రాష్ట్ర పండుగగా రామోజీ జయంతి: చంద్రబాబు ప్రకటన.!
Published on: Tue Nov 17, 2026 8:46AM

తెలుగు మీడియా దిగ్గజం, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత రామోజీరావు జయంతి వేడుకలను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు. ప్రజాశ్రేయస్సు, విలువలతో కూడిన పాత్రికేయం, సమాజహితమే ఊపిరిగా జీవించిన మహనీయుడి సేవలకు చిరస్థాయిగా గుర్తింపునిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. రామోజీరావు అందించిన గొప్ప స్పూర్తిని భావితరాలకు చేరువ చేసే లక్ష్యంతో ఏటా ఆయన జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.
రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై నుంచి చంద్రబాబు ఈ ప్రకటన చేశారు. రామోజీ ఎక్స్ లెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా వచ్చారు. ఆయన సమక్షంలోఈ వేదికపై నుంచి సీఎం చంద్రబాబు ఈ ప్రకటన చేయడం విశేషం. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు రామోజీరావుతో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఏ రంగంలోనైనా రాజీపడకుండా పరిపూర్ణత కోసం పరితపించే వ్యక్తిత్వం రామోజీరావుదన్న ఆయన కష్టపడి పైకొచ్చిన ఆయన జీవితం యువతకు ఒక దిక్సూచి, మార్గదర్శిగా నిలుస్తుందన్నారు.
వార్తల ప్రచురణలో విశ్వసనీయత, ఆధారాలుంటే ఏ వార్తనైనా ప్రచురించే స్వేచ్ఛను పాత్రికేయులకు ఇచ్చారని చంద్రబాబు చెప్పారు, ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి ఎంపిక వెనుక ఆయన చేసిన పరిశోధన, దూరదృష్టి దాగి ఉన్నాయన్నారు.

అమరావతి అభివృద్ధికి రామోజీ గ్రూప్ 10 కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిందని చెప్పిన చంద్రబాబు, దేశంలో ఎక్కడైనా విపత్తులు సంభవించినప్పుడు ముందుకు వచ్చి అండగా నిలిచిందని గుర్తుచేశారు.
ఇది కూడా చదవండి: రామోజీరావు ఒక ఎన్ సైక్లోపీడియా: యువతకు మార్గదర్శి.!
జీవితాంతం అనేక ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రామోజీరావు ఎక్కడా తలవంచలేదని.. తాను నమ్మిన సిద్ధాంతాల కోసం చివరి శ్వాస వరకు పోరాడారని , తెలుగు జాతి కీర్తిని జాతీయ స్థాయిలో ఇనుమడింపజేసిన మహోన్నత వ్యక్తి అని చెప్పిన చంద్రబాబు.. రామోజీరావు భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన స్థాపించిన సంస్థలు తరతరాలకు శాశ్వత ఆస్తులుగా నిలుస్తాయని తెలిపారు.

కాగా చంద్రబాబు రామోజీ జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన తరువాత ఆ ప్రకటనకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా రామోజీరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లకు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేసింది.
మీకు నచ్చవచ్చు: విజయవాడలో ఘనంగా రామోజీ ఎక్స్లెన్స్ అవార్డుల ప్రదానోత్సవం.!
ఒకప్పుడు ఆయన చేసింది ఆ వ్యాపారమే.. ఆ తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీ స్థాపించే స్థాయికి ఎలా ఎదిగారు.?
[RamojiRao, birth anniversary, AP state festival, CM Chandrababu Naidu, Ramoji Excellence Awards, TeluguOne]


