సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం...

 

ముస్లింలకు ప్రసిద్ధ స్థానం మక్కా అని అందరికి తెలిసిన విషయం. మక్కాని దర్శించుకోవాలని ప్రతి ముస్లిం సోదరులు ఆకాంక్షిస్తారు. అలాంటి పుణ్య స్థానాన్ని సందర్శించి వస్తున్న ప్రజలు ఒక్క సారిగా అనంత లోకాలకు వెళ్ళీపోవడం పై వారి బంధువులు తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముప్పై ఐదు మంది విదేశీ భక్తులు మరణించారు. మక్కాకు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ముప్పై ఐదు మంది యాత్రికులు మరణించారని మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారని సౌదీ అరేబియా ఆధికారులు వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మదీనా ప్రావిన్స్ లోని అల్ అకల్ కేంద్రం వద్ద ఈ ప్రమాదం సంభవించిందని తెలిపారు. 

యాత్రికులతో వెళ్తున్న బస్సు మరో భారీ వాహనాన్ని ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం సంభవించిందని ప్రమాదం అనంతరం బస్సు పూర్తిగా దగ్ధమైందని అధికారులు తెలియజేశారు. ప్రమాదం జరిగిన బస్ లో ఆసియా, అరబిక్ యాత్రికులు ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో గాయపడిన వారిని అల్హంన ఆసుపత్రికి తరలించామని సౌదీ అరేబియా అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని సౌదీ అరేబియా అధికారులు వెల్లడించారు. మరోవైపు సౌదీ అరేబియాలో రోడ్డు ప్రమాద ఘటన పై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన ప్రధాని క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.