వరద విరాళాల కోసం ఒత్తిళ్లు? పవన్ పంచ్ తో పరేషాన్

వరద విపత్తు విరాళాల కోసం వేధిస్తున్నారా? కచ్చితంగా ఇంత ఇవ్వాల్సిందేనని కండీషన్లు పెడుతున్నారా? టాలీవుడ్ తీవ్ర ఒత్తిడిలో ఉందా? అంటే తెలుగు సినీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన ఘాటు వ్యాఖ్యలు అందుకేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ వరద బాధితులను ఆదుకునేందుకు భారీ ఎత్తున విరాళాలు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వంలోని కొందరు పెద్దలు.. టాలీవుడ్ ప్రముఖులకు ఫోన్లు చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో దుమారం రేపుతోంది. పవన్ కల్యాణ్ ఘాటు స్పందనతో సంచలనంగా కూడా మారింది 
    

ప్రభుత్వంలోని ఓ మంత్రి నేరుగా విరాళాల కోసం ఫోన్లు చేస్తున్నారనే వ్యవహారం తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాయం ప్రకటిస్తే తీసుకోవాలి కానీ.. ఇలా ఫోన్లు చేసి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేయటం ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. గతంలో చాలా విపత్తులు వచ్చాయని, కాని ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదని కొందరు సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం  చేస్తున్నారు. సాయం అన్నది ఎవరికి తోచినట్లు వారు చేస్తారు...  సాయం ఎంత చేయాలో 'ఫిక్స్' చేస్తున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 

 

హైదరాబాద్ వరద బాధితుల కోసం ఇప్పటికే చాలా మంది టాలీవుడ్ స్టార్లు ముందుకు వచ్చారు. విరాళాలు కూడా ప్రకటించారు. హీరో ప్రభాస్ కోటిన్నర రూపాయలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోటి రూపాయల లెక్కన సీఎంఆర్ఎఫ్ కు సాయం ప్రకటించారు. నాగార్జున, ఎన్టీఆర్ లు ఏభై లక్షలు ప్రకటిస్తే..విజయదేవరకొండ పది లక్షలకు ఏకంగా సీఎంఆర్ఎఫ్ కు బదిలీ చేశారు. మరికొంత మంది దర్శకులు, నటులు కూడా తమకు తోచిన వరద సాయం ప్రకటించారు. అయినా ఇంకా విరాళాల కోసం ఒత్తిడి చేయడంపై విమర్శలు వస్తున్నాయియ 

 

ఫోన్లు, ఒత్తిళ్ల  విషయం తెలియడం వల్లే పవన్ కళ్యాణ్ ఘాటు వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. సినిమా వాళ్ళ కంటే రాజకీయ నేతలు, మౌలికసదుపాయాల కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. అంతే కాదు..ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసే నేతలు ఇప్పుడు రాజకీయానికి పెట్టుబడి అనుకుని డబ్బు బయటకు తీయాలని అన్నారు. ఇండస్ట్రీలో పేరు ఉన్నంతగా డబ్బు ఉండదని క్లారిటీ ఇచ్చారు జనసేనాని. ఆరెంజ్ సినిమాకు నష్టం వస్తే ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పారు. అత్తారింటికి దారేది చిత్రం విడుదలకు ముందే ఆన్ లైన్ లో పైరసీకి గురైతే కొనడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో.. గ్యారంటీ పత్రాలపై సంతకాలు చేసి రిలీజ్ చేయాల్సి వచ్చిందన్నారు. ఒక వ్యక్తి సినిమా పరిశ్రమలో రూ.1 కోటి సంపాదిస్తే కొంత జీఎస్టీ ద్వారా పోతుంది. అన్ని పన్నులు పోయి చేతిలో మిగిలేది రూ.55 లక్షల నుంచి రూ.60 లక్షలేనని చెప్పారు. నష్టం వస్తే ఆ డబ్బు కూడా మిగలదని.. జీవితాలు కోల్పోయిన వాళ్లు ఇండస్ట్రీలో ఉన్నారని చెప్పారు పవన్. 

 

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను సినీ ప్రముఖులంతా  స్వాగతిస్తున్నారు. సాయం అనేది స్వచ్చందంగా ఉండాలి కానీ.. ఫోన్లు చేసి సాయం ప్రకటించాలని ఒత్తిడి చేయటం సరికాదనే అభిప్రాయాలు సినీ వర్గాల నుంచి వస్తున్నాయి. కరోనా కారణంగా సిని పరిశ్రమ కుదేలైంది. కొన్ని నెలలుగా ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. ఈ సమయంలో విరాళాల కోసం ఒత్తిడి తేవడం సరికాదంటున్నారు సినీ ప్రముఖులు.