సినీ నటుడు రంగనాథ్ ఆత్మహత్య

 

ప్రముఖ సినీనటుడు రంగనాథ్ (66) శనివారం ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ 1949లో చెన్నైలో జన్మించారు. రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్‌. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. రైల్వే టీసీగా పనిచేస్తూ, ఉద్యోగాన్ని విడిచిపెట్టి సినిమారంగంలోకి ప్రవేశించారు. బుధ్దిమంతుడు సినిమాతో సినిమా రంగానికి వచ్చిన ఆయన 1973లో 'చందన' అనే సినిమాలో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. 'పంతులమ్మ' సినిమా ద్వారా ఆయన తెలుగు ప్రేక్షకుల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు. రంగనాథ్ సుమారు 300 చిత్రాలకు పైగా చిత్రాల్లో నటించారు. పలు టీవీసీరియల్లోనూ నటించారు. మొగుడ్స్‌-పెళ్లామ్స్‌ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు ఆయన. 50 చిత్రాల్లో హీరోగా, 50 చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించిన రంగనాథ్ ప్రేక్షకుల నుంచి మంచి నటుడిగా ప్రశంసలు అందుకున్నారు. రంగనాథ్ ఆత్మహత్య పట్ల తెలుగు సినిమా రంగం, తెలుగు ప్రజలు దిగ్భ్రాంతికి గురయ్యారు. రంగనాథ్ సున్నితమైన హృదయం కలిగిన వ్యక్తి. దశాబ్దాల క్రితం ఆయన భార్య మేడ మీద నుంచి కింద పడిపోవడం వల్ల కాళ్ళు పడిపోయాయి. మంచానికే పరిమితమైన ఆమెకు రంగనాథ్ ఎంతో సేవ చేశారు. ఒక మంచి భర్తగా రంగనాథ్ పేరు పొందారు. అయితే ఆమె కొద్దికాలం క్రితం మరణించారు. తనతో ఎంతో అనుబంధం పెనవేసుకున్న భార్య మరణాన్ని రంగనాథ్ జీర్ణించుకోలేకపోయారు. అప్పటి నుంచి మనిషిలో ఎంతో మార్పు వచ్చింది. ఇటీవల ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, తనకు జీవితంలో ఇంకేమీ కోరికలు లేవని... మరణం కోసం ఎదురుచూస్తున్నానని వ్యాఖ్యాన్నించారు.