అమెరికా సిటిజన్‌కి పుతిన్ రేర్ గిఫ్ట్

అలాస్కా సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఓ అమెరికా సిటిజన్ కు  ఊహించని గిఫ్ట్ ఇచ్చారు. రష్యాలో తయారైన బైక్‌ను బహుమతిగా ఇవ్వడంతో సదరు అమెరికా సిటిజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇటీవల పుతిన్, ట్రంప్ అలాస్కాలో సమావేశమైన సందర్భంగా ఈ ఘటన జరిగింది. పుతిన్ కంటే ముందు ఓ రష్యా బృందం అలాస్కాకు వచ్చింది. ఆ బృందంలో ఓ టీవీ ఛానల్ వారు కూడా ఉన్నారు. ఆ సమయంలో మార్క్ వారెన్ అనే వ్యక్తి అరల్ గేర్ అప్ అనే రష్యన్ మోటర్ సైకిల్‌పై దూసుకుపోతూ కనిపించారు. తన రోజువారీ పనులపై ఆయన బైక్ ‌నడుపుతూ వెళుతుండగా వారి కంటపడ్డారు. రష్యా బైక్ అమెరికాలో కనిపించడంతో ఆశ్చర్యపోయిన టీవీ బృందం సభ్యులు మార్క్‌ను ఇంటర్వ్యూ చేశారు.

ఈ సందర్భంగా అతడు తన బైక్ గురించి   చెప్పుకొచ్చారు. అది తనకు చాలా చాలా ఇష్టమైన బైక్ అన్నాడు. అయితే ఇప్పుడు పాతబడిపోయిందని తెలిపాడు. దాని విడి భాగాలు   అమెరికాలో దొరకట్లేదని అన్నాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఆ తరువాత కొన్ని రోజులకు మార్క్‌కు రష్యా దౌత్య బృందం నుంచి కబురు అందింది. మరో కొత్త బైక్ బహుమతిగా ఇవ్వనున్నట్టు వారు చెప్పారు. కానీ మార్క్ మాత్రం నమ్మలేదు. ఇదేదో ప్రాంక్ కాల్ అయి ఉంటుందని అనుకున్నాడు.

కానీ పుతిన్, ట్రంప్ మీటింగ్ ముగియానే రష్యన్ బృందం మరోసారి మార్క్‌ను సంప్రదించింది. తాము ఉంటున్న హోటల్ వద్ద అతడికి బైక్‌ను బహూకరించింది. ఇది పుతిన్ వ్యక్తిగత బహుమతి అని చెప్పి మరీ బైక్ తాళాలు ఇచ్చింది. దీంతో మార్క్ ఆశ్చర్యానికి అంతే లేకుండా పోయింది. ఇది నజమేనా? నమ్మలేకపోతున్నా అని ఆ రోజున జరిగిన విషయాన్ని మార్క్ గుర్తు చేసుకున్నారు. అంతకు రెండు రోజుల ముందే బైక్‌ను తయారు చేసి  అమెరికాకు పంపించినట్టు తనకు రిజిస్ట్రేషన్‌ పేపర్లు చూడగానే అర్థమైందని అన్నాడు. అది తన కోసమే ప్రత్యేకంగా తయారు చేసిన బైక్ అంటూ మురిసిపోయాడు. రష్యా బృందానికి ధన్యవాదాలు కూడా తెలిపారు. మార్క్ గతంలో అగ్నిమాపక దళంలో  పని చేసి రిటైర్ అయ్యారు. మరి ఈ బైక్ ఖరీదు ఎంతటి అంటారా?  మన కరెన్సీలో అక్షరాలా  19 లక్షల రూపాయలు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu