కాంగ్రెస్ వైపు మాజీ మేయర్ చూపు!

కారు దిగి చేయి అందుకునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. తాజాగా హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి కూడా  కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. టీడీపి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన తీగల కృష్ణారెడ్డి ఇప్పుడు ఆ పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. గత ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థిగా మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తీగల కృష్ణారెడ్డిపై  కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో విజయం సాధించిన సబితా ఇంద్రారెడ్డి ఆ తరువాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుని మంత్రి అయ్యారు.  రానున్న ఎన్నికలలో  మహేశ్వరం నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఆమెకే దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే తీగల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  అంతే కాకుండా సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా గొంతెత్తుతున్నారు. సబితా ఇంద్రారెడ్డితో విభేదాల కారణంగా ఆయన కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెరాస శ్రేణులే చెబుతున్నాయి. సబితా ఇంద్రారెడ్డిపై తీగల కృష్ణారెడ్డి ఆరోపణలు చేయడాన్ని వారు ఇందుకు తార్కానంగా చెబుతున్నారు. ఇఫ్పటికే మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే.

 టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెరాసలో అసంతృప్తులతో టచ్ లో ఉంటున్నారని చెబుతున్నారు. ఒక ప్రణాళిక మేరకు ఆయన తెరాస అసంతృప్తులను కాంగ్రెస్ లోనికి ఆహ్వానిస్తున్నారని అంటున్నారు.  ఇప్పటి వరకూ టీఆర్ఎస్, బీజేపీల మధ్యే పోటాపోటీ రాజకీయం నడుస్తోందని అంతా భావించారు.

అయితే ఆ రెండు పార్టీలనూ మించి కాంగ్రెస్ లోకి వలసలు పోటెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ రోజురోజుకూ బలోపేతం అవుతోందని ఆ పార్టీ నేతలే కాదు పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ ఈ జోరు కొనసాగించేందుకు నిర్ణయించుకుంది.