ఈసారి రిపబ్లిక్ డే టైమ్ మారింది.. ఆటో డ్రైవర్లే ప్రత్యేక గెస్టులు

స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలు వచ్చాయంటే మన ప్రభుత్వాల దృష్టి అంతా భద్రత మీదనే కేంద్రీకృతమవుతుంది. పోయినసారి రైతుల రూపంలో తీవ్రమైన నిరసనలు, విపరీతమైన టెన్షన్స్ వెల్లువెత్తాయి. ఈసారి అలాంటివేం లేకపోయినా పతాకావిష్కరణ టైమ్ మాత్రం మారింది. ఉత్తరాదిన పొగ మంచు కమ్మేసి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అటు కరోనా థర్డ్ వేవ్ (ఒమిక్రాన్ కేసులు) ప్రభావం పెరుగుతోంది. ఇలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి జెండావిష్కరణ టైమ్ ను అరగంట పాటు వెనక్కి జరిపారు. ఉదయం 10 గంటలకు జరగాల్సిన పతాకావిష్కరణను రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ 10.30 కు నిర్వహిస్తారని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. సాధారణంగా స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రధాని, రిపబ్లిక్ డే పురస్కరించుకొని రాష్ట్రపతి జాతీయ జెండాను ఆవిష్కరించడం సంప్రదాయం. 

అటు ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ భారీ నిఘా పెట్టారు. గణతంత్ర వేడుకులకు ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా సంస్థలు హెచ్చరించడంతో కేంద్ర, రాష్ట్ర భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులను గుర్తించేందుకు ప్రత్యేక సాప్ట్‌వేర్‌తో కూడిన సీసీ కెమెరాలు వాడుతున్నారు. ఫేస్‌ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర‌్ ద్వారా.. కనిపిస్తున్న వ్యక్తులు ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తున్నారు. ఢిల్లీలోని 30 సమస్యాత్మక ప్రాంతాల్లో ఇలాంటి సీసీ కెమెరాలు వాడుతున్నారు. ఈ వేడుకల సందర్భంగా 65 కంపెనీలకు చెందిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు సహా 27 వేల మంది పోలీసులను మోహరించారు. ఇప్పటికే ఢిల్లీలోని పలు ప్రాంతాలను భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. 

ఈసారి ప్రత్యేక గెస్టుల్లోనూ ప్రత్యేకతే..

గతేడాది లాగే ఈసారి కూడా గణతంత్ర వేడుకలకు ప్రత్యేకమైన  విదేశీ అతిథి ఎవరినీ ఆహ్వానించలేదు. పోయినసారి కరోనా మహమ్మారి సెకండ్ వేవ్, ఈసారి థర్డ్ వేవ్ గణతంత్ర వేడుకలను మినిమైజ్ చేసిందనే చెప్పాలి. అయినా ప్రత్యేకంగా నిర్వహించడంలో తగ్గేదే లేదంటున్నారు కేంద్ర సర్కారు పెద్దలు. రిపబ్లిక్ డే  పేరడ్స్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఆటో డ్రైవర్లు, కన్స్ ట్రక్షన్ వర్కర్లు, శానిటేషన్ సిబ్బందినీ ఆహ్వానించారు. దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.