అయ్యప్పను దర్శించుకున్న మహిళలు..ఆలయం మూసివేత

 

కేరళలోని పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్పస్వామిని 50 ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు దర్శించుకున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో తాము అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నట్లు కోజికోడ్‌ జిల్లాకు చెందిన బిందు(42), కనకదుర్గ(44) అనే ఇద్దరు మహిళలు వెల్లడించారు. ‘‘మంగళవారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో మేం పంబ చేరుకున్నాం. అక్కడి నుంచి ఎలాంటి పోలీసు భద్రత లేకుండానే సన్నిదానానికి వచ్చాం. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకున్నాం. మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు. కొందరు భక్తులు ఉన్నప్పటికీ ఎవరూ మమ్మల్ని ప్రశ్నించలేదు’’ అని మహిళలు చెబుతున్నారు. వీరిద్దరూ హడావుడిగా శబరిమల ఆలయంలోకి వెళ్తున్న వీడియో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది.

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కూడా మహిళలు అయ్యప్ప దర్శనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలను ధ్రువీకరించారు. ‘50ఏళ్ల లోపు మహిళలు ఇద్దరు నేడు ఆలయాన్ని దర్శించుకున్నారనేది నిజం. అంతకుముందు భద్రతా కారణాల వల్ల వారు ఆలయంలోకి వెళ్లలేకపోయారు. అయ్యప్ప దర్శనం చేసుకునేందుకు వచ్చే మహిళలకు మరింత భద్రత కల్పించాలని పోలీసులను ఆదేశించాం’ అని పినరయి తెలిపారు. కాగా, మహిళల ప్రవేశంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తంత్రి శబరిమల ద్వారాలను తాత్కాలికంగా మూసివేశారు. ఆలయ సంప్రోక్షణ చేపట్టారు.