చడీ చప్పుడు లేకుండా కరోనా కు వ్యాక్సిన్ సిద్ధం చేసిన రష్యా

ప్రపంచం మొత్తం కరోనా మహమ్మారితో తల్లడిల్లిపోతోంది. ఈ వైరస్ ఎదుర్కునే సమర్ధవంతమైన వ్యాక్సిన్ ఎపుడు వస్తుందా అని మానవాళి ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు ఇండియా లో భారత్ బయోటెక్ డెవలప్ చేసిన కోవాక్సిన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ డెవలప్ చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే జంతువుల పై ప్రయోగాలు ముగించుకుని క్లినికల్ ట్రయల్స్ లో ఉన్నాయి. ఐతే తాజాగా రష్యా శాస్త్రవేత్తలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా ప్రయోగాలు చేపట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశారు.

రష్యా రాజధాని మాస్కోలోని సెచెనోవ్ మెడికల్ యూనివర్సిటీలో జంతువుల పై ప్రయోగాలతో పాటు క్లినికల్ ట్రయల్స్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటికే వలంటీర్లకు ఇచ్చిన వ్యాక్సిన్ సత్ఫలితాలు ఇచ్చినట్టు ఆ యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యాక్సిన్ ను గమాలెయ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రోబయాలజీ రూపొందించింది. ఏ వ్యాక్సిన్ తో తొలి దశ క్లినికల్ ట్రయల్స్ జూన్ 18 నుండి స్టార్ట్ చేయగా, వ్యాక్సిన్ వేయించుకున్న వలంటీర్లు మొదటి బ్యాచ్ ఈ బుధవారం డిశ్చార్జి అవుతారని తెలుస్తోంది. మరికొందరు వలంటీర్లు ఈ నెల 20న డిశ్చార్జి అవుతారు.

ఈ వ్యాక్సిన్ సురక్షితమైనదా కాదా అనే విషయాన్ని ఈ క్లినికల్ ట్రయల్స్ లో పరీక్షించామని సెచెనోవ్ యూనివర్సిటీలోని ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ పారాసైటాలజీ, ట్రాపికల్ అండ్ వెక్టర్ బోర్న్ డిసీజెస్ డైరెక్టర్ అలెగ్జాండర్ లుకాషెవ్ తెలియచేసారు. ఈ ట్రయల్స్ లో తాము విజయవంతం అయ్యామని అయన అన్నారు. దీని తరువాతి దశలో ఎలాంటి పరీక్షలు చేపట్టాలన్నది వ్యాక్సిన్ రూపకర్తలు ఇప్పటికే డిసైడ్ అయ్యారని. అలాగే ఈ వ్యాక్సిన్ ప్రొడక్షన్ పై అతి త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని లుకాషెవ్ తెలిపారు.