. ఈ ఏడాది నవంబరులో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించేందుకు గానూ ఆ దేశానికి చెందిన ప్రముఖులతోనూ ముఖ్యమంత్రి భేటీ కానున్నారు. డిజిటల్ ఎకానమీ, ఫిన్‌టెక్‌పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే సింగపూర్‌లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలోని వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను కూడా సీఎం సందర్శించనున్నారు.
ఈ నెల 26 నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటన Publish Date: Jul 24, 2025 6:23PM

ఖమ్మం ఖిల్లాకు మహర్ధశ..అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు

  చారిత్రాత్మకమైన ఖమ్మం ఖిల్లా అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.29 కోట్లు మంజూరు చేసింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖిల్లా అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఇటీవలనే ఖిల్లాలో పాటుపడిన బావిని తిరిగి పునరుద్ధరించారు. ఖమ్మం ను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగానే కొండపల్లి వద్ద బౌద్ధ స్థూపాన్ని కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు.  ఖమ్మం జిల్లాలోని చారిత్రక ప్రదేశాలను పర్యాటకులు సందర్శించే విధంగా అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీంతో ఎంతో చారిత్రక కట్టడం ఖిల్లా ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం రూ.29 కోట్లు పర్యాటక శాఖ నుంచి కేటాయించింది. ఖిల్లా పై రోప్ వే కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఖిల్లా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంబాద్రి అనే కొండపై ఉంది. దీన్ని శాసనాలు పురాతన గ్రంథాల్లో కమ్మమెట్టుగా పేర్కొన్నారు. మొట్టమొదటి ఈ కోట యొక్క బీజం ఇక్ష్వాకుల కాలంలో పడింది. కాకతీయుల పాలనకాలం సా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడినాయి. సుమారు 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆదీనంలో ఉంది.  ఈ కోటను రేఖపల్లి పరిపాలిస్తున్న సమయంలో ముసునూరి కమ్మనాయక రాజులు బలంగా నిర్మించారు. ఆ తర్వాత సూర్యదేవర కమ్మనాయక రాజులు కమ్మమెట్టును రాజధానిగా పరిపాలించారు. రేఖపల్లి చుట్టుపక్కన ఉన్న శాసనాలు మరియు ఏకశిలామకుటం, నాయకరాజ వైభవం అనే గ్రంధాల ద్వారా ఈ సమాచారం లభ్యమవుతుంది.  తర్వాత కాలంలో బహమనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీ వంశస్థులు ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ఖమ్మంమెట్టు. కుతుబ్ షాహీ వంశస్థులు దీని పేరు కమ్మమెట్టుగా ఆ తర్వాత ఖమ్మంమెట్టుగా, కుతుబ్షాహీల కాలంలో ఖమ్మం ఖిల్లాగా వ్యవహరించడం మొదలు పెట్టారు    
ఖమ్మం ఖిల్లాకు మహర్ధశ..అభివృద్ధి పనులకు రూ.29 కోట్లు Publish Date: Jul 24, 2025 6:12PM

లిక్కర్ స్కాంలో జగన్‌ని వదలొద్దంటున్న షర్మిల

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాంలో మాజీ ముఖ్యమంత్రి జగన్‌ను వదిలిపెట్టొద్దని ఆయన చెల్లెలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.  వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వెనుక దాగి ఉన్న కుట్రలు పూర్తిగా వెలికి తీయాలని కూటమి ప్రభుత్వాన్ని షర్మిల కోరారు.  విజయవాడలో  విలేకర్లతో మాట్లాడిన ఆమె.. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ క్రమంలో ఈ మద్యం కుంభకోణం వ్యవహారంపై విచారణ జరుపుతున్న సిట్‌పై విమర్శలు గుప్పించారు. సిట్ పద్దతి చూస్తే కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉందన్నారు. డిస్టలరీల వద్ద కమీషన్‌లు, బినామీలు, నగదు రవాణా అంశాలతోపాటు వైఎస్ జగన్‌కి నెలకు రూ. 60 కోట్లు అందేవని మాత్రమే సిట్ అధికారులు చెబుతున్నారన్నారు. దీంతో ఈ మద్యం కుంభకోణంలో తయారీ నుంచి చివర విక్రయాల వరకు అవినీతి జరిగిందనేది అర్థమవుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ డిజిటల్ యుగంలో సైతం కేవలం నగదు రూపంలో మద్యం విక్రయాలు జరిపారని చెప్పారు. కేవలం బ్లాక్ మనీ‌ కోసమే డిజిటల్ పేమెంట్లను నిలిపి వేశారని ఆమె ఆరోపించారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాటి‌ ప్రభుత్వం చేసిన ఆర్ధిక నేరంగా ఈ మద్యం విక్రయాలను ఆమె అభివర్ణించారు. రూ. 3, 500 కోట్లు మద్యం కుంభకోణం ఒక్కటే కాదు.. పన్నులు ఎగ్గొట్టాలనే క్యాష్ పరంగా ఈ విక్రయాలు జరిపారని విమర్శించారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తిగా విచారణ జరగాలని ఆమె పేర్కొన్నారు. చివరకు నాన్ డ్యూటీ పేమెంట్లు మొత్తం బ్లాక్‌లోనే జరిగాయన్నారు. నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ ఎంత అమ్మారో తేల్చాలన్నారు. డిజిటల్ పేమెంట్ ఆపడం‌ వెనుకే అవినీతి ఉందన్నారు. వీటన్నింటికీ  జగన్ సమాధానం చెప్పాలన్నారు. రిషి కొండను ఎందుకు తవ్వారో కూడా ఇంత వరకు వైఎస్ జగన్ సమాధానం చెప్పలేదన్నారు. వివేకా హత్యలో జగన్ సొంత మీడియా హార్ట్ ఎటాక్ అని ఎందుకు చెప్పిందో తెలియలేదన్నారు. జగన్ అసలు అంశాలను మరుగున పెట్టి.. మభ్యపెట్టి మాట్లాడటంలో దిట్ట అంటూ వైఎస్ షర్మిల మరోసారి తన అన్నను తీవ్రస్థాయలో టార్గెట్ చేశారు.
లిక్కర్ స్కాంలో జగన్‌ని వదలొద్దంటున్న షర్మిల Publish Date: Jul 24, 2025 5:14PM

కొడుకు కోసం తమ్మినేని పాట్లు.. జగన్‌కి కొత్త టెన్షన్

మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మొన్నటి ఎన్నికల్లో విజయంపై విపరీతమైన ధీమాతో కనిపించారు. ఎన్నికల ప్రచార సమయంలో తన మెజార్టీ 20 వేలకు తగ్గితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని శపధం కూడా చేశారు. తీరా చూస్తే సొంత బంధువు కూన రవికుమార్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకున్నారు. ఓటమి తర్వాత  పొలిటికల్‌గా తమ్మినేని సైలెంట్ అవ్వడంతో ఇక ఆయన పొలిటికల్ రిటైర్‌మెంట్ తీసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆ ఆముదాలవలస వైసీపీ నాయకుడు తిరిగి లైమ్ లైట్‌లోకి వచ్చే ప్రయత్నం చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.  తమ్మినేని సీతారాం తరచూ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆముదాలవలస వైసీపీలో  కొత్త జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే.. ఇదే ఇప్పుడు వైసీపీ అధినేత జగన్ కు ఇబ్బందికరంగా మారుతోందంట. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన తమ్మినేని, తర్వాత 2009లో సామాజికవర్గం లెక్కలతో ప్రజారాజ్యంలో చేరి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల నాటికి వైసీపీలో చేరిన ఆయనకు సొంత బంధువు కూన రవికుమార్ టీడీపీ నుంచి రాజకీయ ప్రత్యర్ధిగా మారారు.  2014లో కూన రవి ఆముదాలవలసలో తమ్మినేనికి షాక్ ఇచ్చారు. 2019లో వైసీపీ నుంచి గెలిచిన తమ్మినేని స్పీకర్‌గా పని చేశారు.  2024లో విజయంపై ధీమా ప్రదర్శించి సవాళ్లు సైతం విసిరిన ఆయనకు కూన రవి మరోసారి షాక్ ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లోనే తమ్మినేని తన తనయుడు చిరంజీవి నాగ్‌ను అసెంబ్లీకి పంపాలని అనుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్  దగ్గర కూడా అదే విషయం చెప్పారు. అయితే.. ఈ సారి మీరే పోటీ చేయాలి తప్పదని జగన్ స్పష్టం చేయడంతో కాదనలేకపోయారట సీతారాం. ఎన్నికల తర్వాత ఆమదాలవలసలో సీన్ మారిపోయింది. తమ్మినేని సీతారాం యాక్టివ్ పాలిటిక్స్‌కి దూరమైనట్టు కనిపించడంతో చింతాడ రవికుమార్ ని జగన్ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు. దీంతో మాజీ స్పీకర్ పూర్తిగా సైలంట్ అయ్యారు.  తమ్మినేని వ్యవహారాన్ని గమనించిన జగన్ ఆయనకి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. దీంతో అమదాలవలస వైసీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది. బయటకు కనిపించకపోయినా నియోజకవర్గంలో తమ్మినేని వర్సెస్ చింతాడ రవిగా ఇన్ సైడ్ పాలిటిక్స్ ప్రారంభమయ్యాయంట. నిన్న మొన్నటి వరకు జిల్లాలోని ఏ నియోజకర్గంలో కార్యక్రమాలు జరిగినా జిల్లా పెద్దగా   తమ్మినేని  అప్పుడప్పుడు ప్రజాక్షేత్రంలో కనిపించినా ... సొంత నియోజకవర్గం ఆమదాలవలసలోని కార్యక్రమాలతో  మాత్రం తనకు సంబంధం లేదన్నట్టు ఉండేవారు.  అయితే.. సడెన్ గా ఇంట గెలిచి రచ్చ గెలవాలనే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేస్తున్నారాయన. నియోజవర్గంలో వరుస కార్యక్రమాలతో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. జిల్లా కార్యవర్గంలో పదవులు పొందిన  వారికి ఆమదాలవలసలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి చింతాడ రవికి ఆహ్వానం పంపినా ఆయన దూరంగా ఉన్నారు. ఇక భారీ బైక్ ర్యాలీతో వైఎస్ ఆర్ జయంతిని కూడా ఓ రేంజ్‌లో నిర్వహించారు తమ్మినేని. చింతాడ రవి ఈవెంట్స్ లో ఖాళీ కుర్చీలు దర్శనం ఇస్తుంటే.. తమ్మినేని కార్యక్రమాలు పార్టీ శ్రేణులతో కిక్కిరిసిపోతున్నాయి.  మొత్తానికి కొడుకు భవిష్యత్ కోసమే తమ్మినేని యాక్టీవ్ రోల్ ప్లే చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది.  తమ్మినేని స్వయంగా  యాక్టివ్ అవుతుండటంతో కార్యకర్తల్లో జోష్ పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. జగన్ ను మాత్రం కొత్త సమస్య వెంటాడుతుందని తెలుస్తోంది. నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్‌గా చింతాడ రవికుమార్‌ని ప్రకటించినప్పటికీ పేరాడ తిలక్‌ను ఆమదాలవలసలో భవిష్యత్ లీడర్ గా  జగన్  భావిస్తున్నారని వైసీపీలో కీలక నేతల వెర్షన్. ఇప్పుడు తమ్మినేని యాక్టివ్  అవ్వడంతో వర్గపోరు ఎక్కడ పెరుగుతుందోనని వైసీపీ అధిష్టానం తెగ టెన్షన్ పడిపోతుందంట. మరి చూడాలి ఆముదాలవలస వైసీపీ పాలిటిక్స్ చివరికి ఏ టర్న్ తీసుకుంటాయో.
కొడుకు కోసం తమ్మినేని పాట్లు.. జగన్‌కి కొత్త టెన్షన్ Publish Date: Jul 24, 2025 5:02PM

ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి

  ఏపీ మద్యం కుంభకోణ కేసులో అరెస్ట్‌యిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తరుపు న్యాయవాదులు విజయవాడ ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో మిథున్ రెడ్డి A-4గా ఉన్నారు. కాగా ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కారాగారంలో ఆయనకు పలు అదనపు వసతులు కల్పిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  ఈ విచారణపై సస్పెన్స్ నెలకొంది. పిటిషన్‌ను కోర్టు స్వీకరించిన తర్వాత విచారణకు వచ్చే అవకాశం ఉంది. కాగా గత వైసీపీ హయంలో లిక్కర్ స్కామ్ వ్యవహారంలో అవనీతి జరిగినట్లు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు కేసును సిట్‌కు అప్పగించింది. విచారణ చేపట్టడంతో పలువురు కీలక నేతలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. . ఈ కేసులో ఏ31 ధనుంజయ రెడ్డి, ఏ32 కృష్ణ మోహన్‌రెడ్డి, ఏ33 బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.  కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశాలు జారీ చేశారు న్యాయమూర్తి. తదుపరి విచారణ ఈ నెల(జులై) 29వ తేదీకి ఏసీబీ కోర్టు వాయిదా వేసింది.శ్రావణి డిస్టిలరీస్ డైరెక్టర్ చంద్రారెడ్డికి నోటీసులు పంపించారు ఈడీ అధికారులు. PMLA చట్టం కింద కేసు దర్యాప్తు చేస్తున్నారు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. ఈ నెల (జులై) 28వ తేదీ ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని తమ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు.
ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మిథున్‌రెడ్డి Publish Date: Jul 24, 2025 4:45PM

ఖమ్మంలో శ్రీవారి ఆలయం కోసం స్థలాల పరిశీలన తుమ్మలతో టీటీడీఅధికారుల భేటీ

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఖమ్మంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీవారి ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనపై  ఇప్పటికే   టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడితో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చలు జరిపారు. ఆ చర్చల నేపథ్యంలో   టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, టీటీడీ స్తపతి ఖమ్మంలో అనువైన స్థలాన్ని గురువారం (జులై 24) పరిశీలించారు. అనంతరం  మంత్రి తుమ్మల తో సమావేశమయ్యారు. ఖమ్మం  సమీపంలోని అల్లీపురం వద్ద ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని  శ్రీవారి ఆలయ నిర్మాణం కోసం వీరు పరిశీలించారు.  అలాగే రఘునాథపాలెం మండలంలోని  స్వామి నారాయణ్ సంస్థ ఆధ్వర్యంలో పాఠశాల నిర్మాణం జరుగుతోంది. ఇదే ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల కూడా నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలోనే శ్రీవారి ఆలయం నిర్మించాలని ప్రతిపాదనలు వచ్చాయి. ఈ ప్రాంతాన్ని కూడా టీటీడీ అధికారులు పరిశీలించారు. అనం తరం మంత్రి తుమ్మలతో  భేటీ అయిన టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, స్థపతి ఆలయ నమూ నాలను పరిశీలించారు..  ఆగమ పండితులు, టీటీడీ స్థపతి నిర్ణయించిన ప్రాంతంలో త్వరలోనే ఆలయ నిర్మాణ స్థలాన్ని ఖరారు చేసి నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటారని తుమ్మల తెలిపారు.
ఖమ్మంలో శ్రీవారి ఆలయం కోసం స్థలాల పరిశీలన తుమ్మలతో టీటీడీఅధికారుల భేటీ  Publish Date: Jul 24, 2025 4:25PM

ఉభయ సభలు రేపటికి వాయిదా

  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో గందరగోళం కొనసాగుతునే ఉంది. విపక్ష సభ్యుల నినాదాల మధ్య ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. బీహార్‌లో ఎన్నికల ఓటరు జాబితా సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ - SIR), గోవా అసెంబ్లీలో  ఎస్టీలకు సీట్లు రిజర్వ్ అంశాలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ అంశాలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. ఎంత చెప్పిన సభ్యులు వినకపోవడంతో సభల్లో గందరగోళం నెలకొంది.  బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఎన్నికల కమిషన్‌ ఓటర్ల జాబితాకు ప్రత్యేక నిశిత సవరణ (సర్‌) చేపట్టడం, పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌, భారత్‌, పాకిస్థాన్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి తానే మధ్యవర్తిత్వం వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పదేపదే ప్రకటించడం వంటి అంశాలపై వెంటనే చర్చను చేపట్టాలన్న విపక్ష సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. లోక్ సభ  స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన ఉదయం 11 గంటలకు సభ మొదలైన కొద్ది నిమిషాల్లోనే విపక్ష సభ్యుల నిరసనలకు దిగారు. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ ఛైర్ పర్సన్ హరివంశ్ ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభలో గందరగోళం నెలకొంది. దీనితో ఇరు సభలు రేపటికి వాయిదా వేశారు. 
ఉభయ సభలు రేపటికి వాయిదా Publish Date: Jul 24, 2025 4:22PM

మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీతో గురువారం (జులై 24) భేటీ అయ్యారు. ఈ భేటీలో రేవంత్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, పీసీపీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్,  కొండా సురేఖ, వాకిటి శ్రీహరీ తదితరులు కూడా పాల్గొన్నారు. ఈ భేటీలో తెలంగాణ ప్రభుత్వం చేసిన కుల గణన సర్వే ఎంపైరికల్ డేటా ఆధారంగా స్థానిక సంస్థలు, విద్యా , ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ అసెంబ్లీలో  ఆమెదించి  గవర్నర్ ద్వారా  రాష్ట్రపతికి  పంపిన బిల్లు, అలాగే  స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ కేబినెట్ తీర్మానం, ఆర్డినెన్స్ తదితర అంశాలపై చర్చించారు.  
 మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం Publish Date: Jul 24, 2025 4:17PM

ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క

తెలంగాణ మంత్రి సీతక్క ప్రజా ప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు. కోవిడ్ ను ఆరోగ్య శ్రీలో చేర్చాలంటూ 2021లో సీతక్క ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేసిన సందర్భంగా అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆమెపై కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణలో భాగంగా సీతక్క గురువారం (జులై 24) నాంపల్లిలోని మనోరంజన్ కాంప్లెక్స్ లోని ప్రజాప్రతినిథుల కోర్టుకు హాజరయ్యారు.  కోవిడ్ సమయంలో కోవిడ్ ప్రొటోకాల్ ను ఉల్లంఘించి  సీతక్క చేపట్టిన నిరసనకు సంబంధించిన కేసు విచారణకు హాజరైన సీతక్క కోర్టులో పదివేల రూపాయలతో కూడిన రెండు పూచికత్తులను దాఖలు చేశారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను వచ్చే నెల 13కు వాయిదా వేసింది.  
ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన మంత్రి సీతక్క Publish Date: Jul 24, 2025 4:05PM

తెలంగాణ భవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు

    బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టిన రోజు వేడుకలు తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నేతలు, కార్యకర్తల మధ్య కేటీఆర్‌ కేక్‌ కట్‌ చేశారు. వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు తరలివచ్చి ఆయనకు జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలిపారు. వారందరికీ కేటీఆర్‌ ధన్యవాదాలు తెలిపారు. తనను అభిమానించే వారి ప్రేమ, ఆశీర్వాదాలతో మరింత ఉత్సాహంగా ప్రజాసేవలో పాల్గొంటానని చెప్పారు.ఈ రోజు ఉదయం కేటీఆర్  బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ నల్లబాలు అలియాస్ శశిధర్ గౌడ్ ఇంట్లో తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నరు. మరోవైపు కేటీఆర్ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి  హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని సీఎంవో అధికారిక ఎక్స్ ద్వారా తెలిపారు ఆకాంక్షించారు. వైసీపీ అధినేత జగన్ ట్వీట్టర్ వేదికగా నా సోదరుడు తారక్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు.
తెలంగాణ భవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్‌డే వేడుకలు Publish Date: Jul 24, 2025 3:55PM

చంద్రబాబుకు జస్ట్ 5 నిముషాలు చాలు

రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడానికీ, పరిశ్రమలను ఏర్పాటు చేసేలా పారిశ్రామిక వేత్తలను కన్విన్స్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి జస్ట్ ఐదంటే ఐదు నిముషాలు చాలు. ఈ విషయం గతంలో పలుమార్లు రుజువైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగరాన్ని ఐటీ హబ్ గా బెంగళూరు, చెన్నైలకు దీటుగా మార్చడంలో ఆయన పాత్ర కీలకం. ఎన్నో ప్రతిష్ఠాత్మక సంస్థలు కేవలం ఆయనపైనా, అభివృద్ధి విషయంలో ఆయనకు ఉన్న విజన్ పైనా నమ్మకంతో హైదరాబాద్ కు తరలి వచ్చాయి. ఇప్పుడు అదే పరిస్థితి అమరావతిలో కనిపిస్తున్నది.  ఐదేళ్ల జగన్ పాలన ఏపీలో  పరిశ్రమల రంగానికి ఒక చీకటి అధ్యాయం అని చెప్పవచ్చు. ఒక్క‌ చాన్స్ ప్లీజ్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్.. తన ఐదేళ్ల పాలనలో రాష్ట్రప్రజలకు నరకం చూపించారు. ఆయన పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదు. అన్ని వర్గాల ప్రజలూ ఆయన పీడిత పాలన బాధితులే అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.  అంతకు ముందు చంద్రబాబు పాలనలో అంటే 2014-19 మధ్య కాలంలో  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన పలు పరిశ్రమలను జగన్ తన విధానాలతో  రాష్ట్రం నుంచి తరిమేశారు. దీంతో  జగన్ హయాంలో రాష్ట్రానికి కొత్తగా పరిశ్రమలు సంగతి అలా ఉంచి.. ఉన్న పరిశ్రమలే తరలిపోయే దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. ఐదేళ్ల జగన్ పాలనకు చరమగీతం పాడుతూ 2024 ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. దీంతో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్ర పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను ఏపీలో కూడా ప్రారంభించేందుకు క్యూకడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన ఏడాది కాలంలోనే రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వరద వచ్చిందంటే.. అది సీబీఎన్ పై ఉన్న నమ్మకమే కారణం అనడంలో సందేహం లేదు. చంద్రబాబు పట్ల ఇన్వెస్టర్లలో నమ్మకానికి  విజయవాడలో  ఇన్వెస్టోపియా గ్లోబల్ ఈవెంట్ సాక్షిగా యూఏఈ మంత్రి  చెప్పిన మాటలు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తాయి. ఈ ఈవెంట్ కు గల్ఫ్ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఈ సదస్సుకు హాజరైన  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌఖ్ అల్ మర్రీ  దావోస్ లో చంద్రబాబుతో ఐదు నిముషాలు భేటీ అయ్యాననీ, ఆ సందర్భంగా ఆయన విజన్ పట్ల ఆకర్షితుడినై పెట్టుబడితో ఏపీకి వచ్చేశామని చెప్పారు. ఇది చాలదూ రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర అభివృద్ధి పట్ల చంద్రబాబుకు ఉన్న విజన్ కు, చిత్తశుద్ధికీ. యూఏఈ తన ఆర్థిక వ్యూహాల్లో భాగంగా పర్యాటకం, సాంకేతికత, ఇతర రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. 
 చంద్రబాబుకు జస్ట్ 5 నిముషాలు చాలు Publish Date: Jul 24, 2025 3:20PM

మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్

  మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఆయన కోడలు ప్రీతి రెడ్డి, కొడుకు భద్రారెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ఇంజనీరింగ్,మెడికల్ కళాశాలల సీట్ల కేటాయింపులో భారీగా డొనేషన్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో ఈ తనిఖీలు జరుగుతున్నాయని సమాచారం. మేనేజ్‌మెంట్ కోటాలో ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును మించి విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసినట్లు పలు ఫిర్యాదులు అందినట్టు సమాచారం.విద్యార్థుల నుంచి డొనేషన్ల పేరుతో వచ్చిన ఆదాయాన్ని సరిగా చూపకపోవడం.. ఆదాయ పన్నులో హెచ్చుతగ్గులను గుర్తించడం వంటి అంశాలపై ఐటీ అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో మల్లారెడ్డి ఫ్యామిలీ సంబంధించి పలు ప్రాపర్టీల్లో సోదాలు కొనసాగుతున్నాయి.  మరోవైపు ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఐటీ సోదాలపై మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి ఏమన్నారంటే. ఐటీ అధికారులు ఇళ్లపై రైట్స్ చేస్తున్న విషయంలో నిజం లేదని తెలిపారు. 2022లో పీజీ సీట్ల విషయంలో కాళోజీ యూనివర్సిటీ ఇచ్చిన ఫిర్యాదుతో వరంగల్ పోలీసులు ఇక్కడకి వచ్చారని ఆమె స్పష్టం చేశారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా నోటీసులు అందజేశారని అన్నారు. ఉదయం 6 గంటలకు అధికారులు రావడంతో ఐటీ అధికారులుగా కొందరు ప్రచారం చేస్తున్నారని ఇందులో వాస్తవం లేదని మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి పేర్కొన్నారు
మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంటిపై ఐటీ రైడ్స్ Publish Date: Jul 24, 2025 3:03PM

రష్యాలో విమాన ప్రమాదంలో 49 మంది మృతి

  రష్యాలో అదృశ్యమైన అంగార ఎయిర్‌లైన్స్ ఫ్యాసింజర్ విమానం కూలిపోయిందని ఎయిర్‌లైన్‌ అధికారులు తెలిపారు. ఈ ప్రమాద ఘటనల్లో  49 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. వీరిలో ఐదుగురు చిన్నారులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విమానానికి సంబంధించి శిథిలాలను అధికారులు గుర్తించారు. కాగా ఇదే ప్రాంతంలో గతేడాది హెలికాప్టర్ కూడా మిస్ అవడం గమనార్షం.ఎయిర్ పోర్టుకు సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని వివరించారు. ఘటనా స్థలంలో భారీగా మంటలు ఎగిసి పడుతున్నాయని, ప్రమాద తీవ్రతను గమనిస్తే ప్రయాణికులలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే అవకాశం లేదని చెప్పారు. అంగారా ఎయిర్‌లైన్‌కు చెందిన ఏఎన్‌-24 విమానం గురువారం ఉదయం బ్లాగోవెష్‌చెన్స్క్‌ నుంచి చైనా సరిహద్దుల్లో ఉన్న టిండా ప్రాంతానికి బయల్దేరింది.  టిండాలోని ఎయిర్ పోర్టులో పైలట్ ల్యాండింగ్ కు ప్రయత్నించి విఫలమయ్యారని సమాచారం. ఎయిర్ పోర్ట్ చుట్టూ తిరిగి మరోమారు ల్యాండింగ్ కు పైలట్ ప్రయత్నించారని, ఈ క్రమంలోనే ఎయిర్ పోర్టుకు 15 కిలోమీటర్ల దూరంలో విమానం కూలిపోయిందని అధికారులు వెల్లడించారు. 
రష్యాలో విమాన ప్రమాదంలో 49 మంది మృతి Publish Date: Jul 24, 2025 2:33PM

ఢిల్లీలో రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్.. దేనిపైనంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. గురువారం (జులై 24) రేవంత్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లకార్జున్ ఖర్గే, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లుపై పార్లమెంటులో లేవనెత్తాల్సిందిగా రేవంత్ ఈ సందర్భంగా రాహుల్, ఖర్గేలను కోరారు. అసలు బీసీ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకే ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, ఇతర మంత్రులతో ఢిల్లీ పర్యటనకు వచ్చారు. ఇలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం (జులై 24) సాయంత్రం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేయనున్నారు. తెలంగాణలో కులగణన జరిగిన తీరు, అనుసరించిన విధానం వంటి అంశాలపై ఈ పవర్ పాయింట్ ప్రజంటేషన్  ఇవ్వనున్నారు. కులగణన, బీసీ రిజర్వేషన్ అంశాలలో తెలంగాణ దేశానికే మోడల్ గా నిలుస్తుందని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు ఇవే అంశాలపై రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వడం ప్రాథాన్యత సంతరించుకుంది.   
ఢిల్లీలో రేవంత్ పవర్ పాయింట్ ప్రజంటేషన్.. దేనిపైనంటే? Publish Date: Jul 24, 2025 2:18PM

తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు

తిరుపతిలో జాతీయ మహిళా సాధికారత సదస్సు నిర్వహించనున్నట్లు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. సెప్టెంబర్ 14 నుంచి రెండు రోజుల పాటు తిరుపతిలోని తాజ్ హోటల్ లో జరిగే ఈ సదస్సు నిర్వహణపై ఆయన గురువారం (జులై 24) సమీక్ష నిర్వహించారు. తొలుత ఈ సదస్సును విశాఖలో నిర్వహించాలని భావించినప్పటికీ లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సూచన మేరకు శ్రీనివాసుడు కొలువై ఉన్న తిరుపతిలో నిర్వహించనున్నట్లు తెలిపారు.   ఈ సదస్సుకు  ఈ సదస్సుకు ప్రతి రాష్ట్రం నుంచి ఆరుగురు, ప్రతి అసెంబ్లీ నుంచీ ఆరుగురు చొప్పున మహిళా ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు.  300 మందికి పైగా ఈ సదస్సుకు హాజరౌతారనీ.. ఈ సదస్సులో చర్చించిన అంశాల నివేదికను పార్లమెంటు, అసెంబ్లీల ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెడతారని అయ్యన్నపాత్రుడు వివరించారు.  
తిరుపతిలో జాతీయ మహిళా సాధికార సదస్సు Publish Date: Jul 24, 2025 1:58PM

సీఎం చంద్రబాబు ట్వీట్‌.. పవర్ స్టార్ హర్షం

డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ నటించిన సినిమా సూపర్ సక్సెస్ కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హరి హర వీరమల్లు సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏపీ సీఎం చంద్రబాబు   ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆప్యాయంగా చేసిన పోస్ట్ నాకు ఆశ్చర్యాన్నీ, ఆనందాన్నీ కలిగించిందంటూ రీట్వీట్ చేశారు.  మెగా అభిమానులు చాన్నాళ్లుగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు ఎట్టకేలకు గురువారం (జులై 24)  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బుధవారం (జులై 23)   రాత్రే ప్రీమియర్స్, బెనిఫిట్ షోలు పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్ళుగానో ఎదురుచూస్తున్న హరిహరవీరమల్లు (#HariHaraVeeraMallu) చిత్రం విడుదల సందర్భంగా శుభాకాంక్షలు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు... చారిత్రాత్మక కథాంశంతో రూపొందించిన చిత్రంలో తొలిసారి నటించిన 'హరిహర వీరమల్లు' సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నానంటూ చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే...  సమయాన్ని సర్దుబాటు చేసుకుని నటించిన ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకోవాలని ఆకాంక్షిస్తున్నానని సీఎం ఆ పోస్టులో పేర్కొన్నారు.   ఈ ట్వీట్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. సీఎం పోస్ట్ ను ట్యాగ్ చేస్తూ.. 'సీఎం చంద్రబాబు గారూ, నేను గత పదేళ్లలో పలుమార్లు సమావేశమయ్యాం. అయినప్పటికీ ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదు. ఈ రోజు  హరిహర వీరమల్లు గురించి చంద్రబాబు నాయుడు గారు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష నాకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. ఆ మాటలు విజయ సంకేతాలు. నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే సినిమాలో నటించే వెసులుబాటు ఇచ్చినందుకు.. చిత్ర విజయాన్ని ఆకాంక్షించినందుకు సీఎం చంద్రబాబుగారికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నాను  అని  పేర్కొన్నారు.
సీఎం చంద్రబాబు ట్వీట్‌..  పవర్ స్టార్ హర్షం Publish Date: Jul 24, 2025 1:25PM

కాంగ్రెస్ గూటికి కొండబాల?

డిప్యూటీ సీఎం భట్టితో సంప్రదింపులు! తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్, మధిర మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు కాంగ్రెస్ గూటికి చేరనున్నారా? అందుకు రంగం సిద్ధం చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  రెండు రోజుల క్రితం  కొండబాల కోటేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు.  బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో  ఉన్నంత కాలం ఆయన తెలంగాణ విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ గా కొనసాగారు.  గతంలో మధిర ఎమ్మెల్యే గా కూడా కొండబాల పనిచేశారు. దీంతో ఆయనకు   అనుచరగణం కూడా ఉంది. భట్టితో భేటీ సందర్భంగా కొండబాల తనకు ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వమని కోరినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో భట్టి నుంచి ఆయనకు స్పష్టమైన హామీ ఏదీ రాలేదని తెలుస్తోంది. కొండబాల అడిగిన దానికి భట్టి  హామీ ఇవ్వలేననీ,  ఎప్పటి నుంచో   పార్టీలో కొనసాగుతున్న వారికి తొలి ప్రాధాన్యత ఇస్తున్నామని స్పష్టం చేశారని అంటున్నారు. అయితే.. ఆరు నెలల తర్వాత పరిస్థితిని బట్టి ఆలోచిస్తామని చెప్పినట్లు సమాచారం. దీనికి  కొండబాల కూడా సుముఖత వ్యక్తం చేసి కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారని అంటున్నారు. ప్రస్తుతం కొండబాల తన అనుచరులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన  అనుచరుల నుంచి పార్టీ మార్పునకు విముఖత వ్యక్తమౌతోందని అంటున్నారు. 
కాంగ్రెస్ గూటికి కొండబాల? Publish Date: Jul 24, 2025 1:12PM

గాల్లోనే అదృశ్యమైన విమానం.. పేలిపోయి ఉంటుందన్న అనుమానాలు

రష్యాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 50మంది ప్రయాణికులతో చైనా లోని టిండా నగరం వైపు వెళ్తున్న విమానం అదృశ్యమైంది. ఆ విమానానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ లో  సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.  ఆ విమానం  గాల్లోనే పేలిపోయినట్లు ఆందోళన వ్యక్తం అవుతున్నది.   ర‌ష్యాలోని అంగారా విమాన‌యాన సంస్థ‌కు చెందిన ప్ర‌యాణికుల‌ విమానం 50 మందితో వెడుతూ చైనా స‌రిహ‌ద్దులో   గ‌ల్లంతైంది.  చైనా స‌రిహ‌ద్దు ప్రాంత‌మైన అమూర్‌లోని టిండా ప్రాంతానికి వెళుతుండ‌గా  . గ‌మ్య‌స్థానానికి  కొద్ది దూరంలో అదృశ్యమైంది.  విమానం అదృశ్యమైన విషయాన్ని అధికారులు ధృవీకరించారు.    
గాల్లోనే అదృశ్యమైన విమానం.. పేలిపోయి ఉంటుందన్న అనుమానాలు Publish Date: Jul 24, 2025 12:59PM

లిక్కర్ స్కామ్ కేసు.. ఇక ఈడీ దూకుడు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సిట్ దర్యాప్తుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేతలకు నిప్పుడు ఉప్పు తోడైనట్లుగా ఈడీ కూడా ఎంటర్ కావడంతో ఇక చుక్కలు కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తునకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.   ఇక ఇప్పుడు ఈడీ కూడా ఈ కేసులో మనీ ల్యాండరింగ్ కు సంబంధించిన వ్యవహారంపై దర్యాప్తునకు నడుం బిగించింది. సిట్ నుంచి ఈ కేసుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని సేకరించింది. మనీ ల్యాండరింగ్ నిరోథక చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ మద్యం కుంభకోణంతో సంబంధాలున్న పలువురు వైసీపీ నేతలను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగి శార్వాణి డిస్టిలరీస్ డైరెక్టర్  చంద్రారెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న హైదరాబాద్ లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొంది.  
లిక్కర్ స్కామ్ కేసు.. ఇక ఈడీ దూకుడు Publish Date: Jul 24, 2025 12:43PM

అనిల్ అంబానీ కార్యాలయాలు, నివాసాలలో ఈడీ సోదాలు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన కార్యాలయాల్లో ఈడీ అధికారులు గురువారం (జులై 24) సోదాలు చేపట్టారు. ఢిల్లీ, ముంబయిలోని ఆయనకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో దాదాపు 50 ప్రదేశాలలో ఏకకాలంలో ఈ దాడులు చేస్తున్నారు.   ఎస్‌బీఐ  ఇటీవల అనిల్ అంబానీ సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ రుణఖాతాలను ఫ్రాడ్‌గా తేల్చిన నేపథ్యంలో ఈ సోదాలు జరగడం ప్రాథాన్యత సంతరించుకుంది.   అనిల్ అంబానీ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మనీల్యాండరింగ్ పై దర్యాప్తును ప్రారంభించిన ఈడీ రిలయన్స్ కమ్యూనికేషన్స్‌తో పాటు ఇతర అనుబంధ సంస్థలపై దృష్టి సారించింది   అనిల్ అంబానీ  నేతృత్వంలోని రిలయన్స్ గ్రూప్ సంస్థలు   కొన్నేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు, న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సోదాలు ఎందుకు, ఏ అవకతవకలకు సంబంధించి జరుగుతున్నాయనే విషయంపై ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఈడీ వెలవరించలేదు. 
అనిల్ అంబానీ కార్యాలయాలు, నివాసాలలో ఈడీ సోదాలు Publish Date: Jul 24, 2025 12:30PM

ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ రోజు ప్రారంభమైంది.  ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు పాల్గొన్న ఈ సమావేశంలో మొత్తం 42 అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రధానంగా  ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించి సభా నిర్వహణ తేదీలపై నిర్ణయం తీసుకోనున్నారు.   అలాగే బీపీఎస్, ఎల్ఆర్ఎస్ పథకాలకు మంత్రివర్గం ఆమోదముద్రవేయనుంది.  అదే విధంగా ముఖ్యమంత్రి సింగపూర్ పర్యటనపై కూడా కేబినెట్ చర్చిస్తుంది.  ఇక ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఈ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సీఆర్డీఏ ప్రతిపాదనలపై కూడా చర్చించి ఆమోదముద్ర వేసే అవకాశాలు ఉన్నాయి.  అదే విధంగా పలు సంస్థలకు భూ కేటాయింపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  ప్రభుత్వంలో కొత్తగా సైన్స్ అండ్ టెక్నాలాజీ   శాఖ ఏర్పాటుపై  చర్చించే అవకాశం ఉంది.  
ఏపీ కేబినెట్ భేటీ.. ఏయే అంశాలపై చర్చిస్తున్నారంటే..? Publish Date: Jul 24, 2025 12:19PM

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు

మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్‌కు   పోలీస్‌ లు నోటీసులు జారీ చేశారు. తెలుగుదేశం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు  మేరకు అనిల్ కుమార్ యాదవ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ కేసులో నోటీసులు జారీ చేశారు.   కోవూరులో జరిగిన వైసీపీ సమావేశంలో తనను అసభ్యంగా దూషించారని ఆరోపిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఈ నెల 26న ఉదయం పది గంటలకు కోవూరు పోలీసు స్టేషన్ లో విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో పేర్కొన్నారు. కాగా పోలీసులు నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన సమయంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన నివాసంలో లేకపోవడంతో ఆయన నివాసానికి నోటీసు అంటించి వెళ్లారు.  ఇలా ఉండగా క్వార్ట్జ్ అక్రమ తవ్వకాల కేసులో అరెస్టైన అనిల్ కుమార్ యాదవ్ సన్నిహితుడు బిరదవోలు శ్రీకాంత్ రెడ్డి వాంగ్మూలం ఆధారంగా ఆ కేసులో కూడా మాజీ మంత్రికి ఒకటి రెండు రోజులలో నోటీసులు  ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు నోటీసులు Publish Date: Jul 24, 2025 11:29AM

ఉప్పొంగి ప్రవహిస్తున్న కావేరీ నది.. 84 ఏళ్లలో ఇదే తొలిసారి

కావేరీ నది పొంగి ప్రవహిస్తున్నది. దాదాపు 84 ఏళ్ల తరువాత ఈ నదిలో ఈ స్థాయి నీటిమట్టం రావడం ఇదే మొదటి సారి. ఈ నదిపై 1932లో కృష్ణసాగర్ డ్యాం నిర్మించిన తరువాత ఇక్కడ నుంచి నీటిని దిగువకు విడుదల చేయడం ఇది రెండో సారి మాత్రమే. ఎప్పుడో 1941లో కావేరీ నదికి ఉధృతంగా వరదలు వచ్చిన సమయంలో డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. మళ్లీ ఇంత కాలానికి ఈ ఏడాది జులైలో కావేరీ నది నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కర్నాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కేఎస్ఆర్ డ్యాం వద్ద కావేరీ నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. డ్యామ్ నిర్మాణం తరువాత తొలి సారిగా జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 124.4 అడుగుల స్థాయికి చేరుకుంది.    
ఉప్పొంగి ప్రవహిస్తున్న కావేరీ నది.. 84 ఏళ్లలో ఇదే తొలిసారి Publish Date: Jul 24, 2025 10:44AM

అడుసుతొక్కనేల.. సామెతను గుర్తు చేస్తున్న కొలికిపూడి!

తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావును వివాదాలు వెంటాడతాయా? లేక ఆయనే వివాదాల వెంటపడతారా తెలియదు కానీ, ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఆయన తరచూ వివాదాలతోనే సహవాసం చేస్తున్నారని అనిపించక  మానదు. తాజాగా కొలికిపూడి శ్రీనివాసరావు వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీనిపై కొలికిపూడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా తిరువూరు నియోజకవర్గంలో తెలుగుదేశం క్యాడర్ తో సఖ్యత లేకుండా చేసుకున్న కొలికిపూడి శ్రీనివాసరావు తన చర్యలు, తీరుతో అధిష్ఠానం ఆగ్రహానికీ గురయ్యారు. ఇప్పుడు తాజాగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో  కలిసి మాట్లాడిన వీడియో బయటకు రావడం సంచ లనంగా మారింది.  ఇప్పటికే పార్టీలోని సీనియర్లు కొలికపూడి చర్యలతో సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే మద్యం స్కాం లో పీకల లోతు కూరుకుపోయి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి షేక్ హ్యాండిచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చిందని పార్టీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా తాను పెద్దిరెడ్డి రామచందరారెడ్డితో మాటలు కలిపిన వీడియో మొత్తం పది సెకండ్లేనని, యాథృచ్ఛికంగా హైదరాబాద్ విమానాశ్రయంలో ఎదురుపడిన పెద్దిరెడ్డి రామచం ద్రారెడ్డిని కేవలం పలకరించాననీ కొలికిపూడి వివరణ ఇస్తున్నప్పటికీ, టీడీపీ శ్రేణుల, నేతల ఆగ్రహం చల్లారడం లేదు. పలు అవినీతి కేసులలో అభియోగాలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డిని, అందులోనూ తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  కనిపించగానే అత్యుత్సాహంతో ఆయన వెంటపడి మరీ పలకరించాల్సిన అవసరం ఏం వచ్చిందని పార్టీ నాయకులు కొలికిపూడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ విషయంలో తెలుగుదేశం అధిష్ఠానం కూడా కొలికిపూడిపై సీరియస్ గా ఉందంటున్నారు.   ఇప్పటికే తిరువూరు  పార్టీ శ్రేణులలో పరపతి పోగొట్టుకున్న కొలికిపూడిపై ఇప్పటికే చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెద్దిరెడ్డితో మాటామంతీ కారణంగా ఉన్న కొద్దిపాటి సానుకూలత కూడా కోల్పోయారని అంటున్నారు.  
అడుసుతొక్కనేల.. సామెతను గుర్తు చేస్తున్న కొలికిపూడి! Publish Date: Jul 24, 2025 10:19AM

బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి.. రేవంత్ డిమాండ్ తో బీజేపీ ఇరుకున పడ్డట్టేనా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  తన తాజా డిమాండ్ తో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ నే కాదు, బీజేపీ హైకమాండ్ ను కూడా ఇరుకున పడేశారు. తన రాజకీయ చాణక్యం ప్రదర్శించి.. కేంద్రంలో తీవ్ర ఒత్తిడి తీసుకుస్తున్నారు. కులగణనపై కేంద్రం మెడలు వంచుతామంటూ గర్జించారు.  హస్తినలో మీడియా సమావేశం పెట్టి మరీ ఉపరాష్ట్రపతి పదవిని బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవిని బీసీలతో లింక్ పెట్టి కేంద్రాన్ని ఇరుకున పెట్టారు.   దత్తాత్రేయను ఉపరాష్ట్రపతిని చేయడం ద్వారా బీసీలను గౌరవించినట్లే కాకుండా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుర్తించినట్లు అవుతుందని రేవంత్ అన్నారు.  తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు బీసీల నాయకత్వాన్ని అణచివేస్తున్నారని ఆరోపణ చేయడమే కాకుండా..ఈ సందర్భంగా బండి సంజయ్ ను ప్రస్తావించారు.  బీసీలకు పెద్ద పీట వేసేందుకు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. ఇండియా  కూటమి పార్టీలతో తానే మాట్లాడి మద్దతు లభించేలా చేస్తానన్నారు.  బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి అంటూ రేవంత్ చేసిన డిమాండ్ బీజేపీకి గొంతులో పచ్చవెలక్కాయపడినట్లు చేసిందని పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే.. ఉపరాష్ట్రపతి పదవి విషయంలో బీజేపీ చాలా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వ్యూహాత్మకంగా పలు పేర్లను ప్రచారంలోకి తెస్తున్నది. అయితే బీజేపీ ప్రచారంలోకి తీసుకువస్తున్న పేర్లలో బండారు దత్తాత్రేయ పేరు మాత్రం లేదు.   బండారు దత్తాత్రేయకు పదవీవిరమణ వయస్సు దగ్గరపడుతోంది. ఇప్పటికే హర్యానా, హిమాచల్ ప్రదేశ్ లకు గవర్నర్ గా పని చేశారు.  ఈ నేపథ్యంలోనే ఆయన పేరును ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ పరిశీ లించే అవకాశం ఇసుమంతైనా లేదు. అయినా  బీసీల విషయంలో బీజేపీ అన్యాయం చేస్తున్నదంటూ ఆ పార్టీ హైకమాండ్ ను ఎండగట్టడమే లక్ష్యంగా రేవంత్ ఈ డిమాండ్ ను తెరపైకి తీసుకువచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి.. రేవంత్ డిమాండ్ తో బీజేపీ ఇరుకున పడ్డట్టేనా? Publish Date: Jul 24, 2025 9:49AM

శ్రీశైలం జలాశయానికి వరద పోటు

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లను 10 అడుగుల మేర ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇక జూరాల జలాశయం  జలకళతో  కళకళలాడుతోంది. ప్రస్తుతం జూరాల జలాశయం నుంచి,  38 వేల 408 క్యూసెక్కుల నీరు వస్తున్నది. ఇక సుంకేశుల నుంచి అయితే 36 వేల 975 క్యూసెక్కుల నీరు వస్తున్నది.శ్రీశైలం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో 75 వేల 383 క్యూసెక్కులు ఉండగా, ఐట్ ఫ్లో లక్షా 21 వేల 482 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 883.50 అడుగులు ఉంది. కుడిచ ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.  
శ్రీశైలం జలాశయానికి వరద పోటు Publish Date: Jul 24, 2025 9:35AM

పరాఠాలు అంటే ఇష్టమా? దయచేసి స్టఫింగ్ కు ఇవి మాత్రం వాడకండి..!

   భారతీయులకు పరాఠాలు, రోటీలు అంటే చాలా ఇష్టం. చాలా ఇళ్ళలో  పూరీలు,  స్టఫ్డ్ చేసిన పరాఠాలు  చాలా సాధారణం. బంగాళాదుంపలు, పనీర్, జున్ను, మాంసం.. ఇట్లా చాలా పదార్థాలు పరాఠాల స్టఫింగ్ లో వాడతారు. పరాఠా రుచి ఇనుమడించడం కోసం చాలా రకాలుగా పరాఠాలు చేస్తుంటారు.  కానీ ఇట్లా పరాఠాలు చేయడం అన్ని విదాలుగా ఆరోగ్యకరమైనది కాదని అంటున్నారు ఆహార నిపుణులు. కొన్ని రకాల పదార్థాలు స్టఫ్ చేసి పరాఠాలు తయారు చేసుకుని తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా పెరుగుతుందట. అలాగే ఊబకాయం కూడా సందేహం లేకుండా వస్తుంది అంటున్నారు. ఇంతకీ పరాఠాలలో స్టఫ్ చేయకూడని పదార్థాలు ఏమిటో తెలుసుకుంటే.. ప్రాసెస్డ్ చీజ్ లేదా మయోనైస్.. ఈ రోజుల్లో చీజ్ పరాఠాలు లేదా మాయో స్టఫ్డ్ రోల్స్ బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే ఈ ప్రాసెస్ చేసిన వస్తువులలో సంతృప్త కొవ్వులు,  రసాయన ప్రజర్వేటివ్స్  ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి.  ఊబకాయం,  గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. సరిగ్గా ఉడికించని మాంసం లేదా కీమా..  పూర్తిగా ఉడికించకుండా ముక్కలు చేసిన మాంసం లేదా మటన్‌తో నింపితే అది ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదాన్ని పెంచుతుంది. సరిగ్గా ఉడికించని మాంసం బ్యాక్టీరియాతో నిండి ఉంటుంది.  గ్యాస్, వాంతులు, విరేచనాలు వంటి కడుపు సమస్యలను కలిగిస్తుంది.  ఎక్కువ నూనెతో సుగంధ ద్రవ్యాలు.. బంగాళాదుంపలు, ఉల్లిపాయలు లేదా ఏదైనా కూరటానికి ఎక్కువ నూనె,  సుగంధ ద్రవ్యాలు జోడించిన పదార్థాలు స్టప్ చేస్తే  అది  కడుపు  జీర్ణ శక్తిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల మలబద్ధకం, ఆమ్లతత్వం,  గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. మిగిలిన కూరలు లేదా కూరగాయలు.. చాలా మంది మిగిలిపోయిన కూరగాయలను పరాఠాలలో ఉపయోగిస్తారు, కానీ ఏమైనా కాస్త పాడైన  కూరగాయలు శరీరంలో విషాన్ని కలిగిస్తాయి. ఫుడ్ ఇన్ఫెక్షన్ లకు  దారితీస్తాయి. అధిక ఉప్పు లేదా ఊరగాయ.. కొంతమంది  ఊరగాయ లేదా ఎక్కువ ఉప్పు జోడించడం ద్వారా పరాఠా రుచిని పెంచాలని కోరుకుంటారు. కానీ ఊరగాయలో ఉండే అధిక ఉప్పు కంటెంట్ కడుపులో చికాకు, ఆమ్లతత్వం,  అధిక రక్తపోటు వస్తుంది. అధిక ఉప్పు గుండె జబ్బులు,  మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది.                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..
పరాఠాలు అంటే ఇష్టమా? దయచేసి స్టఫింగ్ కు ఇవి మాత్రం వాడకండి..! Publish Date: Jul 24, 2025 9:30AM