న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి వేద డేటాబేస్ వరకు.. రేమళ్ల అవధానులు ప్రస్థానం.!
Published on: Tue Nov 24, 2026 2:26PM

ఆధునిక డిజిటల్ యుగంలో కంప్యూటర్లు, స్మార్ట్‌ఫోన్‌లలో తెలుగు లిపి కనిపించడానికీ, సులువుగా రాయడానికీ కారణమైన సాంకేతిక సౌలభ్యం వెనుక సైంటిఫిక్ శ్రమ, అంతులేని భాషాభిమానం, తెలుగుపట్ల అపారమైన అభిమానం దాగి ఉన్నాయి. భారతీయ భాషలను కంప్యూటర్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టే దిశగా 1976లోనే కీలక అడుగులు వేసిన తెలుగు శాస్త్రవేత్త డాక్టర్ రేమెళ్ళ అవధానులు కృషి నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది. తెలుగు, దేవనాగరి వంటి లిపులను కంప్యూటర్‌లోకి తీసుకురావడమే కాకుండా, వేద విజ్ఞానాన్ని సాంకేతికతతో జోడించి భద్రపరిచేందుకు ఆయన చేపట్టిన ప్రయత్నాలు అనితర సాధ్యం అన్న రీతిలో గుర్తింపు పొందాయి.
డాక్టర్ రేమెళ్ళ అవధానులు 1948 సెప్టెంబర్ 25న తూర్పు గోదావరి జిల్లా పొడగట్లపల్లి గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు సూర్యనారాయణ, లక్ష్మీనరసమ్మ. విద్యాభ్యాసంలో ప్రతిభ కనబరిచిన ఆయన, ఆంధ్రా యూనివర్సిటీ నుంచిన్యూక్లియర్ ఫిజిక్స్ విభాగంలో ఎం.ఎస్సీ ప్రథమ శ్రేణిలో పూర్తి చేశారు. భౌతిక శాస్త్రంలో ఉన్నత విద్యాభ్యాసం చేసినప్పటికీ, సంప్రదాయ శాస్త్రాల పట్ల ఉన్న ఆసక్తితో, అనురక్తితో ఆ తర్వాత ఎం.ఏ సంస్కృతం, ఎం.ఏ జ్యోతిషం అభ్యసించారు. అక్కడితో ఆగలేదాయన, సంస్కృతంలో పి.హెచ్.డి, జ్యోతిషంలో పి.హెచ్.డి పూర్తి చేయడంతో పాటు డి.లిట్ పట్టా కూడా అందుకున్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని, ప్రాచీన శాస్త్ర జ్ఞానాన్ని ఒకే గొడుగులో సమన్వయం చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది.
వృత్తిపరంగా కూడా ఆయన విభిన్న రంగాల్లో సేవలు అందించారు. తన కెరీర్‌ను రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడిగా ప్రారంభించారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో సీనియర్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తూ.. టెక్నాలజీలో అనుభవం గడించారు. అనంతరం హైదరాబాద్‌లోని నిజాంస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో కంప్యూటర్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ చేశారు. ప్రభుత్వ, సాంకేతిక సంస్థల్లో ఆయన పనిచేసిన అనుభవం దేశంలోని ప్రాంతీయ భాషల కంప్యూటరీకరణ, డేటాబేస్ రూపకల్పన వంటి రంగాల్లో కీలకంగా ఉపయోగపడింది.

1976లో భారతీయ భాషలను కంప్యూటర్ తెరపైకి తీసుకురావడంలో డాక్టర్ అవధానులు పోషించిన పాత్ర సాంకేతిక చరిత్రలో ముఖ్యమైన ఘట్టం అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా తెలుగు మరియు దేవనాగరి లిపులను తొలిసారిగా కంప్యూటర్ వ్యవస్థలోకి ప్రవేశపెట్టడంలో ఆయన చేసిన కృషిని పార్లమెంట్ అధికార భాషా కమిటీ సైతం ప్రశంసించింది. ఆరంభ దశలో పరిమిత సాంకేతిక వనరులు ఉన్నప్పటికీ, భారతీయ లిపుల ప్రత్యేకతలను కంప్యూటర్ సాంకేతికతకు అనుగుణంగా తీర్చిదిద్దడంలో ఆయన చూపిన చొరవ భాషాభిమానులకు ఎంతో ఉపకరించింది. భాషా సాంకేతికతతో పాటు వేద సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో డా. అవధానులు 1994లో శ్రీ వేద భారతి ట్రస్ట్‌ను స్థాపించారు. వేద శబ్దం కాలక్రమేణా మరుగున పడకుండా, శాస్త్రీయ పద్ధతిలో డాక్యుమెంటేషన్ చేయాలనే లక్ష్యంతో సొంత నిధులతో, తన వేతనంలో నుంచే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బహుభాషా మల్టీమీడియా వేద డేటాబేస్ డిజైన్‌ను ఆయన రూపొందించిన తీరుకు ముగ్ధుడైన అప్పటి రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ విశేషంగా అభినందించారు. ప్రపంచంలోనే తొలి తరహా ప్రయత్నంగా దీనిని పేర్కొంటూ ఆయన ప్రశంసలు కురిపించారు.
ఇది కూడా చదవండి: భారత అణుశక్తి చరిత్రలో చెరగని ముద్ర.. తెలుగు తేజం పద్మశ్రీ మైనేని హరిప్రసాదరావు
ఆయన రూపొందించిన ఈ ఆవిష్కరణకు 2000 మార్చి నుంచి భారత ప్రభుత్వం పేటెంట్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ హక్కులను మంజూరు చేసింది. అనంతరం 2003లో భారత ప్రభుత్వం ఆయన్ను సంస్కృత మిత్ర బిరుదుతో సత్కరించి గౌరవించింది. ఆధునిక శాస్త్ర పరిశోధనలు, కంప్యూటర్ విజ్ఞానం కలిగిన వ్యక్తి సంస్కృతం, వేద శాస్త్రాల పరిరక్షణకు ఇంతలా కృషి చేయడం విద్యా, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక చర్చకు దారితీసింది. శ్రీ వేద భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో వేద మంత్రాల డిజిటల్ రికార్డింగ్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సుమారు 600 గంటల వేద మంత్రాల రికార్డింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది. అందుబాటులో ఉన్న మొత్తం వేద సాహిత్యాన్ని పూర్తిస్థాయిలో రికార్డ్ చేయడానికి 3,000 గంటల సమయం పట్టవచ్చని అంచనా వేస్తున్నారు. ఒకవైపు న్యూక్లియర్ ఫిజిక్స్ వంటి ఆధునిక భౌతిక శాస్త్రం, మరోవైపు ప్రాచీన వేద సంప్రదాయం.. ఈ రెండింటినీ అనుసంధానం చేసిన అరుదైన శాస్త్రవేత్త డాక్టర్ రేమళ్ల అవధానులు.

భారతీయ భాషల డిజిటల్ ప్రయాణంలో ప్రారంభ దశ కృషి, వేద వారసత్వ సంరక్షణకు చేపట్టిన మల్టీమీడియా ప్రాజెక్టులు రానున్న కాలంలో మరింత విస్తృత స్థాయిలో ఉపయోగపడే అవకాశం ఉంది. డిజిటల్ ఆర్కైవింగ్, భాషా సాంకేతికత రంగాల్లో పనిచేసే పరిశోధకులు, విద్యార్థులు, సంస్కృతి ప్రేమికులకు ఇలాంటి ప్రాజెక్టులు ఒక మార్గదర్శకంగా నిలుస్తాయనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. విజ్ఞానం, సాంకేతికత, సంప్రదాయాల మధ్య సమన్వయాన్ని సాధించిన డాక్టర్ రేమళ్ల అవధానులు కృషి మరువలేనిది, విస్మరించరానిది. ఇందులో సందేహానికి తావే లేదు.
రానున్న రోజుల్లో మిగిలిన వేద సాహిత్య రికార్డింగ్ ప్రక్రియ కూడా దశలవారీగా పూర్తి కావాలని, డిజిటల్ మాధ్యమాల ద్వారా ఈ విజ్ఞాన సంపద మరింత మందికి చేరువ కావాలనీ, అలాగే శాస్త్రీయ రంగంలో, భాషా సాంకేతికతలో తెలుగు వారు సాధించిన విజయాల గురించి నేటి తరం విద్యార్థులు, చిన్నారులకు తెలియజేయడం ద్వారా వారిలో పరిశోధన, సృజనాత్మకత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మొత్తంగా చూస్తే, కంప్యూటర్‌లోకి తెలుగు లిపిని తీసుకురావడంలో మార్గదర్శకత్వం వహించి, వేద విజ్ఞాన సంరక్షణకు శ్రమిస్తున్న డాక్టర్ రేమెళ్ళ అవధానుల ప్రస్థానం ఆదర్శనీయం. శాస్త్రీయ దృక్పథంతో సంప్రదాయ విలువలను కాపాడేందుకు సాగుతున్న ఈ కృషి వివరాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం.
మీకు నచ్చవచ్చు: ఏఐ యుగంలో విద్యా వ్యవస్థ మారాల్సిందే.. ప్రశ్నించడమే అసలైన బలం.!
ఓపెన్ ఏఐ సీటీవోగా ఉదయ్ రుద్రరాజు.!
[Remella Avadhanulu, Telugu angauge, Computerization, Sri Veda Bharati Trust, Veda Database, Sanskrit Mitra, TeluguOne]


